Share News

చెరకు పంటకు నిప్పంటించిన రైతు

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:40 AM

చోడవరంలో మండలంలోని గోవాడ షుగర్స్‌లో క్రషింగ్‌కు తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రొంగలి వెంకటరావు తన 65 సెంట్లలో చెరకు తోటకు మంగళవారం నిప్పుపెట్టారు.

చెరకు పంటకు నిప్పంటించిన రైతు
రైతు నిప్పు పెట్టడంతో దహనమవుతునన్న చెరకు తోట

కూలీ, రవాణా ఖర్చులు భరించి ఫ్యాక్టరీకి పంపినా.. క్రషింగ్‌ జరుగుతుందన్న నమ్మకం లేకపోవడం వల్లేనని ఆవేదన

అనకాపల్లి/దేవరాపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): చోడవరంలో మండలంలోని గోవాడ షుగర్స్‌లో క్రషింగ్‌కు తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రొంగలి వెంకటరావు తన 65 సెంట్లలో చెరకు తోటకు మంగళవారం నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి తాను షేర్‌ హోల్టర్‌గా ఉన్నానని, కొంతకాలం క్రషింగ్‌ సక్రమంగా జరగడం లేదని, చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తాను ఫ్యాక్టరీకి 50 నుంచి 60 టన్నుల చెరకు పంపించేవాడినని, క్రషింగ్‌ ఆలస్యం అవుతుండడంతో పంట విస్తీర్ణం తగ్గించేశానన్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం తన 65 సెంట్లలోని చెరకును కటింగ్‌ చేసి క్రషింగ్‌ కోసం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించాలంటే కనీసం రూ.8 వేలు నుంచి రూ.9 వేల వరకు ఖర్చవుతుందన్నారు. అంత పెట్టినా ఆరు నెలలకో, సంవత్సరం తరువాతో చెల్లింపులు జరుగుతాయని అంటున్నారు. గతంలో 15 రోజులకు ఒకసారి చెరకు బిల్లులు చెల్లించేవారని, ఇప్పుడు బాగా ఆలస్యం అవుతోందన్నారు. అందుకే కూలీ, రవాణాకు పెట్టుబడి పెట్టలేక, క్రషింగ్‌ జరుగుతుందో లేదో నమ్మకం లేక...పండించిన చెరకు తోటను తగలబెట్టుకోవాల్సి వచ్చిందని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రెండు వారాల్లో చెరకు క్రషింగ్‌ పూర్తికి చర్యలు: జేసీ

దేవరాపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఫ్యాక్టరీకి చెరకును సత్వరం తరలించడానికి తగిన చర్యలు చేపట్టాలని గోవాడ షుగర్స్‌ ఎండీ సన్యాసినాయుడును జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆదేశించారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం ఆమె కొత్తపెంటలో రైతు నిప్పుపెట్టిన చెరకు తోటను పరిశీలించారు. రైతు వెంకటరావుతో మాట్లాడారు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ పంటను కూలీలతో నరికించి ఫ్యాక్టరీకి తరలించినా అదనపు ఖర్చు తప్ప ...ప్రయోజనం లేదని నిప్పు పెట్టినట్టు చెప్పారు. చాలామంది రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నారని, న్యాయం చేయాలని కోరారు. రైతు ఆవేదనను విన్న ఆమె పక్కనే ఉన్న ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడుతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిధిలో గల 2,600 ఎకరాల్లోని చెరకు క్రషింగ్‌ రెండు వారాల్లో పూర్తిచేయడం జరుగుతుందన్నారు. చెరకు బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. రైతులకు ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎండీని ఆమె ఆదేశించారు. జేసీ వెంట మండల వ్యవసాయ అధికారి కాంతమ్మ, సర్పంచ్‌ రొంగలి వెంకటరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:40 AM