Share News

మహా నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:21 AM

జీవీఎంసీ బడ్జెట్‌ (2025-26 ఆర్థిక సంవత్సరం) సమావేశం నిర్వహణలో తాత్సారం జరుగుతోంది. సాధారణంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి రెండు నెలల ముందే బడ్జెట్‌ ముసాయిదాను అధికారులు రూపొందిస్తే దానిని స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చించి ఆమోదించాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం నిధులను ఖర్చు పెట్టాలి. అయితే ఈ ఏడాది జీవీఎంసీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంతవరకూ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందలేదు.

మహా నిర్లక్ష్యం

బడ్జెట్‌ సమావేశం నిర్వహణలో తాత్సారం

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఇప్పటికీ కౌన్సిల్‌ ఆమోదం పొందని వైనం

మరో పది రోజులే సమయం

ఆ తరువాత జీవీఎంసీ ఖాతా నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా వీలుకాదంటున్న అధికారులు

వచ్చే నెల నుంచి నిలిచిపోనున్న

అన్నిరకాల చెల్లింపులు

తక్షణం బడ్జెట్‌ సమావేశం ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్‌కు మేయర్‌ లేఖ

విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ బడ్జెట్‌ (2025-26 ఆర్థిక సంవత్సరం) సమావేశం నిర్వహణలో తాత్సారం జరుగుతోంది. సాధారణంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి రెండు నెలల ముందే బడ్జెట్‌ ముసాయిదాను అధికారులు రూపొందిస్తే దానిని స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చించి ఆమోదించాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం నిధులను ఖర్చు పెట్టాలి. అయితే ఈ ఏడాది జీవీఎంసీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంతవరకూ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందలేదు.

బడ్జెట్‌ ముసాయిదాను ఈ ఏడాది జనవరిలోనే స్టాండింగ్‌ కమిటీ స్వల్ప సవరణలతో ఆమోదించింది. స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందిన ముసాయిదాను కౌన్సిల్‌లో చర్చించి ఆమోదించాల్సి ఉండడంతో సమావేశం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇంతలో జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌కు బదిలీ అయ్యింది. ఇన్‌చార్జి కమిషనర్‌గా జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి కమిషనర్‌ను త్వరగానే నియమించేస్తారనే భావనతో ఆయన బడ్జెట్‌ సమావేశం ఏర్పాటుపై వేచిచూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సమావేశం నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఈనెల ఆరున ముగియడంతో బడ్జెట్‌ సమావేశం నిర్వహణకు అధికారులు తిరిగి కసరత్తు ప్రారంభించారు. అయితే మేయర్‌ పదవీకాలం నాలుగేళ్లు పూర్తయినందున కౌన్సిల్‌లో తమకున్న మెజారిటీ ఆధారంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు అవసరమైన బలాన్ని సంపాదించుకోవడంలో కూటమి నేతలు నిమగ్నమయ్యారు. దీనివల్ల బడ్జెట్‌ సమావేశం నిర్వహణ అంశం మరుగునపడిపోయింది. మరో పది రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసి, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఆలోగా బడ్జెట్‌ ఆమోదం పొందనిపక్షంలో...తరువాత జీవీఎంసీ ఖాతా నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. వచ్చే నెల జీవీఎంసీలో కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు, జీవీఎంసీ కార్యాలయాలకు విద్యుత్‌ బిల్లులు, అధికారుల వాహనాలు, ప్రజారోగ్య వాహనాలకు డీజిల్‌ కొనుగోలు వంటివి నిలిచిపోతాయి. వీటన్నింటి కోసం ప్రతినెలా సుమారు రూ.30 కోట్ల వరకు జీవీఎంసీ వెచ్చిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి బడ్జెట్‌ ఆమోదం పొందకపోతే జీవీఎంసీ కార్యకలాపాలు నిలిచిపోతాయని, అందువల్ల తక్షణం సమావేశం ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ మొదలైంది. బడ్జెట్‌ సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఇటీవల జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌కు లేఖ రాశారు. మరోవైపు సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు కూడా తక్షణం బడ్జెట్‌ సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి లేఖ అందజేశారు. అలాగే జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ కూడా జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం ఏర్పాటులో అధికారులు తాత్సారం చేస్తున్నారంటూ రాష్ట్ర మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌కు లేఖ రాశారు.

Updated Date - Mar 20 , 2025 | 01:21 AM

News Hub