Share News

Celebratory సంబరంగా..

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:46 PM

Celebratory జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో శనివారం టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

Celebratory సంబరంగా..
సాలూరు క్యాంపు కార్యాలయంలో కేకు కట్‌ చేస్తున్న మంత్రి సంధ్యారాణి

  • ఉత్సాహంగా పాల్గొన్న శ్రేణులు

  • ఎన్టీఆర్‌కు ఘన నివాళి

పార్వతీపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో శనివారం టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. పార్టీ కార్యాలయాల వద్ద టీడీపీ జెండా ఎగురవేశారు. కేకులు కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. సీనియర్‌ నేతలను సత్కరించారు.

ఎన్టీఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా..

సాలూరు: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీ పిలుపునిచ్చారు. సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రేణులతో కలిసి ర్యాలీగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లారు. గజమాలను వేసి నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు నెలకొల్పారని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహానుభావుడని కొనియాడారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి పెట్టారు. 43 మంది సీనియర్‌ టీడీపీ నాయకులు, కార్యకర్తలను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత మంత్రి సంధ్యారాణి సాలూరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, నాయకులు వేణు గోపాలనాయుడు, పరమేష్‌, వెంకటరమణ, శోభారాణి, అప్పయమ్మ, కౌన్సిలర్లు వైదేహి, హర్ష, పాంచాలి సర్పంచ్‌ యుగంధర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా టీడీపీ: ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి

కురుపాం: పేద, బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి తెలిపారు. కురుపాంలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన సీనియర్‌ నాయకులు బిడ్డిక కడాయి, గుడ్ల కోటి, ఆనంద్‌, రామారావు, బి.లక్ష్మణ్‌, కిమిడి వెంకటరావును సన్మానించారు. పార్టీ అభివృద్ధిపై రూపొందించిన వీడియోను నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్‌ బోర్డు డైరెక్టర్‌ పి.లావణ్య, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ కడ్రక కళావతి, మండల కన్వీనర్‌ కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:46 PM