Share News

కొరవడిన నిఘా

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:32 PM

ఆహ్లాదం, ఆధ్యాత్మికతను పంచే ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. తాగిన మైకంలో ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు, లైగింక వేధింపులు, బెదిరింపులకు కేంద్రాలవుతున్నాయి.

కొరవడిన నిఘా
వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో వేసిన మద్యం సీసాలు

ఆహ్లాదం కోసం వచ్చే ప్రాంతాల్లోనూ అసాంఘిక కార్యకలాపాలు

సీసీ కెమెరాల నిఘా అంతంతే.. పెట్రోలింగ్‌ మృగ్యం

ఆ ప్రదేశాలకు వెళ్తున్న ప్రేమ జంటలే ఆకతాయిలకు టార్గెట్‌

జన సంచారం తక్కువ ఉన్న ప్రాంతాలు తాగుబోతులకు అడ్డా

అక్కడే గంజాయి సేవనం.. మద్యం సిట్టింగులు.. జోరుగా పేకాట

ఆకతాయిలు బెదిరించి వేధిస్తున్నా.. పరువు కోసం ఫిర్యాదు కరవు

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆహ్లాదం, ఆధ్యాత్మికతను పంచే ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. తాగిన మైకంలో ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు, లైగింక వేధింపులు, బెదిరింపులకు కేంద్రాలవుతున్నాయి. కొరవడిన నిఘా నేత్రాలు, పెట్రోలింగ్‌ బృందాల గస్తీ లేని కారణంగా ఆకతాయిలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా ఉర్కొండపేటలో మహిళపై జరిగిన అత్యాచార ఉదంతం పలు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. తమ ప్రాంతాల్లో కూడా ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావం, అందుబాటులో ఉంటున్న మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో యువత గాడి తప్పుతోంది. మహిళపై అత్యాచార ఘటనలో నిందితులుగా రిమాండ్‌కు పంపిన వారంతా యువకులే కావడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ విషయమై పోలీసులకు పలువురు సమాచారం అందిస్తున్నా, పలు జిల్లాల్లో పట్టింపు లేకుండా పోయింది. ప్రధానంగా ఆహ్లాద ప్రాంతాలకు వస్తున్న వారు మేజర్లు కావడం, వారిని ప్రశ్నించే అధికారం లేకపోవడం, సున్నితమైన అంశం కావడంతో మందలించలేకపోవడం అధికారుల నిస్సహాయతగా మారుతోంది. ఇదే అదునుగా పోకిరి ముఠాలు చెలరేగుతున్నాయి. ఊర్కొండపేట ఘటనలో పట్టుబడ్డ నిందితులు రోజూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆకతాయిలకు అడ్డుకట్ట పడకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం లేకపోలేదు.

ప్రేమ జంటలే టార్గెట్‌..

ఉమ్మడి పాలమూరు ప్రతీ జిల్లా కేంద్రం సమీపంలో ప్రజలు కాసేపు ఆహ్లాదంగా గడపటం కోసం ఎకో పార్కులను ఏర్పాటు చేశారు. అక్కడికి ఉదయం వేళల్లో వాకర్స్‌ వస్తుండగా, సాయంత్రం వేళల్లో ఫ్యామిలీస్‌ వస్తున్నాయి. ఇక కాలేజీ సమయం ప్రారంభమైన తర్వాత నుంచి ప్రేమ జంటలకు పార్కులు ఆవాసాలుగా మారాయి. ఆ సమయాల్లో అటు వెళ్లాలంటే మిగతావారు జంకుతున్న పరిస్థితి ఉంది. మరి ఆ పార్కులు మొత్తం సీసీ కెమెరాల నిఘా ఉందా? అంటే అదీ లేదు. కేవలం ఎంట్రెన్స్‌ల వద్ద మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎవరూ రారనే కుంటిసాకులు పరోక్షంగా చెబుతున్నారు. అక్కడికేదో ప్రేమ జంటల కోసమే ఆ పార్కులు ఏర్పాటు చేసినట్లు.

వనపర్తి జిల్లాలో ఎకో పార్కు కూడా ప్రేమ జంటలకు ఆవాసంగా మారింది. పూర్తిగా చెట్లతో కమ్ముకుని ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అవుతోంది. జిల్లా కేంద్రంలోనే ఈ పార్కు ఉన్నా.. ఇప్పటివరకు పెట్రోలింగ్‌ కూడా చేయడం లేదు. తిరుమలయ్య గుట్ట సమీప అటవీ ప్రాంతం కూడా గతంలో నుంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ప్రేమ జంటలను బెదిరించి.. డబ్బులు దోచుకెళ్లిన ఘటనలు కూడా ఇక్కడ జరిగాయి.

గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీ, ఆర్టీవో కార్యాలయం వెనుకవైపు, రాఘవేంద్ర కాలనీ శివారు ప్రాంతాలను కూడా ఇలాంటి అడ్డాలకు వాడుకుంటున్నారు. ఇటీవల ఓ యాచకురాలికి కల్లు తాగించిన కొందరు ఆకతాయిలు అత్యాచారం చేసినట్లు తెలిసింది. కానీ అది బయటకు రాలేదు.

నారాయణపేటలో దేవాలయం పక్కన ఎకో పార్కు నిర్మించగా.. అది ప్రేమ జంటలకు నెలవుగా మారింది. అసాంఘిక కార్యకలాపాలు కూడా అక్కడ జరుగుతున్నాయి.

మహబూబ్‌నగర్‌లోని ఎకో పార్కులో కేవలం 12 సీసీ కెమెరాలు మాత్రమే ఎంట్రెన్స్‌ నుంచి కొద్దిదూరం వరకు ఉన్నాయి. ఇక్కడకి కూడా ప్రేమ జంటలు వచ్చి వెళ్తుంటాయి. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటివి బయటకు రాలేదు. అలాగే దేవాలయాలకు వెళ్తున్న జంటలు చుట్టుపక్కల జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్తూ ఆకతాయిల బెదిరింపులకు గురవుతున్నారు.

సోమశిల కాటేజీలను కూడా చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. వచ్చిన వారు ఎవరూ, ఏంటి అనేది చూడకుండానే రూమ్‌లు ఇస్తుండటంతో దుర్గటనలు జరిగే అవకాశం ఉంది.

గంజాయి, మందు సిట్టింగులకు అడ్డాలు..

పార్కులు, అటవీ ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలు గంజాయి బ్యాచ్‌లు, మందుబాబులకు అడ్డాలుగా మారాయి. తాగిన మైకంలో అక్కడికి వస్తున్న ప్రేమ జంటలను బెదిరించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారుతోంది. పరువు పోతోందని ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రతీ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని బ్యాచులు ఏర్పడి ఇదే పనిగా పెట్టుకుంటున్నాయి. బెదిరించి డబ్బులు గుంజడం కొందరు చేస్తుండగా.. మరికొందరు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణ తక్కువ కావడం, కాలేజీలకు అని చెప్పి వచ్చి బలాదూర్‌ తిరగడం, సిగరెట్లు, మందు, గంజాయి తాగడం నానాటికీ పెరుగుతోంది. అదే సమయంలో పార్కులు, ఎక్కువ మంది వచ్చే ప్రదేశాల్లో నిఘాను కూడా కట్టుదిట్టం చేయడం లేదు. మయూరీ నర్సరీలో కేవలం 12 కెమెరాలు మాత్రమే ఉన్నాయి. మెజారిటీ పార్కుల్లో ఎంట్రెన్స్‌ మినహాయించి.. ఎక్కడా నిఘా ఉండటం లేదు. సీసీ కెమెరాల నిఘా పెట్టి, సూచిక బోర్డులు పెట్టడం ద్వారా అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చు. జడ్చర్ల శివారులో యువకులు తరచూ గంజాయి తాగుతున్నారు. గతంలో యువకులు కూడా పట్టుపడ్డారు. ఖిల్లాఘణపురం మండలంలో గట్టు పరిసర ప్రాంతాల్లో హుక్కా తాగడం, గంజాయి తాగడం జరుగుతోంది. దొంతికుంట తండాలో మోడల్‌ స్కూల్‌ ఉండటంతో అక్కడ ఆకతాయిల ఆగడాలు కూడా పెరిగాయి. పెబ్బేరు మునిసిపాలిటీలోని సంత ప్రాంతాన్ని తాగుబోతులు అడ్డాగా మార్చుకున్నారు. మద్యం తాగడం, దొంగతనాలకు పాల్పడటం వంటివి ఇక్కడ చేస్తున్నారు. రేవల్లి మండలంలో కూడా యువకులు గంజాయి సేవిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దేవాలయాల ఆవరణలో కూడా మద్యం తాగుతున్నారు. అలాగే మద్యం తాగుతూ పేకాట ఆడటం, ఆ మత్తులో జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాలకు ఎవరైనా వస్తే వేధింపులు చేయడం పరిపాటిగా మారుతోంది. సీసీ కెమెరాలను పార్కులు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, సూచిక బోర్డులు పెట్టడంతోపాటు.. పెట్రోలింగ్‌ను కూడా పెంచితే అనుచిత, అసాంఘిక ఘటనలకు కళ్లెం వేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Apr 02 , 2025 | 11:32 PM