Share News

సాగునీటి వనరులకు పూర్వ వైభవం

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:36 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వనరులకు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మోక్షం కలుగుతున్నది.

సాగునీటి వనరులకు పూర్వ వైభవం

  • శిథిలమైన మదుములు స్థానంలో కొత్తవి నిర్మాణం

  • 500 ఎకరాలకు తీరనున్న నీటి సమస్య

పాయకరావుపేట రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వనరులకు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మోక్షం కలుగుతున్నది. మండలంలోని మంగవరం కాలువ పరిధిలో మంగవరం, గుంటపల్లి గ్రామాల వద్ద శిథిలమైన మదుముల స్థానంలో సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసి నూతన మదుములు నిర్మించారు. దీంతో సుమారు 500 ఎకరాలకు నీటి సమస్య తీరుతుందని రైతులు సంతోషంతో చెబుతున్నారు.

మంగవరం కాలువ మంగవరం వద్ద మెరక కాలువ, పల్లం కాలువ, కొముదుల కాలువ, చెరువు కింద కాలువలుగా విడిపోయి పొలాలకు నీరు చేరుతుంది. అయితే చాలా ఏళ్ల నుంచి నాలుగు కాలువల మొగ మదుములు శిథిలస్థితికి చేరుకుని తలుపులు పాడైపోయి మెరక కాలువ, కొముదుల కాలువలోకి నీరు ప్రవహించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శిథిలస్థితిలో ఉన్న మదుముల స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని వైసీపీ అధికారంలో వున్నప్పుడు రైతులు ప్రతి ఏటా విజ్ఞప్తి చేస్తూనే వున్నారు. కానీ ఒక్క ఏడాది కూడా నిధులు మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. ఆ వెంటనే సాగునీటి వనరులకు మరమ్మతులు నిధులు కేటాయించింది. మంగవరం గ్రామం వద్ద మంగవరం కాలువపై శిఽథిల స్థితిలో ఉన్న నాలుగు కాలువల మొగ మదుమును తొలగించి సుమారు రూ.5 లక్షలతో, గుంటపల్లి వద్ద బాడవా కాలువపై ధ్వంసమైన మదుమును తొలగించి సుమారు రూ.5 లక్షలతో కొత్త మదుములు నిర్మించినట్టు మంగవరం కాలువ నీటి సంఘం అధ్యక్షుడు గూటూరు రామగోవిందు తెలిపారు.

Updated Date - Apr 01 , 2025 | 01:36 AM