Share News

147 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:14 AM

మండల పరిధిలోని కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి పరారైన నలుగురు నింది తులను మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

147 కిలోల గంజాయి స్వాధీనం
మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

రామభద్రపురం, విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి పరారైన నలుగురు నింది తులను మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 10న రామభద్రపురం ఎస్‌ఐ వి.ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో కారులో వస్తున్న కొంతమంది వ్యక్తులు పోలీసులను చూసి కారు విడిచిపెట్టి పరారయ్యారు. విడిచిపెట్టిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా కారులో 147 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో విశాఖ జిల్లా ఆనందపురం మండలం దుక్కవానిపాలెంకు చెందిన భోగవల్లి గోవిందరావు, చగురుపల్లి అనీల్‌కుమార్‌, బంక రామ్‌సురేష్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుంగుపుట్టి మండలం కిలగడ గ్రామానికి చెందిన అంబడి బాలరాజులను పట్టుకుని, అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శక్తి ఉమా మహేశ్వరరావు ఇదివరకే గంజాయి కేసులో అరస్టయి జైలులో ఉన్నాడు. వీరి నుంచి 147 కిలోల గంజాయితోపాటు 4 మొబైల్‌ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో క్రియాశీలంగా పనిచేసిన బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్‌ సీఐ కె.నారాయణరావు, రామ భద్రపురం ఎస్‌ఐ వి.ప్రసాదరావు, రామభద్రపురం కానిస్టేబుళ్లు వై.రమేష్‌, ఎస్‌.రవి, ఎ.ధర్మారావు, పి.నాగార్జునలను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్‌ సీఐ నారాయణరావు, ఎస్పీ, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌కే చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:14 AM