చోడవరం ఏఎంసీ పీఠం ఎవరికో?
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:39 AM
కూటమి ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు (ఏఎంసీ) చైర్మన్‌లను నియమించగా వాటిల్లో అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం వున్నాయి.

చైర్మన్ పదవి రేసులో పలువురు ఆశావహులు
తమకు అవకాశం ఇవ్వాలని ‘రోలుగుంట’ నేతల వినతి
చోడవరం మండలం నుంచి ఎమ్మెల్యే..
బుచ్చెయ్యపేట నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్.
రావికమతం మండలం నుంచి ఎమ్మెల్సీ..
ఏ పదవీ లేని రోలుగుంటకు ఏఎంసీ చైర్మన్ కేటాయించాలని విన్నపం
చోడవరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు (ఏఎంసీ) చైర్మన్‌లను నియమించగా వాటిల్లో అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం వున్నాయి. ఇంకా అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లను నియమించాల్సి వుంది. మలి విడతలో ఈ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తారన్న సమాచారంతో ఆయా నియోజకవర్గాల్లో ఈ పదవుల కోసం పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు వుండగా, రోలుగుంట మినహా మిగిలిన మూడు మండలాల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల నియోజకవర్గస్థాయి పదవి అయిన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తమకు అవకాశం ఇవ్వాలని రోలుగుంట మండల నాయకులు కోరుతున్నారు.
ఐదేళ్ల క్రితం వరకు చోడవరం వ్యవసాయ మార్కెట్ పరిధిలో చోడవరం,మాడుగుల నియోజకవర్గాలు వుండేవి. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఉండాలన్న ఉద్దేశంతో 2020లో చోడవరం నుంచి మాడుగులను విడదీసి ప్రత్యేకంగా మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న సమయంలో చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో చోడవరం మండలం, లేదంటే మాడుగుల నియోజకవర్గం నేతలకే ప్రాధాన్యం లభించింది. వచ్చింది. టీడీపీ హయాంలో చోడవరం మండలానికి చెందిన పూతి కోటేశ్వరరావు, మజ్జి గౌరీశంకరరావు, వైసీపీ హయాంలో గూనూరు శంకరరావు, ఏడువాక సత్యారావు, దేవరాపల్లి మండలానికి చెందిన కిలపర్తి భాస్కరరావులకు పదవి లభించింది. ఈ నేపథ్యంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు చోడవరం మండలానికి చెందిన వారు. బుచ్చెయ్యపేట మండలానికి చెందిన బత్తుల తాతయ్యబాబు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వున్నారు. రావికమతం మండలానికి చెందిన వేపాడ చిరంజీవిరావు ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన రోలుగుంట మండలం నుంచి ఒక్కరు కూడా ఉన్నత పదవిలో లేరు. పదవుల పరంగా తమ మండలానికి సరైన ప్రాధాన్యం లభించడం లేదని టీడీపీకి చెందిన రోలుగుంట మండల నాయకులు మదనపడుతున్నారు. నియోజకవర్గానికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి మరొకటి ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల గౌరవ ప్రదమైన చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రోలుగుంట మండలానికి కేటాయించాలని పలువురు నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేకి, పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ కమిటీల పదవుల భర్తీకి త్వరలో రెండో విడత జాబితా విడుదల అవుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడంతో చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తమకే కేటాయిస్తారని రోలుగుంట నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.