Share News

Tirumala Base Camp: తిరుమల దారిలో అలిపిరి బేస్‌క్యాంప్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:01 AM

తిరుమల ట్రాఫిక్‌ సమస్య, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు అలిపిరిలో 15 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధునిక బేస్‌క్యాంప్‌ ఏర్పాటు చేయనుంది టీటీడీ. 25 వేల మందికి వసతులతో పాటు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనుంది

Tirumala Base Camp: తిరుమల దారిలో అలిపిరి బేస్‌క్యాంప్‌

15 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళిక.. కొండపై వాహనాల రద్దీకి చెక్‌

  • క్యాంప్‌లోనే వాహనాల పార్కింగ్‌.. బస్సుల్లో కొండపైకి భక్తులు

  • పెరుగుతున్న భక్తులకు ఇక్కడే సౌకర్యాలు

  • 25 వేల మందికి వసతి కల్పించేలా చర్యలు

  • శేషాచలంలో పర్యావరణ పరిరక్షణకు కసరత్తు

  • బేస్‌క్యాంప్‌ ప్లాన్‌కు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

  • ఇకపై పనుల్లో వేగం పెంచనున్న అధికారులు

తిరుమల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కలియుగ వైకుంఠం తిరుమలలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఇబ్బంది పెడుతోంది. గోవింద నామాలు వినబడాల్సిన చోట హారన్ల మోత మారుమోగుతోంది. పెరిగిపోతున్న భక్తులకు కొండపై వసతి కల్పించడం కష్టంగా మారుతోంది. పెరుగుతున్న రద్దీతో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. వీటన్నింటికి చెక్‌ పెట్టడానికి అలిపిరిలో టీటీడీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న బేస్‌క్యాంప్‌ ప్రాజెక్ట్‌ కీలకంగా మారనుంది. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను తీర్చడంతో పాటు తిరుమల పవిత్రత, పర్యావరణాన్ని రక్షించడంలో ఆ ప్రాజెక్టు ప్రధాన పాత్ర పోషిస్తుందని టీటీడీ భావిస్తోంది. కొవిడ్‌ ముందు వరకు తిరుమలకు రోజుకు 5 వేల వాహనాలు చేరేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలకు పెరిగింది. దీంతో తిరుమలలో పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు శబ్ధకాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ విషయంలో సైలెంట్‌ జోన్‌లో ఉండాల్సిన తిరుమల కమర్షియల్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఒక్కో సమయంలో ఇండస్ట్రియల్‌ జోన్‌లోకి కూడా వెళ్లిపోతూ ప్రశాంతమైన వాతావరణం కనుమరుగవుతోంది. ఈ పరిస్థితులు శేషాచలం కొండల ఎకో-సిస్టమ్‌కి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. అలాగే, తిరుమలలో రోజుకు సగటున 68 వేల మంది భక్తులతో పాటు 20 వేల మంది స్థానికులకు నీటి, విద్యుత్‌ వనరులు సమకూర్చడం కూడా కష్టంగా పరిణమిస్తోంది.


ఇక వసతి విషయంలో ప్రధానంగా తిరుమలలో 7,790 టీటీడీ గదులు, 1,105 మఠాల గదులు, 6,800 లాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 55 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంటోంది. మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసమే టీటీడీ బేస్‌క్యాంప్‌ ప్రాజెక్ట్‌పై ప్రధాన దృష్టిసారించింది.

బేస్‌క్యాంపునకు లైన్‌ క్లియర్‌

తిరుమల విజన్‌-2047లో భాగంగా అలిపిరిలో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని భావించిన టీటీడీ ఈవో శ్యామలరావు ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. దీనికోసం 10 నుంచి 15 హెక్టార్ల స్థలాన్ని వినియోగించనున్నారు. గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేసి టీటీడీకే కేటాయించడంతో బేస్‌క్యాంప్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇటీవల టీటీడీపై సమీక్షలో ఈబేస్‌ క్యాంప్‌ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నుంచీ గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఇక పనులు వేగంవంతంగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.


బేస్‌క్యాంప్‌లో ఏముంటాయంటే..

ప్రధానంగా 25 వేల మంది భక్తులకు సకల సౌకర్యాలతో వసతి కల్పించేదిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో కొండపై భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది.

వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరే ప్రైవేట్‌ వాహనాలను ఈ బేస్‌క్యాంప్‌కు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం.. మోడల్‌ ట్రాన్స్‌ఫర్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేస్తారు

భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, స్నానాలు చేసేందుకు, భోజనం హాళ్లు, లాకర్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు.

భక్తులకు వసతి కేటాయింపు కార్యాలయాలతో పాటు వివిధ రకాల కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.

మ్యూజియం, కళాప్రదర్శన కేంద్రం, ఆధ్యాత్మికతను పెంచేలా వివిధ రకాల ఏర్పాటు ఉంటాయి.

ఈ బేస్‌క్యాంప్‌ అందుబాటులోకి వస్తే కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీటి, విద్యుత్‌ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించవచ్చని టీటీడీ భావిస్తోంది.

ట్రాఫిక్‌ సమస్య కూడా తగ్గిపోయి తిరుమలలో కేవలం గోవింద నామస్మరణ మాత్రమే వినిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 04:01 AM