TTD Palla Srinivas Rao: గీత దాటితే చర్యలు తప్పవు
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:03 AM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఎంతటివారైనా వెనుకాడబోం
త్వరలోనే తిరువూరు వివాదానికి చెక్ పెడతాం
రమేశ్ రెడ్డి వ్యవహారంపై కొలికపూడితో సహా పార్టీకి ఎవరూ ఫిర్యాదు చేయలేదు: పల్లా శ్రీనివాసరావు
పార్టీ కార్యాలయానికి కార్యకర్తలతో తరలివచ్చిన రమేశ్ రెడ్డి
ఎంపీ కేశినేని చిన్నితో వచ్చిన నియోజకవర్గం మాజీ బాధ్యుడు శావల
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘ఎవ్వరికైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఎంతటివారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదంపై ఆయన స్పందించారు. ‘కొలికపూడి చెబుతున్నట్లు రమేశ్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ దృష్టికి తీసుకురాలేదు. ఇప్పటి వరకూ రమేశ్ రెడ్డిపై ఎవ్వరూ పార్టీ పెద్దలకు కానీ, నాకు కానీ ఫిర్యాదు చేయలేదు. త్వరలోనే తిరువూరు వివాదానికి చెక్ పెడతాం’ అని తెలిపారు. కాగా, కొలికపూడి ఆరోపణలు చేసిన రమేశ్ రెడ్డి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట భారీగా స్థానిక నాయకులు తరలివచ్చారు. ‘డౌన్ డౌన్ కొలికపూడి’, ‘తిరువూరుకు కొలికపూడి వద్దు’ అంటూ నినాదాలు చేశారు. వారితో పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యి సమస్యలను విన్నారు. వారి అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెంట తిరువూరు మాజీ ఇన్‌చార్జి శావల దేవదత్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇది కూడా చర్చనీయాంశమైంది. ‘తిరువూరు పంచాయతీని అధిష్ఠానం చూసుకుంటుంది. ప్రతి కుటుంబంలో చిన్నపాటి గొడవలు ఉంటాయి. తిరువూరు సమస్య కూడా కుటుంబ సమస్యలాంటిదే’ అని కేశినేని చిన్ని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News