Telugu Desam Party: ఆటుపోట్లతో రాటుదేలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:24 AM
తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ, ప్రాంతీయ రాజకీయాల్లో శక్తిమంతంగా మారింది. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ, తెలుగు ప్రజలకు ప్రధాన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలిచింది.

తెలుగుదేశం 43 ఏళ్ల ప్రస్థానం.. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని శక్తిమంతంగా మారిన ప్రాంతీయ పార్టీ తెలుగు జాతి సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ వారికి వెలుగుబాటై నిలిచింది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న ఈ పార్టీకి ఊపిరిపోశారు. 43ఏళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు.. అయినా రాటుదేలి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. నేడు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న ఈ పార్టీ పుట్టుకే పెను సంచలనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రధాన ఘట్టం. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి 1983 వరకు మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్ పాలనతో విసిగివేసారిన తెలుగు ప్రజలకు.. టీడీపీ.. రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలిచింది. చివరకు అదే ప్రధాన పక్షంగా నిలిచింది. జాతీయ రాజకీయాలను సైతం చేయిబట్టి నడిపే కీలకశక్తిగా ఆవిర్భవించింది. రాష్ట్ర విభజన తర్వాత.. అప్పుల కుంపటి నెత్తిన పెట్టుకున్న నవ్యాంధ్రకు ఏకైక ఆశాకిరణంగా నిలిచింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని.. పరాజయాలు ఎదురైనా అనతికాలంలోనే పుంజుకోవడం తెలుగుదేశం పార్టీ సహజ లక్షణమైంది. దాని ఆవిర్భావమే దేశంలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఒక నమూనా. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది. కేంద్రీకృత రాజకీయ వ్యవస్థకు సవాల్ విసిరింది. 1982లో ఆవిర్భావం తర్వాత 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరుగగా.. ఆరుసార్లు టీడీపీ విజయం సాధించింది. 1989, 2004, 09, 19ల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఈ గణాంకాలే ప్రజలకు టీడీపీపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్, చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనూ.. ముందుండి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 1996-98 నడుమ యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది. 1998, 99ల్లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వాల ఏర్పాటులోనూ చంద్రబాబు చక్రం తిప్పారు. 2024లో మూడోసారి ప్రధానమంత్రి అయిన మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారుకు టీడీపీయే ఆలంబనగా మారింది. నాదెండ్ల భాస్కరరావు సృష్టించిన ఆగస్టు సంక్షోభం మొదలు.. లక్ష్మీపార్వతి నుంచి పార్టీని కాపాడుకుని నిలదొక్కుకునేలా చేయడంలో.. 2004, 09ల్లో వరుస పరాజయాల అనంతరం ఫీనిక్స్ పక్షిలా ఎగిరి 2014లో అధికారం చేజిక్కించుకోవడం.. 2019-24 నడుమ తీవ్ర నిర్బంధాలను అధిగమించి 2024 ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేయడం వరకు ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకోవడం వల్లే సాధ్యపడింది.
కార్యకర్తలే బలం.. అభివృద్ధే పథం
టీడీపీకి మూలబలం కార్యకర్తలే. పార్టీ ఆశయాలకు కట్టుబడిన బలమైన కేడర్ దాని సొంతం. కోటిపైచిలుకు సభ్యత్వాల నమోదే దీనికి నిదర్శనం. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను.. వేధింపులను తట్టుకుని పార్టీ నిలబడగలిగిందంటే ప్రధాన కారణం కార్యకర్తలే. మెడపై కత్తి పెట్టి.. పార్టీ మారితే తప్ప వదిలేది లేదని బెదిరించినా.. పార్టీ జెండా కప్పుకొనే చనిపోతానని చెప్పి మరీ ప్రాణాలు విడిచిన చంద్రయ్యలే టీడీపీ బలం. అయినా పార్టీ కేడరా.. రాష్ట్రాభివృద్ధా అంటే.. అభివృద్ధి వైపే మొగ్గు చూపే విధానం ఆ పార్టీది.. చంద్రబాబుది. అందుకే ఆయన్ను వ్యతిరేకించేవారు కూడా.. అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే ఆయన్నే ఉదాహరణగా చెబుతుంటారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అంగీకరిస్తారు.
విప్లవాత్మక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లో.. 1982 వరకు కాంగ్రెస్ ఆధిపత్యమే సాగేది. కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, వారిని అవమానించడం..స్థానిక నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం.. వంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. ఆ సమయంలో ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయ కదన రంగంలోకి దూకిన ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. సామాజిక న్యాయమే ప్రధాన అజెండాగా.. పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా నాటినుంచి నేటి వరకు టీడీపీ రాజకీయ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. 43ఏళ్ల ప్రస్థానంలో నెలకొల్పిన రికార్డులు.. తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు.. ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో..!
ఆ లోపం వెంటాడుతోంది..!
ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఉన్నట్టే.. రాజకీయ పార్టీకీ పటిష్ఠ నిఘా యంత్రాంగం ఉండాలి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆగస్టు సంక్షోభం పార్టీని కుదిపేసింది. పార్టీకి అంతర్గత రాజకీయ నిఘా(పొలిటికల్ ఇంటెలిజెన్స్) ఎంత అవసరమో ఈ ఉదంతం చాటింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం కూడా టీడీపీపై బలమైన ప్రభావం చూపింది. పటిష్ఠమైన పోలీసు, నిఘా యంత్రాంగం ఉన్నా వ్యతిరేక ప్రచారాన్ని చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ఇది కూడా ఓ కారణమేనని ఆయనే అంగీకరించారు. దుష్ప్రచారాన్ని సకాలంలో దీటుగా తిప్పికొట్టలేకపోవడం బలహీనతగా మారిందని.. 43వ ఆవిర్భావ దినోత్సవం వేళ దిద్దుబాటు దిశగా నాయకత్వం అడుగులు వేయాల్సిన అవసరముందని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.
నేడు ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్, పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని, ఎన్టీఆర్ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను జిల్లావ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించింది.
ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారం..
టీడీపీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 294సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం.
స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన.. తిరిగి నెలరోజులకే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎన్టీఆర్ పాలనలో రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిహక్కు, కరణాలు, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీయే. ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20శాతం, మహిళలకు 9శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనతా టీడీపీ సొంతం.
మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనా ఈ పార్టీదే. 1985లో ఆ కార్పొరేషన్‌ను స్థాపించారు.
తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ, విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం.. ఇవన్నీ టీడీపీ హయాంలో పురుడుపోసుకున్నవే. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన కూడా ఎన్టీఆర్ నుంచే ప్రారంభమైంది. 1985 ఏప్రిల్ 6న తిరుమలలో నిత్యాన్నదాన పథకం ప్రారంభించడం చరిత్ర సృష్టించింది. మరిన్ని మెరుగులతో నేటికీ అప్రతిహతంగా సాగుతోంది.
రాష్ట్ర విభజన అనంతరం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. రాజధాని లేకుండా మిగిలిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేసి.. నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..