గ్రేటర్ బడ్జెట్ రూ.4,601.4 కోట్లు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:30 AM
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.4,601.4 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ శనివారం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
సమావేశం నిర్వహణలో జాప్యానికి నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామాకు కూటమి సభ్యుల పట్టు
రెండు నెలలైనా కమిషనర్‌ను నియమించలేకపోయినందుకు టీడీపీ కార్పొరేటర్ల రాజీనామాకు వైసీపీ డిమాండ్
వాస్తవానికి భిన్నంగా బడ్జెట్‌ను రూపొందించారని వామపక్షాల కార్పొరేటర్లు విమర్శ
విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.4,601.4 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ శనివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండడంతో మేయర్ ఆ సమయానికి కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికి కూటమి నుంచి 29 మంది, సీపీఎం, సీపీఐ నుంచి ఒక్కొక్కరు, వైసీపీ నుంచి ఇద్దరు డిప్యూటీ మేయర్లు మాత్రమే హాజరవ్వడంతో సమావేశం ప్రారంభించడానికి అవసరమైన కోరం పరిశీలించాలని కార్యదర్శిని ఆమె ఆదేశించారు. 28 మంది ఉంటే సరిపోతుందని, మరో ఐదుగురు ఎక్కువగానే ఉన్నారని కార్యదర్శి చెప్పడంతో మేయర్ సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, లేళ్ల కోటేశ్వరరావు, తదితరులు కలుగజేసుకుని జనవరి పదో తేదీలోపు ముగియాల్సిన బడ్జెట్ సమావేశాన్ని ఇంతవరకూ నిర్వహించకపోవడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ఎస్.ఎస్.వర్మ సమాధానం ఇస్తూ జనవరి మొదటి వారంలో నిర్వహించాలకున్నప్పటికీ...పీఎం నరేంద్రమోదీ పర్యటన, ఆ తరువాత కమిషనర్ బదిలీ, ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ వంటి కారణాలతో సాధ్యపడలేదని వివరించారు. దీనికి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ స్పందిస్తూ బడ్జెట్ సమావేశం నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ గొలగాని హరివెంకటకుమారి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ సమాధానం ఇస్తూ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా గుర్తింపుపొందిన జీవీఎంసీకి రెండు నెలలుగా కమిషనర్‌ను నియమించలేకపోయారని, దీనికి బాధ్యత వహిస్తూ టీడీపీ కార్పొరేటర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో టీడీపీ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలపడంతో గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో ఇన్‌చార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ కౌన్సిల్‌హాల్‌లోకి రావడంతో సభ్యులంతా ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. అనంతరం మేయర్ హరివెంకటకుమారి బడ్జెట్ ముసాయిదాలోని అంశాలు, జీవీఎంసీకి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలతోపాటు వివిధ విభాగాల ద్వారా చేసే ఖర్చులకు సంబంధించిన వివరాలను చదివి వినిపించారు. ఈ దశలో సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల్లో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు మాట్లాడుతూ బడ్జెట్‌ను పూర్తిగా అంకెలతో నింపేశారని, వాస్తవ ఆదాయం, ఖర్చులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ఏడాది బడ్జెట్ కంటే గరిష్ఠంగా 20 శాతం మించి బడ్జెట్ అంచనాలు ఉండకూడదనే విషయాన్ని స్టాండింగ్ కమిటీ విస్మరించడం సరికాదన్నారు. ఇన్‌చార్జి కమిషనర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ సమాధానం ఇస్తూ బడ్జెట్‌ను అంచనాల ఆధారంగానే రూపొందిస్తామని, ముందుగా తయారుచేసిన ముసాయిదాలో మరింత ఎక్కువ మొత్తం చూపించడంతో రూ.865 కోట్లు తగ్గించి ప్రస్తుత బడ్జెట్‌ను రూపొందించామని వివరించారు. 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్‌లో క్రీడలకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ మొత్తంతో నగర పరిధిలో క్రీడలను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ బడ్జెట్ గురించి మేయర్‌కు సరైన బాధ్యత లేకుండా పోయిందన్నారు. ముడసర్లోవలోని గుర్రాలపార్కు అంటే ఏదో బొమ్మలు పెడతారనుకుని కాంట్రాక్టర్‌కు రూ.3.5 కోట్లు చెల్లించేందుకు సంతకం చేసేశానని అంటారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఆదాయాన్ని జీవీఎంసీయే ఖర్చు పెట్టుకునేందుకు వీలుగా సీఎఫ్‌ఎంఎస్‌ను పూర్తిగా రద్దు చేశారన్నారు. జీవీఎంసీ అభివృద్ధికి తోడ్పలేలా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుని అభినందిస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో సీఎఫ్‌ఎంఎస్‌లో రూ.170 కోట్లు, రిజిస్ట్రేషన్లపై సర్‌చార్జీల కింద రూ.110 కోట్లు ఇతర ప్రాజెక్టుల కింద రావాల్సిన బకాయిలు కలిపి రూ.570 కోట్లు ఉండిపోతే...వాటి విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ తన కోటాలో త్వరలోనే రూ.పది కోట్లు నిధులు వస్తాయని, వాటిని నగర పరిధిలోనే ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణలో జిల్లా కలెక్టర్ చట్టాన్ని పాటించడం లేదని, తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే సమావేశం పెట్టడం సరికాదన్నారు. తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సమాధానం ఇస్తూ చట్టబద్ధమైన కమిటీల సమావేశం పార్లమెంటు సమావేశాలతో నిమిత్తం లేకుండా నిర్వహించుకోవచ్చునన్నారు. తమ అధికారులు సమావేశానికి ఆహ్వానం పంపించినా, స్పందించలేదని వివరించారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు తాను కార్యాలయంలోనే ఉంటున్నానని, అపాయింట్‌మెంట్ లేకుండానే కలిసే వెసులుబాటు ఉంది కాబట్టి, ఎప్పుడైనా, ఎవరైనా వచ్చి కలవచ్చునన్నారు.