క్లౌడ్ కిచెన్స్ ఇష్టారాజ్యం
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:28 AM
నగరంలో ఫుడ్ బిజినెస్ బాగా నడుస్తుండడంతో క్లౌడ్ కిచెన్లు భారీగా ఏర్పాటవుతున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్స్ ఆధారంగా సాగే ఈ కిచెన్స్ గడిచిన రెండేళ్లలో పది రెట్లకుపైగా పెరిగాయి. ప్రస్తుతం నగర పరిధిలో 200కుపైగా ఉన్నాయి. అయితే అత్యధికం అనుమతులు లేకుండా నడుస్తున్నాయి.

నగర పరిధిలో దాదాపు 200కుపైగా ఏర్పాటు
మూడొంతులు అనుమతులు లేనివే...
జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు
ఆహార భద్రత, ప్రమాణాల శాఖ దాడుల్లో
అనేక లోపాలు బహిర్గతం
పరిశుభ్రత లేకపోవడం,
నాసిరకం ఆహార పదార్థాల వినియోగం
నమూనాల సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఫుడ్ బిజినెస్ బాగా నడుస్తుండడంతో క్లౌడ్ కిచెన్లు భారీగా ఏర్పాటవుతున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్స్ ఆధారంగా సాగే ఈ కిచెన్స్ గడిచిన రెండేళ్లలో పది రెట్లకుపైగా పెరిగాయి. ప్రస్తుతం నగర పరిధిలో 200కుపైగా ఉన్నాయి. అయితే అత్యధికం అనుమతులు లేకుండా నడుస్తున్నాయి.
క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటుచేయాలంటే కొన్ని రకాల అనుమతులు తీసుకోవాలి. అయితే ఇప్పటివరకూ 50 మందికి మాత్రమే అధికారులు అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటికి ఎటువంటి అనుమతులు లేవు. అదలావుంచితే క్లౌడ్ కిచెన్స్ నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చిన్నపాటి రూముల్లో, అపరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేయాల్సిందిగా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులను ఆదేశించారు. వారం కిందట పది క్లౌడ్ కిచెన్స్‌ను తనిఖీ చేయగా, కొన్నింటికి అనుమతులు లేవని, అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్నారని, నాసిరకం పదార్థాలతో ఆహారాన్ని తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆయా క్లౌడ్ కిచెన్స్‌లో నమూనాలను సేకరించి పరీక్షలకు తరలించారు. రిపోర్టులు వచ్చిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జీఏబీ నందాజీ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్లౌడ్ కిచెన్స్ తనిఖీలు చేస్తామని వెల్లడించారు.
క్లౌడ్ కిచెన్స్ నిర్వహణ ఎలా.?
క్లౌడ్ కిచెన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళలు వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఇంటి వద్దే చిన్నపాటి రూమ్‌లో పలురకాల ఆహార పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. క్లౌడ్ కిచెన్స్‌లో అమ్మకాలన్నీ పూర్తిగా ఆన్‌లైన్ ఆర్డర్లుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ, కొన్నిచోట్ల నేరుగా కూడా విక్రయిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉండే వారి ద్వారా క్లౌడ్ కిచెన్ నిర్వాహకులు ప్రచారం చేయించుకుంటుంటారు. ఇంటి వద్ద ఉంటూనే నెలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ అనుమతులు తప్పనిసరి
క్లౌడ్ కిచెన్ ఏర్పాటుచేయాలంటే కొన్ని రకాల అనుమతులను తీసుకోవాలి. ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారుల వద్ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్ తీసుకోవాలి. లేదా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ఎవరైనా పనిచేస్తున్నట్టయితే లేబర్ లైసెన్స్, టర్నోవర్‌ను బట్టి జీఎస్టీ సర్టిఫికెట్ ఉండాలి. ఏడాదికి రూ.12 లక్షల టర్నోవర్ దాటితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, అంతకంటే తక్కువ ఉంటే రిజిస్ర్టేషన్ చేయించుకోవాలి. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే పది లక్షల రూపాయల వరకు జరిమానాతోపాటు కేసు నమోదుచేసే అవకాశం ఉంది. రిజిస్ర్టేషన్ లేకుండా నిర్వహిస్తే రెండు లక్షల వరకు జరిమానా విధించడంతోపాటు కేసు నమోదుచేస్తారు.
అవగాహన తప్పనిసరి
క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసేవారిలో దాదాపు మహిళలే అధికంగా ఉంటున్నారు. వారికి ఎటువంటి అనుమతులు తీసుకోవాలన్న దానిపై అవగాహన ఉండడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, వార్షిక టర్నోవర్ రెండు లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే ఏడాదికి వంద రూపాయలు పెట్టి రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని జిల్లా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జీఏబీ నందాజీ తెలిపారు. అదే సమయంలో కిచెన్ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆహార పదార్థాలు నిల్వ లేకుండా చూసుకోవాలని, అప్పుడే ఎటువంటి ఇబ్బందులు ఉండవని నందాజీ పేర్కొన్నారు.