15% వృద్ధి లక్ష్యం
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:23 AM
స్వర్ణాంధ్ర సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ కార్యాచరణ అమలుకు సంబంధించి అధికారులకు లక్ష్యాలు నిర్దేశించామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వెల్లడించారు.

విజన్ డాక్యుమెంట్ కార్యాచరణకు అనుగుణంగా ప్రణాళికలు
గడచిన ఏడాది జిల్లా స్థూల ఆదాయం రూ.1.33 లక్షల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం రూ.1.5 లక్షల కోట్లు లక్ష్యం
పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీస్ రంగాలపై దృష్టి
పరిశ్రమల ఏర్పాటుకు 1,000 ఎకరాలు సేకరణ
రైల్వే, టెలికమ్యూనికేషన్స్, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పనులపై ప్రత్యేక శ్రద్ధ
రూ.11 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశ ఆగస్టులోగా టీసీఎస్ కార్యకలాపాలు
భీమిలి బీచ్‌రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
స్వర్ణాంధ్ర సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ కార్యాచరణ అమలుకు సంబంధించి అధికారులకు లక్ష్యాలు నిర్దేశించామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధిపై దృష్టిసారించామన్నారు. గురువారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.33 లక్షల కోట్ల స్థూల ఆదాయం వచ్చిందని, 2025-26లో రూ.1.5 లక్షల కోట్లకు పెంచాలన్నదే విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ రంగాల్లో 15 శాతం చొప్పున వృద్ధి, ఇంకా తలసరి ఆదాయం రూ.6,14,763 సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వ్యవసాయ రంగంలో మేలుజాతి వంగడాలతో వరి, రాగులు, పప్పుదినుసులు, మొక్కజొన్నలో దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 200 హెక్టార్ల బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత శాఖకు నిర్దేశించామన్నారు. పశు సంవర్ధక శాఖ నుంచి ఏడాదికి రూ.మూడు వేల కోట్ల ఆదాయం వస్తోందని, దీనిపై 15 శాతం వృద్ధి సాధనకు మేలుజాతి ఆవులు పెంపకం, 125 గోకులాలు ఏర్పాటు, పౌలీ్ట్ర పరిశ్రమ విస్తరణ, మేకలు, గొర్రెల పెంపకానికి రుణాలు మంజూరు వంటి వాటిపై దృష్టిసారిస్తామన్నారు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్‌లో 200 బోట్లకు కొత్త ఇంజన్లు అమర్చడం, పీఎం మత్స్య సంపద యోజన కింద రూ.80 లక్షల వంతున 10 బోట్లు కొనుగోలుకు ప్రతిపాదించామన్నారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పూర్తయితే ఇప్పటివరకూ ఉన్న 700 బోట్లకు అదనంగా 70 బోట్లకు యాంకరేజ్ సదుపాయం లభిస్తుందన్నారు. సముద్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 30 చోట్ల కేజ్ కల్చర్ అమలు చేస్తామన్నారు. మత్స్యశాఖ ద్వారా గత ఏడాది రూ.2,700 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుత ఏడాది అదనంగా మరో రూ.400 కోట్లు సమకూర్చుతామని కలెక్టర్ వెల్లడించారు.
పరిశ్రమల రంగం నుంచి వచ్చే ఆదాయంలో ప్రభుత్వ రంగం వాటా 23 శాతం, ప్రైవేటు రంగం వాటా 77గా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగంలో పలు ప్రాజెక్టుల ద్వారా పనులు వేగవంతం చేయడం ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్-సబ్బవరం వరకూ రహదారి నిర్మాణం, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ద్వారా చేపట్టే పనులతో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. మధురవాడలో యూజీడీ, నగరంలో తాగునీటి కల్పన ప్రాజెక్టులు అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రూ.11 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశ పనులు చేపట్టేందుకు వేగంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఇందుకు ప్రైవేటు భూమి 52 ఎకరాలు, ప్రభుత్వ భూమి 46 ఎకరాలు కావలసి వస్తుందన్నారు. ప్రైవేటు భూమి సేకరణకు రూ.620 కోట్లు అవసరమన్నారు. రూ.400 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడతారని, త్వరలో జోన్ కార్యాలయం నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. విశాఖ పోర్టు లావాదేవీలు పెరగనున్నాయని, టెలికమ్యూనికేషన్స్ రంగంలో పనులు ప్రారంభం అవుతాయన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు తర్లువాడ, జగన్నాథపురం, కణమాం, బీడీ పాలెం, గోరంట్లలో 1000 ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చే ఔత్సాహికులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామన్నారు. ప్రతినెలా 100 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ప్రారంభమయ్యేలా సంబంధిత శాఖలకు లక్ష్యాలు నిర్దేశించామని వివరించారు. తగరపువలసలో ఆయిల్, ఎంవీపీ కాలనీలో ప్రింటింగ్, గాజువాకలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటుచేస్తామన్నారు. సేవా రంగంలో ప్రఽఽధానంగా పర్యాటక, ఐటీ, ఆతిథ్య రంగాలపై ఫోకస్ పెట్టామన్నారు. ఈ ఏడాది ఆగస్టుకల్లా టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నదని కలెక్టర్ చెప్పారు. ఐటీ హిల్స్‌లో ప్రస్తుతం ఉన్న సెజ్‌ను డీనోటిఫై చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లను ప్రోత్సహిస్తామన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు విశాఖ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్డులో మూడు డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి ప్యాకేజీ ఖరారు చేస్తామన్నారు. విజన్ డాక్యుమెంట్‌లో ఏఏ శాఖలు ఏమేం చేయాలన్నది నిర్దేశించామని, ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.