Share News

Possession of marijuana: వెంటాడి.. పట్టుకుని

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:54 PM

Possession of marijuana: పోలీసులను చూసిన గంజాయి స్మగ్లర్లు వాహనాలను యూటర్న్‌ తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వారిని చూసిన పోలీసులు వెంటాడి రూ.39 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు.

Possession of marijuana: వెంటాడి.. పట్టుకుని
స్వాధీనం చేసుకున్న గంజాయి

- రూ.39 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

- వాహనాలు విడిచిపెట్టి పరారైన ముగ్గురు వ్యక్తులు

- వివరాలు వెల్లడించిన ఏఎస్పీ అంకిత సురానా

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పోలీసులను చూసిన గంజాయి స్మగ్లర్లు వాహనాలను యూటర్న్‌ తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వారిని చూసిన పోలీసులు వెంటాడి రూ.39 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు. అయితే, వాహనాలను విడిచిపెట్టి ముగ్గురు స్మగ్లర్లు పరారయ్యారు. ఈ వివరాలను పార్వతీపురం ఏఎస్పీ అంకిత మహావీర్‌ సురానా గురువారం విలేకరులకు వెల్లడించారు. ఆమె వివరాల మేరకు.. గంజాయి రవాణాపై సాలూరు రూరల్‌ సీఐ పి.రామకృష్ణకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో పాచిపెంట మండలం ఆలూరు వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేపై సీఐ పర్యవేక్షణలో పాచిపెంట ఎస్‌ఐ వెంకటసురేష్‌, పోలీసు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పాచిపెంట మండలం పెదమడ ఘాట్‌రోడ్డు నుంచి బొలోరో, ఆల్టో వాహనాలు వచ్చాయి.


పోలీసులను చూసి అవి యూటర్న్‌ తీసుకున్నాయి. అవి వచ్చిన దారినే వెళ్లిపోతుండడంతో ఎస్‌ఐ వెంకటసురేష్‌, సిబ్బంది జీపులో వాటిని వెంటాడారు. కొంత దూరం వెళ్లిన తరువాత రెండు వాహనాలను నిలిపి ముగ్గురు వ్యక్తులు అందులో నుంచి దిగి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా తలో దారిలో చీకట్లో పారిపోవడంతో దొరకలేదు. వాహనాలను తనిఖీ చేయగా 43 ప్యాకెట్లతో ఉన్న 396 కిలోల గంజాయి పట్టుబడింది. వాటి విలువ దాదాపు రూ.39 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. గంజాయి పట్టుకోవడంలో సాలూరు పోలీస్‌ టీం చూపిన ప్రత్యేక చొరవను ఆమె అభినందించారు. ఈ ఏడాది ఆరంభమై 93 రోజుల్లో 1,500 కిలోల గంజాయిని సాలూరు పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువత గంజాయి జోలికి వెళ్లవద్దన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. వీటి సమాచారాన్ని 1972కు అందించి పోలీసులకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ నిరోధక ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు రూరల్‌ సీఐ రామకృష్ణ, పట్టణ సీఐ బి.అప్పలనాయుడు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

3-SLR-(-R-)-21.gif

వివరాలు చెబుతున్న ఏఎస్పీ అంకిత సురానా

Updated Date - Apr 03 , 2025 | 11:54 PM