కూటమి శిబిరం
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:18 AM
అవిశ్వాస తీర్మానం నోటీస్‌పై ఈనెల 19న కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో కూటమి కార్పొరేటర్లను ఆ పార్టీలనేతలు రహస్య శిబిరానికి తరలించారు.

భీమిలిలోని రిసార్ట్స్‌కు మూడు పార్టీల కార్పొరేటర్లు తరలింపు
నేడు లేదా రేపు ఇతర రాష్ర్టాలకు...
అవిశ్వాస తీర్మానంపై 19న కౌన్సిల్ సమావేశం జరగనుండడంతో నేతల అప్రమత్తం
పది రోజుల నుంచి బెంగళూరులోనే వైసీపీ కార్పొరేటర్ల ‘క్యాంపు’
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
అవిశ్వాస తీర్మానం నోటీస్‌పై ఈనెల 19న కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో కూటమి కార్పొరేటర్లను ఆ పార్టీలనేతలు రహస్య శిబిరానికి తరలించారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇవ్వగానే వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ నేతలు బెంగళూరు తరలించిన విషయం తెలిసిందే. గత నెల 29న జరిగిన జీవీఎంసీ బడ్జెట్ సమావేశానికి మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్ మినహా వైసీపీ కార్పొరేటర్లు ఎవరూ హాజరుకాలేదు. తాజాగా అవిశ్వాస తీర్మానంపై 19న కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడంతో కూటమి కార్పొరేటర్లను నేతలు శిబిరానికి తరలించారు. గతంలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరిగినప్పుడు భీమిలిలోని ఒక రిసార్టులో ఉంచినందున, సెంటిమెంట్‌గా ఇప్పుడు కూడా అక్కడికే తరలించినట్టు తెలిసింది. శనివారం లేదా ఆదివారం వారిని అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 19 వరకు వారిని వివిధ రాష్ట్రాల్లోని సందర్శనీయ ప్రాంతాలు తిప్పే ఆలోచన ఉందని చెబుతున్నారు.
16 నుంచి స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె
కార్యాచరణ ప్రకటించిన నాయకులు
కూర్మన్నపాలెం జంక్షన్‌లో రాస్తారోకో రేపు
ఉక్కుటౌన్‌షిప్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. కార్మికుల తొలగింపునకు నిరసనగా ఈ నెల 16వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు గురువారం ప్రకటించారు. స్టీల్‌ప్లాంటులో ఇటీవల యాజమాన్యం 1,503 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల తొలగింపునకు నిరసనగా కొద్దికాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవ డంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయానికి వచ్చారు.
కార్మిక సంఘాల కార్యాచరణ
5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రాస్తారోకో. 7న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చల నేపథ్యంలో నిరసన ప్రదర్శన, 8న ఆర్‌ఎల్‌సీకి వినతి పత్రం, 9న ప్రతిపక్ష పార్టీల నాయకులకు వినతి పత్రాలు, 10న ఎంపీని కలిసి సమస్య వివరించి, వినతిపత్రం అందజేత, 16 నుంచి నిరవధిక సమ్మె
యాజమాన్యం దిగి వచ్చేంత వరకూ...
అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు
యాజమాన్యం దిగివచ్చేంత వరకూ పోరాటం ఆపేది లేదని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్లాంటులో గురువారం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కార్మికులపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ తరుణంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 16 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఏ ఒక్క కార్మికుడినీ తొలగించబోమని యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నమ్మి రమణ, సోమరాజు, కె.వంశీ, అప్పారావు, భాస్కరరావు, ఆనంద్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
స్టార్ హోటళ్లకు శుభవార్త
బార్ లైసెన్స్ ఫీజు భారీగా తగ్గింపు
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
స్టార్ హోటళ్లకు ఉపయోగపడేలా రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ స్టార్ హోటళ్లలో బార్ లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.66 లక్షలు వసూలు చేస్తున్నారు. దీనిని ఇప్పుడు రూ.25 లక్షలు చేయడానికి పర్యాటక శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తక్షణమే దీనిని అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం పర్యాటక రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ టూరిజం ఫోరం కార్యదర్శి పవన్ కార్తీక్ అన్నారు. దీనివల్ల కార్పొరేట్, సోషల్ ఈవెంట్ల సంఖ్య పెరుగుతుందని, పర్యాటకుల సంఖ్య కూడా అధికం అవుతుందన్నారు. వ్యాపార అభివృద్ధికి అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.