నలుగురికి కళారత్న అవార్డులు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:33 AM
రాష్ట్ర ప్రభుత్వం విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి అవార్డులు ప్రకటించింది.

పది మందికి ఉగాది పురస్కారాలు
విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి అవార్డులు ప్రకటించింది. విశాఖపట్నానికి చెందిన నలుగురికి కళారత్న అవార్డులు, మరో పది మందికి ఉగాది పురస్కారాలు లభించాయి. కళారత్న అవార్డు కింద హంస ప్రతిమతో పాటు రూ.50 వేల నగలు ఇస్తారు. ఉగాది పురస్కారం లభించిన వారికి రూ.10 వేల నగదు అందజేస్తారు.
కళారత్న అవార్డు పొందిన వారిలో బీఎస్ రెడ్డి (మేజిక్), సుంకర చలపతిరావు (కళా విమర్శకులు, పెయింటింగ్), ప్రొఫెసర్ సరస్వతి విద్యార్థి (కర్ణాటక వయలిస్ట్-సంగీతం), పాలగుమ్మి రాజగోపాల్ (సంగీతం) ఉన్నారు.
ఉగాది పురస్కారం పొందిన వారిలో కుప్పిలి పద్మ (సాహిత్యం), శిరేల సన్యాసిరావు (సాహిత్యం), డాక్టర్ బండి సత్యనారాయణ (సాహిత్యం), గుంటుకు వెంకటరావు (సంగీతం), డాక్టర్ ఆముక్త మాల్యాద (నృత్యం), డి.హేమ వేంకటేశ్వరి (నాటకం), కొల్లాబత్తుల విజయకుమార్ (మిమిక్రీ), బీఆర్ విక్రమ కుమార్ (జర్నలిజం), కనపర్తి రాణి (జర్నలిజం), ఎం.విజయకుమార్ (పెయింటింగ్) ఉన్నారు.
నేడు, రేపు రిజిస్ట్రేషన్లు
విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదివారం (ఉగాది), సోమవారం (రంజాన్) సెలవులైనప్పటికీ కూడా పనిచేస్తాయని రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ శనివారం తెలిపారు. మంచి రోజులు కావడంతో చాలామంది సిర్థాస్తుల లావాదేవీలు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నందున సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
నేడు, రేపు ఆస్తిపన్ను చెల్లింపునకు అవకాశం
విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ సెలవు దినాలైనప్పటికీ ఆది, సోమవారాల్లో ఆస్తిపన్ను చెల్లించేందుకు నగరవాసులకు అవకాశం కల్పిస్తున్నట్టు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపునకు ఈనెల 31 ఆఖరు తేదీ కావడంతో ప్రజల వెసులుబాటు కోసం ఈ ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సౌకర్యం కేంద్రంతోపాటు అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాల్లో పన్ను చెల్లించవచ్చునన్నారు. ఆస్తిపన్ను, వీఎల్‌టీ బకాయిలు ఉన్నవారు ఈనెల 31లోగా మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి చెల్లించే వారికి వడ్డీ రాయితీ ఉండదన్నారు.
పారిశుధ్య కార్మికులకు సెలవు రద్దు
నగర పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఆది, సోమవారాల్లో పారిశుధ్య కార్మికులకు సెలవు రద్దు చేసినట్టు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఐ.నరేష్ తెలిపారు. క్లాప్ వాహనాలు ఇంటింటికీ వచ్చి చెత్తను సేకరిస్తాయన్నారు.
మధురవాడలో స్పోర్ట్స్ ఎరీనా
మాస్టర్ ప్లాన్ రహదారులకు రూ.103.43 కోట్లు
వీఎంఆర్‌డీఏ పార్కులో 15 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయం
విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
మధురవాడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఒలింపిక్స్ ప్రమాణాలతో అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఎరీనా నిర్మించాలని శనివారం జరిగిన వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- బీచ్‌రోడ్డులో ఉన్న వీఎంఆర్‌డీఏ పార్కులో 15 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చైర్మన్ ప్రణవ్‌గోపాల్ ప్రతిపాదించగా అధికారులు ఆమోదించారు.
- మాస్టర్ ప్లాన్ రహదారుల పనులు రూ.103.43 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు.
- అనకాపల్లిలో రావుగోపాలరావు కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.
- చీమలాపల్లి, ఎండాడలలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్లకు నిర్మాణ వ్యయం పెరిగిందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొనగా, వాటికి అదనపు మొత్తాలు మంజూరుచేశారు.
- కాకాని నగర్‌లో రూ.12.5 కోట్లతో అండర్ పాస్ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.
- సిరిపురంలోని ఉద్యోగ భవన్ వెనుక ఉన్న 98 సెంట్ల ఖాళీ స్థలంలో రూ.99 కోట్లతో సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.