Share News

హత్యకు గురైంది ట్రాన్స్‌జెండర్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:22 AM

మండలంలోని బయ్యవరం సమీపంలో ఒక కల్వర్టు వద్ద మంగళవారం ఒక మహిళకు చెందిన కొన్ని శరీర భాగాలు లభ్యమైన సంఘటనకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు గురైంది మహిళ కాదని, ట్రాన్స్‌జెండర్‌ అని బుధవారం నిర్ధారించారు. మిగిలిన శరీర భాగాలను మరో రెండుచోట్ల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అతను ట్రాన్స్‌జెండర్‌తో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్టు పోలీస్‌ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

హత్యకు గురైంది  ట్రాన్స్‌జెండర్‌
పోలీసుల అదుపులో వున్న నిందితుడు బన్నీ (ఫైల్‌ఫొటో) హత్యకు గురైన ట్రాన్స్‌జెండర్‌ దీపు (ఫైల్‌ఫొటో)

పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

నాలుగేళ్ల నుంచి సహజీవనం

నాగులాపల్లిలో నివాసం

సోమవారం అర్ధరాత్రి అక్కడే హత్య

శరీరాన్ని ముక్కలుగా కోసి మూడుచోట్ల పడవేత

గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కశింకోట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని బయ్యవరం సమీపంలో ఒక కల్వర్టు వద్ద మంగళవారం ఒక మహిళకు చెందిన కొన్ని శరీర భాగాలు లభ్యమైన సంఘటనకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు గురైంది మహిళ కాదని, ట్రాన్స్‌జెండర్‌ అని బుధవారం నిర్ధారించారు. మిగిలిన శరీర భాగాలను మరో రెండుచోట్ల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అతను ట్రాన్స్‌జెండర్‌తో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్టు పోలీస్‌ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

కశింకోట మండలం బయ్యవరం సమీపంలోని అండర్‌ బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం రక్తపు మరకలతో ఒక మూట ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి మూటను విప్పగా...మహిళ నడుము నుంచి కింద భాగం, కుడి చెయ్యి మాత్రమే ఉన్నాయి. దీంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరో గుర్తు పట్టలేకపోయారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. మహిళను హత్య చేసి కొన్ని శరీర భాగాలను బయ్యవరం వద్ద పడేశారనే వార్త ఈ ప్రాంతంలో దావానలంలా వ్యాపించింది. ఈ నేపథ్యంలో మునగపాక మండలం నాగులాపల్లిలో ట్రాన్స్‌జెండర్‌ ఒకరు అద్దెకు వుంటున్న ఇంటి వెలుపల రక్తపు మరకలు చూసిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి క్లూస్‌ టీమ్‌ అక్కడకు వెళ్లి ఇంటిలో పరిశీలించారు. ఇంటిలో ఎవరెరు వుంటున్నారో పోలీసులు ఆరా తీశారు. బన్నీ అనే 30 ఏళ్ల యువకుడు, ట్రాన్స్‌జెండర్‌ కలిసి వుంటున్నట్టు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తరువాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్‌ పేరు మైపాలి దిలీప్‌ శివశంకర్‌ అలియాస్‌ దీపు (40) అని అతను చెప్పినట్టు సమాచారం. అతను ఇచ్చిన సమాచారంతో కశింకోట సీఐ స్వామినాయుడు, పోలీసు సిబ్బంది బుధవారం ఉదయం అనకాపల్లి పట్టణ శివారులోని జగలమదుం కూడలి సమీపంలో జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఒక బాక్సును స్వాధీనం చేసుకున్నారు. దానిని తెరిచిచూడగా తల, ఎడమ చేయి కనిపించాయి. వీటిని ప్యాక్‌ చేసి ఎన్టీఆర్‌ వైద్యాలయం మార్చురీకి పంపారు. అనంతరం నిందితుడిని వెంటబెట్టుకుని కశింకోట మండలం తాళ్లపాలెం మామిడివాక గెడ్డ వద్దకు వెళ్లారు. అక్కడ మిగిలిన శరీర భాగాలు (మొండెం) వున్న సంచిను అతను చూపించాడు. పంచనామా అనంతరం ఎన్టీఆర్‌ వైద్యాలయం మార్చురీకి తరలించారు. దీంతో బయ్యవరం వద్ద మంగళవారం లభించిన శరీర భాగాలు మహిళవిగా భావించిన పోలీసులు, బుధవారం మిగిలిన శరీర భాగాలు కూడా లభ్యమైన తరువాత హత్యకు గురైంది ట్రాన్స్‌జెండర్‌గా నిర్ధారించారు.

నాగులాపల్లి అద్దె ఇంటిలోనే హత్య?

ట్రాన్స్‌ జెండర్‌ దిలీప్‌ అలియాస్‌ దీపును సోమవారం అర్ధరాత్రి నాగులాపల్లిలోని అద్దె ఇంటిలోనే హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి, బెడ్‌షీట్‌లో, బాక్సులో, సంచిలో వేసుకుని మూడుచోట్ల పడేసినట్టు పోలీసుల విచారణలో బన్నీ చెప్పినట్టు తెలిసింది.

దీపుగా మారిన దిలీప్‌

హత్యకు గురైన ట్రాన్స్‌జెండర్‌ అసలు పేరు మైపాలి దిలీప్‌ శివశంకర్‌ (40). అనకాపల్లి గవరపాలెంలో ఉన్న ముత్రాసుకాలనీకి చెందిన దిలీప్‌..ట్రాన్స్‌జెండర్‌గా మారి ‘దీపు’గా పేరుమార్చుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా వున్నాడు.

నాలుగేళ్ల నుంచి సహజీవనం

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలాడకు చెందిన బన్నీ కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అనకాపల్లి వచ్చాడు. ఒక ఫుడ్‌ డెలివరీ కంపెనీలో బాయ్‌గా పనిచేస్తుండగా ట్రాన్స్‌జెండర్‌ దీపుతో పరిచయం ఏర్పడింది. సుమారు నాలుగేళ్ల నుంచి వీరు సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఏడాది క్రితం మునగపాక మండలం నాగులాపల్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం వుంటున్నారు. వీరిరువురూ తరచూ గొడవ పడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కాగా కేసుకు సంబంధించి పూర్తి వివరాలను గురువారం మీడియాకు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.

హత్యపై స్పందించిన సీఎం

అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో మహిళను (తరువాత ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు) కిరాతకంగా హత్య చేసిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఎంకు జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు, అనకాపల్లి జిల్లా ఎస్పీతో ముఖ్యమంత్రి మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం మరోసారి ఆయన అనకాపల్లి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని ఆదేశించారు.

Updated Date - Mar 20 , 2025 | 01:22 AM