Share News

పూర్తి జీతాలు అప్పుడే...

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:29 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కూడా పూర్తిస్థాయిలో పనిచేసినప్పుడే అందరికీ పూర్తి జీతాలు అందుతాయని, అంతవరకు కష్టాలు తప్పవని కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్‌ పాండే స్పష్టంచేశారు.

పూర్తి జీతాలు అప్పుడే...

3వ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభమయ్యేంత వరకూ కష్టాలు తప్పవన్న కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్‌ పాండే

కాంట్రాక్ట్‌ సిబ్బందిని తగ్గించుకోవాలి

ఎంపిక చేసిన ఉద్యోగులతో సమావేశం

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కూడా పూర్తిస్థాయిలో పనిచేసినప్పుడే అందరికీ పూర్తి జీతాలు అందుతాయని, అంతవరకు కష్టాలు తప్పవని కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్‌ పాండే స్పష్టంచేశారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం ఎంపిక చేసిన సుమారు 200 మంది ఉక్కు యువ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్లు అంతా వీఆర్‌ఎస్‌ తీసుకొని వెళ్లిపోతున్నారని, ప్లాంటును నడిపే బాధ్యత యువ ఉద్యోగులపైనే ఉందని స్పష్టంచేశారు. కాంట్రాక్టు సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటే శాశ్వత ఉద్యోగులు సరిగ్గా పనిచేయరని, అందుకని ఎంత అవసరమో అంతే కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉంటారని, మిగిలిన వారిని తీసేస్తామని పరోక్షంగా వెల్లడించారు. ఏ విభాగానికి ఆ విభాగం వారు అది తమ సొంత ఆస్తిలా భావించి నిర్వహణ పనులు చూసుకోవాలని, పూర్తి ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఎవరైతే పనిచేయరో వారిని తొలగించాలని స్పష్టంచేశారు. ఒడిశాలోని డోల్వీలో జిందాల్‌ స్టీల్‌ కంపెనీ (ప్రైవేటు సంస్థ) 13 వేల మందితో పది మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేస్తోందని, దానిని ఆదర్శంగా తీసుకొని పని చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌తో పోల్చుకోవద్దని హితవు పలికారు. మే నెల నుంచి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పనిచేసే అవకాశం ఉందని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

యూనియన్‌ నాయకులను దూరంగా పెట్టి...

సాధారణంగా స్టీల్‌ ప్లాంటుకు ఢిల్లీ నుంచి ఎవరైనా పెద్దలు వచ్చి పరిపాలన, ఉత్పత్తి పరమైన అంశాలు చెప్పాలనుకున్నప్పుడు ఉద్యోగ, కార్మిక సంఘ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. కానీ స్టీల్‌ సెక్రటరీ వారితో కాకుండా కేవలం జూనియర్‌, యువ ఉద్యోగులతో సమావేశమయ్యారు. దీనిని యూనియన్లు తప్పుబడుతున్నాయి. సమస్యలు చెబుతామని, వాస్తవ పరిస్థితి వివరించి, ఎదురు ప్రశ్నిస్తామనే ఉద్దేశంతో తమను పిలవలేదని ఆరోపిస్తున్నారు. యువ ఉద్యోగులైతే ఎదురు ప్రశ్నించరని, ఎవరైనా మాట్లాడితే వారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, ఆ కారణంతో వారితోనే సమావేశం నిర్వహించారని విమర్శిస్తున్నారు.

స్టీల్‌ ప్లాంటులో 1,213 మంది పదవీ విరమణ

1,130 మందికి వీఆర్‌ఎస్‌

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటులో సోమవారం 1,213 మంది పదవీ విరమణ చేశారు. వీరిలో 1124 మంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసినవారు ఉన్నారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న వారికి మొత్తం రూ.462 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఇంకా వారికి ఆర్జిత సెలవులు, ప్రావిడెండ్‌ ఫండ్‌ వంటివి చెల్లించాల్సి ఉంది. పీఎఫ్‌ ట్రస్ట్‌కు మరో రూ.382 కోట్లు జమ చేసినట్టు సమాచారం. వారం, పది రోజుల్లో ఆర్జిత సెలవుల మొత్తాన్ని అందజేయనున్నారు. ఇదిలావుండగా ఉక్కు ఉద్యోగులకు మాత్రం మార్చి నెల జీతం ఇవ్వలేదు. దీంతో కలుపుకొని వారికి మొత్తం మూడు నెలల జీతం బకాయి ఉంది.

రోడ్డునపడ్డ 1,000 కాంట్రాక్టు కార్మికులు

కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గించాలని యాజమాన్యం పట్టుదలగా ఉంది. నేరుగా తీసేస్తే ఇబ్బందులు వస్తున్నాయని, కాంట్రాక్టర్లను పిలిచి సిబ్బందిని తగ్గించుకోవాలని ఆదేశించింది. దాంతో 38 కాంట్రాక్ట్‌ సంస్థలు 248 మందిని తీసేశాయి. ఇది జరిగి పది రోజులైంది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. తాజాగా 55 ఏళ్లు దాటిన వారంతా స్టీల్‌ జనరల్‌ ఆస్పత్రికి వెళ్లి మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. అలా వెళ్లని మరో 45 మంది పాస్‌లను నిలిపివేసింది. ఇంకో వైపు కాంట్రాక్టు పూర్తయిన వారికి రెన్యువల్‌ చేయకపోవడంతో వారి వద్ద పనిచేస్తున్న 700 మందికి ఉపాధి లేకుండా పోయింది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల రోజుల వ్యవధిలో సుమారుగా వేయి మంది కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది.

Updated Date - Apr 01 , 2025 | 01:29 AM