Share News

సీపీ ఆదేశాలు బేఖాతరు

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:27 AM

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశాలను ఆ శాఖ సిబ్బంది పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సీపీ ఆదేశాలు బేఖాతరు

  • పూర్ణామార్కెట్‌ మెయిన్‌రోడ్డులో దుకాణాలు తొలగించాలని పోలీసులకు ఆదేశం

  • అయినా సిబ్బంది తటపటాయింపు

  • ఒకటి, రెండు చోట్ల తొలగించినా, ఆయన వెళ్లిపోగానే మళ్లీ యథాతథంగా ఏర్పాటు

  • ఆశీలు కాంట్రాక్టర్‌ ప్రోత్సాహమే కారణమని ఆరోపణలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశాలను ఆ శాఖ సిబ్బంది పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్ణామార్కెట్‌ మెయిన్‌ రోడ్డులో ఆక్రమణలను రెండు నెలల కిందట సీపీ చొరవతో పోలీసులు తొలగించారు. అయితే మార్కెట్‌లో ఆశీలు వసూలు కాంట్రాక్టును కూటమికి చెందిన చోటా నేత ఒకరు దక్కించుకోవడంతో మళ్లీ ఆక్రమణలు వెలిశాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమవ్వడంతో సీపీ శంఖబ్రతబాగ్చి గురువారం సాయంత్రం పూర్ణామార్కెట్‌ మెయిన్‌రోడ్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డుపై దుకాణాలు పెట్టడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని సీపీ గమనించారు. ఆక్రమణలు తొలగించాలని, రోడ్డుపై దుకాణాలు ఉండడానికి వీల్లేదని సిబ్బందిని ఆదేశించారు. అయితే సీపీ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించే ప్రయత్నం సిబ్బంది చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దుర్గాలమ్మ గుడి వరకూ నడుచుకుంటూ వెళ్లిన సీపీ రోడ్డుపై దుకాణాలు తొలగించాలని చెబితే పట్టించుకోరా?...అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఒకటి, రెండు చోట్ల మాత్రమే ఆక్రమణలను ట్రాఫిక్‌ సిబ్బంది తొలగించారు. సీపీ వెళ్లిపోగానే తొలగించిన దుకాణాలను తిరిగి రోడ్డుపై ఏర్పాటుచేసుకున్నా అక్కడే ఉన్న పోలీసులుగానీ, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌గానీ అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యపరిచింది. పోలీస్‌, జీవీఎంసీ అధికారులను ఆశీలు వేలం కాంట్రాక్టు దక్కించుకున్న కూటమి చోటా నేత ప్రసన్నం చేసుకున్నారని, అందుకే ఆయనకు సహకరిస్తున్నారని వ్యాపారులు భావిస్తున్నారు.

Updated Date - Apr 04 , 2025 | 01:27 AM