Share News

దుశ్చర్య

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:28 AM

దుండగుల దుశ్చర్యతో ఓ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో 13 ద్విచక్ర వాహనాలు దహనమయ్యాయి.

దుశ్చర్య

  • గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఓ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో 13 ద్విచక్ర వాహనాలు దహనం

  • అక్కడ నివసిస్తున్న కుటుంబానికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

మహారాణిపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

దుండగుల దుశ్చర్యతో ఓ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో 13 ద్విచక్ర వాహనాలు దహనమయ్యాయి. సెల్లార్‌లో నివాసం ఉంటున్న కుటుంబం త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వారి ఇంట్లోని వస్తువులు కూడా కాలిపోయాయి. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సింగ్‌ హోటల్‌ డౌన్‌ విశ్వనాథం రోడ్డులో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..విశ్వనాఽథం రోడ్డులో ఇటీవల నిర్మించిన అపార్టుమెంట్‌లో సుమారు 12 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారి ద్విచక్ర వాహనాలను (పార్కింగ్‌) అపార్టుమెంట్‌ లోపలే పెట్టుకుంటారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాల వద్ద హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పెట్రోల్‌తో ఉన్న వాహనాలు కావడం, మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో అదే అపార్టుమెంట్‌ సెల్లార్‌లో ఆరుగురు సభ్యులతో నివసిస్తున్న కుటుంబం హాహాకారాలు చేసింది. మంటలు వారి ఇంటి లోపలకు కూడా వ్యాపించాయి. కుటుంబ సభ్యులు వెనుక వైపు నుంచి బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇంట్లోని వస్తువులు మాడి మసయ్యాయి. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు ఇరవై రోజుల క్రితం ఇదే అపార్టుమెంట్‌కు చెందిన ఒక యువకుడి వాహనాన్ని కొందరు తగులబెట్టారు. అతను నూతన వాహనం కొనుగోలు చేసి ఉగాది రోజు పూజ చేయించాలని అపార్టుమెంట్‌ పార్కింగ్‌లో పెట్టాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ యువకుడి వాహనాన్ని దహనం చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించి ఉంటారని, ఈ క్రమంలో వాహనాలన్నీ కాలిపోయి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Mar 30 , 2025 | 01:28 AM