Water Pits ఏడు రోజులు.. 411 నీటి తొట్టెలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:29 PM
Seven Days... 411 Water Pits మూగజీవాల నీటి తొట్టెల నిర్మాణాలకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 9వ తేదీలోగా జిల్లాలో 411 వరకు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సుమారు రూ.1.23 కోట్ల ఉపాధి నిధులతో పనులు చేపడుతున్నారు.

రూ.1.23 కోట్లతో ఏర్పాటుకు చర్యలు
సమన్వయంతో పనులు చేపడుతున్న అధికారులు
జియ్యమ్మవలస, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మూగజీవాల నీటి తొట్టెల నిర్మాణాలకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 9వ తేదీలోగా జిల్లాలో 411 వరకు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సుమారు రూ.1.23 కోట్ల ఉపాధి నిధులతో పనులు చేపడుతున్నారు. వాస్తవంగా వేసవి తాపం నుంచి పశువులను రక్షించేందుకు ఊరూరా నీటి తొట్టెలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ శాఖ సిబ్బంది పశు సంవర్థకశాఖ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో ఇప్పటికే జిల్లాలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం ప్రారంభించారు. ఒక్కొ తొట్టె నిర్మాణానికి ఉపాధి హామీ ద్వారా రూ. 30 వేలు కాగా, ఇందులో కూలీకి రూ. 5,100 (17 శాతం), మెటీరియల్‌కు రూ.24,100 (83 శాతం) ఖర్చు చేస్తున్నారు. వారం పాటు పనుల పర్యవేక్షణ బాధ్యతను క్లస్టర్ ఏపీడీలకు ప్రభుత్వం అప్పగించారు. సాయంత్రం నాలుగు గంటల్లోగా రోజువారీ నివేదికను అందజేయాలని డ్వామా అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. తొట్టెలకు నీటి సౌకర్యం కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కుళాయిల మరమ్మతుల పనులను పంచాయతీరాజ్ అధికారులు చేయాల్సి ఉంది. కనెక్షన్ లేని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నారు. అయితే నీటి తొట్టెల నిర్మాణం ఈ నెల 9వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మంజూరు ఇలా
పాలకొండ, పార్వతీపురం రెవెన్యూ డివిజన్లలోని 15 మండలాల్లోని 405 గ్రామాల్లో 411 నీటి తొట్టెల నిర్మాణాలు అవసరమని అధికారులు గుర్తించారు. సీతానగరం, బలిజిపేట మండలాల్లోని 80 గ్రామాల్లో 84 , పార్వతీపురం, కొమరాడలోని 69 గ్రామాల్లో , సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలు ఉండగా వీటి పరిధిలో 77 గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించనున్నారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో 87, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో 23, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో 41, సీతంపేట, భామినిలో 28 గ్రామాల్లో 30 నీటి తొట్టెలు నిర్మిం చనున్నారు. వాటి ద్వారా 2019 పశు గణన ప్రకారం 2.29 లక్షల పశువులు, 47 వేల నల్ల జాతి దున్నలు, 2.07 లక్షల గొర్రెలు, 1.73 లక్షల మేకలకు తాగునీటి సౌకర్యం కలగనుంది.
గడువులోగా పూర్తి చేస్తాం
ఉపాధి నిధులతో నీటి తొట్టెల నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం. పంచాయతీరాజ్, డ్వామా, పశు సంవర్థకశాఖ అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తాం.
మన్మథరావు, జేడీ,జిల్లా పశు సంవర్థకశాఖ