US Navy in India: విశాఖలో అమెరికా యుద్ధనౌకల సందడి
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:34 AM
విశాఖపట్నం తీరంలో జరుగుతున్న టైగర్ ట్రయంఫ్-2025 లో పాల్గొనడానికి అమెరికా యుద్ధ నౌకలు 'యుఎస్‌ఎస్ కామ్‌స్టాక్', 'యుఎస్‌ఎస్ రాల్ఫ్ జాన్సన్' విశాఖ చేరుకున్నాయి. 3 వేల మంది సైనిక సిబ్బంది భారత నేవీతో కలసి అనేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో అమెరికా యుద్ధ నౌకలు సందడి చేస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి తూర్పు తీరంలో జరుగుతున్న టైగర్ ట్రయంఫ్-2025లో పాల్గొనడానికి అమెరికా నుంచి రెండు యుద్ధ నౌకలు (యుఎస్‌ఎస్ కామ్‌స్టాక్, యుఎస్‌ఎస్ రాల్ఫ్ జాన్సన్) ఇక్కడికి వచ్చాయి. వాటితో పాటు వచ్చిన సుమారు 3 వేల మంది నేవీ, సైనిక సిబ్బంది ఇక్కడి తూర్పు నౌకాదళంతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం వాలీబాల్, త్రోబాల్, యోగాసనాలు వంటివి చేస్తూ.. సాయంత్రం వేళ నగరంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లను గమనిస్తున్నారు. వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. మహిళా సెయిలర్లు షాపింగ్ మాల్స్‌ను సందర్శించి గోరింటాకుతో రకరకాల డిజైన్లు వేయించుకొంటున్నారు. యుఎస్‌ఎస్ కామ్‌స్టాక్ కమాండింగ్ ఆఫీసర్ బైరన్ స్టాక్స్ మాట్లాడుతూ..
ఇక్కడి వాతావరణం, కాలమాన పరిస్థితులు కొత్తగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ ఉండే ఈ 12 రోజులు ఎంతో అద్భుతంగా ఉంటాయని, కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
అబ్బుర పరుస్తున్న ‘కామ్‌స్టాక్’
టైగర్ ట్రయంఫ్-2025 కోసం విశాఖపట్నం వచ్చిన అమెరికా యుద్ధనౌక ‘కామ్‌స్టాక్’ అత్యాధునిక ఆయుధాలతో సందర్శకులను అబ్బుర పరుస్తోంది. ఇది విడ్‌బే ఐల్యాండ్ తరగతికి చెందిన డాక్ ల్యాండింగ్ యుద్ధనౌక. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు దీన్ని వినియోగిస్తున్నారు. అమెరికాలోని శాన్‌డియోగో నేవల్ బేస్ దీని స్థావరం. ఈ నౌక పొడవు 186 మీటర్లు. బీమ్ 26 మీటర్లు. డ్రాఫ్ట్ 6.4 మీటర్లు. బరువు 16,190 టన్నులు. గంటకు 20 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నౌకలో ఆయుధాలు, సరకులు, సెయిలర్లను సరఫరా చేయడానికి నాలుగు ల్యాండింగ్ క్రాఫ్ట్ ఎయిర్ కుషన్లు (హోవర్ క్రాఫ్ట్‌లు), మరో రెండు ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎనిమిది చక్రాలు, 11 మంది సిబ్బందితో పనిచేసే ఇన్‌పాంట్రీ కంబాట్ వెహికల్స్ (ఐసీయూ), అత్యాధునిక ఆయుధాలైన ఎంకే 38 క్యానన్స్, ఫలాంక్స్ సీఐడబ్ల్యూఎస్ మౌంట్స్, ఎం2హెచ్‌బీ మెషిన్ గన్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News