Share News

ఐపీఎల్‌ సందడి

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:31 AM

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది.

ఐపీఎల్‌ సందడి

  • నేడే ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌

  • కీలక సమరానికి వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియం

  • ‘సన్‌రైజర్స్‌’లో ప్రత్యేక ఆకర్షణగా లోకల్‌ బాయ్‌ నితీష్‌కుమార్‌రెడ్డి, ఇషాన్‌ కిషన్‌

  • ఢిల్లీ క్యాపిటల్స్‌లో అశుతోష్‌శర్మ

విశాఖపట్నం-స్పోర్ట్సు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. ఇందుకు పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూహ్య విజయంతో శుభారంభం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు...హోం గ్రౌండ్‌లో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో కూడా గెలుపొందాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక టైటిల్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించి, రెండో మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించడమే లక్ష్యంగా బరిలో దిగుతోంది.

ఆకర్షణగా నితీష్‌, ఇషాన్‌, అశుతోష్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో లోకల్‌ బాయ్‌ నితీష్‌కుమార్‌రెడ్డి, తొలిమ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇటీవల ఆస్ర్టేలియాలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌పై అద్భుత సెంచరీ సాధించిన నితీష్‌కుమార్‌...తొలిసారి సొంత గ్రౌండ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులు అతనిపై అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో వీరవిహారం చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించిన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అశుతోష్‌శర్మకు తోడు స్టబ్స్‌, డుప్లెసిస్‌, అభిషేక్‌ పోరల్‌ వంటివారు రాణిస్తే భారీ స్కోరు సాధించే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా కేఎల్‌ రాహుల్‌ హాజరయ్యే అవకాశాల్లేవు.

పిచ్‌పై అంచనాలు

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్‌ (వికెట్‌)పై 200కు పైగా స్కోరు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే టాస్‌ కూడా కీలకం అవుతుందని భావిస్తున్నారు. ఈనెల 24 జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 209 పరుగుల స్కోరు చేసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్‌ చేసే జట్టు ప్రత్యర్థులకు 250 పరుగుల వరకు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముమ్మర సాధన

కీలక మ్యాచ్‌లో తలపడేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు శనివారం ముమ్మర సాధన చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు ఐదు రోజులుగా సాధన కొనసాగించగా, శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు శనివారం ఒక్కరోజు సాధన చేసే అవకాశం లభించింది.

ప్రభావం చూపని టికెట్ల ధర

దాదాపు 25 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, లఖనవూ జట్ల మధ్య ఈ నెల 24న జరిగిన తొలి మ్యాచ్‌కు 70 శాతం వరకూ సీట్లు నిండాయి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌కు క్రీడాభిమానులు ఆసక్తి కనబరచడంతో శనివారం సాయంత్రానికి రూ.ఆరు వేల టికెట్లు మినహా మిగిలినవన్నీ పూర్తిగా అమ్ముడైపోయాయి.

Updated Date - Mar 30 , 2025 | 01:31 AM