స్వయం ఉపాధికి పెద్దపీట
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:26 AM
వెనుకబడిన తరగతులు (బీసీ), అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనంగా వున్న వారిలో (ఈడబ్ల్యూఎస్) పేదరికాన్ని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం బీసీ, ఓసీ కార్పోరేషన్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు అర్హులైన వారు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు సబ్సిడీపై రుణాలు
మూడు శ్లాబ్‌లుగా స్వయం ఉపాధి పథకాలు
శ్లాబ్-1 రూ.2 లక్షలు, శ్లాబ్-2 రూ.2-3 లక్షలు, శ్లాబ్-3 రూ.3-5 లక్షలు
అన్ని యూనిట్లకు 50 శాతం సబ్సిడీ
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు
ఈ నెల 22 వరకు గడువు
జిల్లాకు 2,732 యూనిట్లు మంజూరు
అనకాపల్లి/ రోలుగుంట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన తరగతులు (బీసీ), అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనంగా వున్న వారిలో (ఈడబ్ల్యూఎస్) పేదరికాన్ని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం బీసీ, ఓసీ కార్పోరేషన్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు అర్హులైన వారు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా స్వయం ఉపాధి రుణాల మంజూరు చేయలేదు. దీంతో ఆయా వర్గాలు స్వయం ఉపాధికి దూరమయ్యారు. అయితే గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. బీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (కమ్మ కాపు, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, బలిజ, తెలగ, ఒంటరి వగైరా) వారికి స్వయం ఉపాధి కల్పనకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. వ్యవసాయ అనుబంధ, రవాణా, పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి, చేతివృత్తుల వారికి సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తారు.
స్వయం ఉపాధి పథకాలను శ్లాబ్‌లుగా విభజించారు. శ్లాబ్-1 కింద యూనిట్ విలువ రూ.2 లక్షలుగా నిర్ధారించారు. శ్లాబ్-2 కింద యూనిట్ విలువ రూ.2-3 లక్షలు, శ్లాబ్-3 కింద రూ.3-5 లక్షలుగా నిర్ణయించారు. ప్రతి శ్లాబ్‌లో యూనిట్ విలువలో 50 శాతం సబ్సిడీ వుంటుంది. కిరాణా దుకాణం, పాన్ షాపు, పండ్లు/ కూరగాయల వ్యాపారం, పాలు/ పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, సెలూన్, మెకానిక్ షెడ్డు, ప్లంబింగ్, ఎలక్ర్టికల్, ఎంబ్రాయిడరీ, బుక్ స్టాల్, జెరాక్సు షాపు, ఇంటర్‌నెట్ సెంటర్, కేటరింగ్ యూనిట్, డ్రై ఫ్రూట్స్ షాపు, బియ్యం వ్యాపారం, ఫర్నీచర్ షాపు, వెల్డింగ్ షాపు, మినీ డెయిరీలు ఫారాలు, కోళ్ల ఫారం, మేకలు, గొర్రెల పెంపకం, టెంట్ హౌస్, కార్పెంటరీ, జనరిక్ మందుల దుకాణాలు, మినీ వ్యాన్, ఈ-ఆటో, ఈ-ట్రక్కు, పాసింజర్ ఆటో, పాసింజర్ ట్రక్కు, ఆటో తదితర యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక మేదర, కుమ్మరి, శాలివహన, ఇతర కుల వృత్తిదారులకు (ముగ్గురి నుంచి ఐదుగురి వరకు) ఎంఎస్‌ఎంఈ కింద బీసీ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా ఒక్కొక్క యూనిట్‌కు బ్యాంకు రుణం రూ.1.5 లక్షలు, ప్రభుత్వ రాయితీ రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.3 లక్షల వరకు మంజూరు చేస్తారు.
వయసు అర్హత
కాపు, బలిజ, తెలగ, ఒంటరి అయితే 21 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు అర్హులు, ఇతర వర్గాలకు చెందిన వారు అయితే 21 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.1.03 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.81 వేలకు మించకూడదు. బియ్యం కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. చదువుకున్న వారైతే విద్యార్హత పత్రాలు కూడా అప్‌లోడ్ చేయాలి.
జిల్లాకు 2,732 యూనిట్లు
జిల్లాలో బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు 2,732 యూనిట్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత రూ.62.83 కోట్లు కేటాయించింది. అర్హులైన వారి నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మీసేవా కేంద్రాలు లేదా సచివాలయాలకు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఎంపీడీవోలకు నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు విధించారు.
అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చు
స్వయం ఉపాధి కోసం బీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారిలో అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకుడు జి.పెంటాజీరావు తెలిపారు. ల్లాస్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి బ్యాంకు లింకేజీతో సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు.