మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆరు నెలల్లో భూసేకరణ
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:11 AM
స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేయాలని అధికారులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ దిశానిర్దేశం చేశారు.

మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం ప్రారంభించాలి
15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి
రుషికొండ, గంభీరంలలో అడ్వంచర్ స్పోర్ట్సు కాంప్లెక్స్‌లు
జిల్లా అధికారులతో కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేయాలని అధికారులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సంతృప్తికరమైన రీతిలో సేవలు అందిస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సమ్మిళిత ఆర్థిక విధానాలకు పెద్దపీట వేయాలన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో అమరావతిలో సీఎం అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో చర్చకు వచ్చిన అంశాలను ఆయన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు వివరించారు. అన్ని రంగాల్లో విశాఖను అగ్రస్థానంలో నిలపాలని, మహా నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆరు నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు, మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టే ప్రాంతంలో కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని, లేఅవుట్లు వేయడానికి ప్రణాళికలు తయారుచేయవద్దని ఆదేశించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌లకు అనుసంధానమైన రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించిన నంబర్‌ను పబ్లిక్ ప్రదేశాలలో ప్రదర్శించాలన్నారు.
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఆ దిశగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. రుషికొండ, గంభీరంలో అడ్వంచర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు నిర్మించాలన్నారు. రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటుకు దీటుగా సేవలు విస్తృతం చేయాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ఏపీఐఐసీ ద్వారా ప్రతి నెలా 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.