Share News

ఆరోగ్య కేంద్రాల్లో అంతంతమాత్రం సేవలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:24 AM

నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ (పట్టణ ఆరోగ్య కేంద్రాలు)లో ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మందులు అందుబాటులో లేవు. మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. ఇంకొన్నిచోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ‘ఆంధ్రజ్యోతి’ బృందం బుధవారం నగరంలో కొన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, అక్కడ ఉన్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఆరోగ్య కేంద్రాల్లో  అంతంతమాత్రం సేవలు

నగర పరిధిలో 66 అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌...

పలుచోట్ల అందుబాటులో లేని మందులు

వైద్య పరీక్షల నిర్వహణకు కెమికల్స్‌ కొరత

కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది సెలవులో ఉండడంతో సేవలపై ప్రభావం

ఖాళీగా కనిపిస్తున్న కేంద్రాలు

సెంటర్స్‌పై సరైన అవగాహన లేకపోవడమే కారణం

విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ (పట్టణ ఆరోగ్య కేంద్రాలు)లో ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మందులు అందుబాటులో లేవు. మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. ఇంకొన్నిచోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ‘ఆంధ్రజ్యోతి’ బృందం బుధవారం నగరంలో కొన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, అక్కడ ఉన్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేసింది.

అందుబాటులో లేని మందులు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో నగరంలో 66 చోట్ల పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేశారు. కేంద్రాల్లో సిబ్బంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలి. ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 172 రకాల మందులు ఉండాలి. అయితే, అనేక కేంద్రాల్లో కీలకమైన మందులు లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. రేసపువానిపాలెం అర్బన్‌ హె ల్త్‌ సెంటర్‌లో బీపీ, షుగర్‌ మందులు ఇవ్వడం రోగులు చెప్పారు. సాధారణంగా హెల్త్‌ సెంటర్స్‌కు వచ్చే రోగుల్లో దాదాపు 30 శాతం మంది షుగర్‌, బీపీ సంబంధిత సమస్యలతో బాధపడేవారే ఉంటున్నారు. అటువంటి వారికి అవసరమైన మందులే లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోంది.

రక్త పరీక్షలకు ఇబ్బంది

ప్రతి ఆరోగ్య కేంద్రంలో 64 రకాల రక్త పరీక్షలు చేయాలి. అయితే, కొన్నిచోట్ల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కెమికల్స్‌, మరికొన్నిచోట్ల పరికరాలు లేవు. దీంతో పరీక్షలు చేయలేని పరిస్థితి. రేసపువానిపాలెంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఎల్‌ఎఫ్‌టీ పరీక్షలు చేయడం లేదు. మద్దిలపాలెం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కొలెస్ర్టాల్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన కెమికల్స్‌ (రీ ఏజెంట్స్‌) లేవని సిబ్బంది చెబుతున్నారు. అల్లిపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో లిఫిడ్‌ ప్రొఫైల్‌, లివర్‌ ఫంక్షనింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రీ ఏజెంట్స్‌ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. రెల్లివీధిలోని జాలారిపేట ప్రాంతంలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి.

సెలవులతో ఇబ్బంది

అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో కొన్నిచోట్ల మినహా ఒక వైద్యుడు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, ఒక హెల్పర్‌ ఉంటారు. ఒక్క డాక్టరే ఉన్నచోట...ఆయన సెలవు పెడితే ఇబ్బంది ఎదురవుతోంది. బుధవారం రేసపువానిపాలెం, మద్దిలపాలెం అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లోని వైద్యులు సెలవులో ఉన్నారు. రేసపువానిపాలెం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో స్టాఫ్‌ నర్సే రోగులను పరీక్షిస్తున్నారు. మద్దిలపాలెం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోనూ అదే పరిస్థితి. ఈ సెంటర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కూడా సెలవులో ఉండడంతో రోగులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడింది.

మరికొన్ని ఇబ్బందులు..

కొన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో మంచి నీటి సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా వాటర్‌ ట్యాంకులు ఏర్పాటుచేశారు. అయితే, కొన్నిచోట్ల పనిచేయడం లేదు. దీంతో హెల్త్‌ సెంటర్స్‌కు వచ్చే రోగులకు మంచినీటి ఇబ్బందులు తప్పడం లేదు. చినవాల్తేరు ఆరోగ్య కేంద్రంలో వాటర్‌ ఫ్యూరిఫైర్‌ యంత్రాలు మూలకు చేరి ఉన్నాయి. వేసవిలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో ప్రత్యేకంగా ఓఆర్‌ఎస్‌ కార్నర్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, అనేకచోట్ల ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ వద్ద బాటిల్‌ నీరు, ప్యాకెట్లు పెట్టి వదిలేశారు.

అవగాహన ఏదీ.?

ఇదిలావుంటే అవగాహన లేక ప్రజలు కూడా స్థానికంగా ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌కు వెళ్లడం లేదు. ఒక్కో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో దాదాపు 20 వేల మందికిపైగా ఉంటారు. కానీ, బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ చాలాచోట్ల కనీసం 20 మంది కూడా ఆరోగ్య కేంద్రాల సేవలను వినియోగించుకోలేదు. ఒకవైపు అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ వెలవెలబోతుంటే..మరోవైపు కేజీహెచ్‌, విమ్స్‌ మాత్రం రోగులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దాస్పత్రులకు తాకిడి తగ్గాలంటే స్థానికంగా ఆరోగ్య కేంద్రాల్లో అందించే వైద్య సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చూడాలి.

Updated Date - Mar 20 , 2025 | 01:24 AM