గజం రూ.75,560
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:20 AM
ఎండాడలో రాజీవ్ స్వగృహకు చెందిన భూమికి ప్రభుత్వం కొత్త ధర నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతూ గజం రూ.60 వేల ఽధర నిర్ణయించింది. ఆ ప్రకారం ఎన్నికల ప్రకటన వచ్చే ముందు అంటే 2024 ఫిబ్రవరిలో వేలం నిర్వహించి 32 ప్లాట్లను విక్రయించింది. వేలంపాటలో వైసీపీ వర్గీయులే పాల్గొని గజం రూ.60,500 చొప్పున తీసేసుకున్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు.

ఎండాడలో ‘రాజీవ్ స్వగృహ’ భూమికి ధర నిర్ణయించిన ప్రభుత్వం
గతంలో గజం రూ.60 వేలకు అమ్మేసిన వైసీపీ పెద్దలు
ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదుతో కమిటీ నియామకం
కొత్త ధరపైనే విక్రయించాలని నిర్ణయం
విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):
ఎండాడలో రాజీవ్ స్వగృహకు చెందిన భూమికి ప్రభుత్వం కొత్త ధర నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతూ గజం రూ.60 వేల ఽధర నిర్ణయించింది. ఆ ప్రకారం ఎన్నికల ప్రకటన వచ్చే ముందు అంటే 2024 ఫిబ్రవరిలో వేలం నిర్వహించి 32 ప్లాట్లను విక్రయించింది. వేలంపాటలో వైసీపీ వర్గీయులే పాల్గొని గజం రూ.60,500 చొప్పున తీసేసుకున్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. వాటిని వెనక్కి తీసుకోవాలని ఇటీవల అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఇకపై వాటిని విక్రయించాలంటే కొత్త ధర నిర్ణయించాలని కూడా కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ధర నిర్ణయానికి ఐదుగురితో కమిటీని వేసింది. పురపాలక శాఖ డైరెక్టర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీలతో కమిటీ వేసింది. వారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి గజం ధర రూ.75,560 పెట్టవచ్చునని సూచించారు. దీంతో ప్రభుత్వం ఆ ధరను అప్‌సెట్ ధరగా పెట్టి వేలం నిర్వహించి, అంతకు మించి ఎంత వస్తే అంతకు విక్రయించాలని సూచిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది.
గతంలో ఏమి జరిగిందంటే..?
రాజీవ్ స్వగృహ కింద మధ్య తరగతి ప్రజలకు ఫ్లాట్లు నిర్మించడానికి 2009లో ప్రభుత్వం ఎండాడలోని సర్వే నంబరు 16లో 57.73 ఎకరాలు కేటాయించింది. ఆ పథకం సక్రమంగా సాగకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అందులో 6.55 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు. టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించింది. మరో 2.7 ఎకరాలు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి స్మృతి వనం నిర్మాణానికి ఇచ్చారు. ఆక్రమణలు కూడా కొన్ని ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ పోగా ఇంకా 43.31 ఎకరాలు ఉందని లెక్కలు తేల్చారు. వైసీపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ అమ్మి సొమ్ము చేసుకునే క్రమంలో వీటిని కూడా అమ్మకానికి పెట్టింది. మొత్తం భూమిని ఏడు ప్లాట్లు (ఒక్కొక్కటి కనీసం ఐదు ఎకరాలు)గా విభజించింది. అంత పెద్ద ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో వాటిని 76 ప్లాట్లుగా విభజించారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం మూడు వేల గజాల నుంచి పది వేల గజాల వరకు పెట్టారు. ధర బాగా తగ్గించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం రిజిసే్ట్రషన్ ధర గజం రూ.50 వేలు ఉండగా, రాజీవ్ స్వగృహ అధికారులు గజం రూ.60 వేలకే అప్‌సెట్ ధర నిర్ణయించారు. వాస్తవానికి బయట గజం లక్ష రూపాయల వరకు ఉంది. ఇదే అదనుగా భావించిన వైసీపీ పెద్దలు వారి అనుచరులను రంగంలో దింపి గజానికి రూ.500 ఎక్కువ వేసి అంటే రూ.60,500 చొప్పున 32 ప్లాట్లను సొంతం చేసుకున్నారు. ఇదంతా 2024 ఎన్నికల ప్రకటనకు ముందు జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఈ కుంభకోణంపై ప్రశ్నించారు. ఆ వేలంలో అమ్మిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం వాటిపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం ఇంకో 39 ప్లాట్లు అందుబాటులో ఉండగా, వాటిని అప్‌సెట్ ధర రూ.75,560తో అమ్మాలని సూచించింది.