Share News

Venkaiah Naidu: పార్టీ ఫిరాయింపులు నిషేధించాలి

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:43 AM

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయాల్లో పార్టీ మార్పులను కట్టడి చేసే చట్టం రావాలని అభిప్రాయపడ్డారు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ విధానం ఖర్చు ఆదా చేయడంతో పాటు పాలన సజావుగా సాగేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఉచితాల పేరుతో ఎన్నికల రాజకీయాలు దేశ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయని, విద్య, వైద్యం తప్ప ఇతర రంగాల్లో ఉచితాలు నిరోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.

 Venkaiah Naidu: పార్టీ ఫిరాయింపులు నిషేధించాలి

విద్య, వైద్యం తప్ప ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ దేశానికి ఉపయోగం: వెంకయ్యనాయుడు

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు మంచినీళ్లు తాగినంత సులభంగా పార్టీలు మారుతున్నారు.. పార్టీ ఫిరాయింపులు నిషేధిస్తూ చట్టం తేవాలి.. పార్టీ మారిన వెంటనే పదవికి రాజీనామా చేయకపోతే వేటు పడేలా అందులో ఉండాలి..’ అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం’పై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. శివశంకర్‌ రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఉచితాల పేరుతో ఓట్లు వేయించుకుని, ప్రజల డబ్బు పంచుతూ నేతలు ఫొటోలు వేయించుకొంటున్నారు... రాష్ట్రాలు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.. ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులు అంచనా వేసిన తర్వాతే అప్పులు చేసేలా బ్రేకులు వెయ్యాలి’ అని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు కేరక్టర్‌, కేలిబర్‌, కెపాసిటీ, కాండక్ట్‌ చూసి పార్టీలు అభ్యర్థులను, ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకునేవారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు క్యాస్ట్‌, కమ్యూనిటీ, క్యాష్‌, క్రిమినాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ప్రామాణికం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాజకీయ పార్టీలు అభివృద్ధి, సంక్షేమ అజెండాతో ఎన్నికలకు వెళితే ఇప్పుడు అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ పార్టీల నాయకుల పేర్లతో వెళ్తున్నాయని అన్నారు.


అన్నీ ఉచితం అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేస్తున్న విన్యాసాలు ఏపీ, కర్ణాటక, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వ ఖజానాను దిగజార్చాయని ఆవేదన చెందారు. విద్య, వైద్యం తప్ప ఏదీ ఉచితంగా ఇవ్వరాదని, చేపలు పట్టడం నేర్పించాలి తప్ప... చేపల కూర పంచరాదని హితవు పలికారు. ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ మనకు కొత్త కాదని, 1952 నుంచి 1967వరకూ పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని వెంకయ్య గుర్తుచేశారు. దీనివల్ల ఎంతో ఖర్చు ఆదా అవడంతో పాటు దేశ జీడీపీకి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంటే రాజకీయ పార్టీలు సైతం ప్రజోపయోగ, సమర్థమైన నిర్ణయాలు తీసుకోలేవని చెప్పారు. జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల అభిప్రాయం అవసరం లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇందులో భాగమైతేనే అవసరమని వెంకయ్య స్పష్టం చేశారు. జస్టిస్‌ శివశంకర్‌ రావు మాట్లాడుతూ ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల వల్ల పాలన సజావుగా జరుగుతుందని అన్నారు. దేశాభివృద్ధిలో జమిలి ఎన్నిక కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, పార్థసారథి, కామినేని శ్రీనివాస్‌, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిఽధులు వల్లూరు జయప్రకాశ్‌, యామినీ శర్మ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:43 AM