గిరి రైతులకు తప్పని ‘చింత’
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:32 PM
ప్రతి ఏడాది చింతపండు సీజన్‌లో తమకు చింత తప్పడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో మార్చి రెండో వారం నుంచి మే రెండో వారం వరకు చింతపండు క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. ఈ క్రమంలో గిరిజన సహకార సంస్థ చింతపండు కొనుగోలు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కిలో రూ.36 ధర ప్రకటించి,
కొనుగోలు ఊసే లేని జీసీసీ
సంతల్లో కిలో రూ.40 నుంచి రూ.42కు వర్తకులు కొనుగోలు
చింతపండుకు మార్కెటింగ్
కల్పించడంలో జీసీసీ విఫలం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
ప్రతి ఏడాది చింతపండు సీజన్‌లో తమకు చింత తప్పడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో మార్చి రెండో వారం నుంచి మే రెండో వారం వరకు చింతపండు క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. ఈ క్రమంలో గిరిజన సహకార సంస్థ చింతపండు కొనుగోలు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సంతల్లో వర్తకులు నిర్ణయించిన ధరలకు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు సంతకు భారీ చింతపండు
పాడేరులో శుక్రవారం జరిగిన వారపు సంతకు చింతపండు భారీగా వచ్చింది. పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలకు చెందిన గిరిజన రైతులు చింతపండును వారపు సంతకు తీసుకువచ్చారు. దీంతో సంతంతా చింతపండే దర్శనమిచ్చింది. గత రెండు వారాల నుంచే సీజన్ మొదలు కావడంతో వర్తకులు, వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. కిలో రూ.40 నుంచి రూ.42 ధరకు రైతులు చింతపండును వర్తకులకు విక్రయించారు. పలువురు రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర పెరుగుతుందనే ఆశతో ఎదురుచూశారు. కాని పెరగకపోవడంతో అదే ధరకు విక్రయించి వెళ్లిపోయారు. శుక్రవారం స్థానిక వారపు సంతకు ఐదు టన్నుల వరకు చింతపండు వచ్చిందని వర్తకులు అంచనా వేస్తున్నారు.
చింతపండు కొనుగోలు ఊసేలేని జీసీసీ
మార్చి నెలలో చింతపండు కొనుగోలు ధర నిర్ణయించడంతోపాటు వారపు సంతల్లో కొనుగోలు కేంద్రాలను గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఈ ఏడాది జీసీసీ ఇప్పటికీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో గిరి రైతులకు వర్తకులే దిక్కు అయ్యారు. వారు చెప్పే ధరకే విక్రయించాల్సి వచ్చింది. గత కొన్నాళ్లుగా చింతపండు కొనుగోలుపై జీసీసీ ఆసక్తి చూపడం లేదు. కేవలం మద్దతు ధరను ప్రకటించి తమ పనైపోయిందని మిన్నకుండడం మినహా చింతపండు కొనుగోలు జోలికి జీసీసీ వెళ్లడం లేదు. వాస్తవానికి గిరిజన అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించి వారికి సహకరించాలనే లక్ష్యంతోనే గిరిజన సహకార సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ, నానాటికీ జీసీసీ సేవలు తీసికట్టుగా తయారవుతున్నాయి. గిరిజనులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఉత్తుత్తి ప్రచారం మాత్రం చేస్తోంది. గిరిజన ఉత్పత్తులతో వ్యాపారం మినహా గిరిజన రైతులకు జీసీసీ ద్వారా సేవలు, సహకారం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జీసీసీ అధికారులు స్పందించి గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.