పది పరీక్షలు ముగిశాయి
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:21 AM
జిల్లాలో పది పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి.

జిల్లాలో ఆఖరి పరీక్షకు 22,596 మంది విద్యార్థులకు 21,795 మంది హాజరు
తనిఖీ బృందాలు, అధికారుల పర్యవేక్షణ
ప్రశాంతంగా పరీక్షలు
రేపటి నుంచి మూల్యాంకనం
వీరవాసరం జడ్పీ హైస్కూల్లో ఏర్పాట్లు
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పది పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 52 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఏవిధమైన మాల్ ప్రాక్టీస్ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి మాస్ కాపీయింగ్ కేసులు నమోదు కాలేదు. జిల్లాలో ఆఖరి రోజు సోషల్ పరీక్షకు 22,596 మంది విద్యార్థులకు 21,795 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో ఫ్లైయింగ్ స్వ్కాడ్ 38 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పది పరీక్షలను 22,596 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా, కరస్పాండెంట్ విధానంలో జిల్లాలో మరో 480 మంది పరీక్షలు రాశారు.
విద్యార్థుల హుషారు
14 రోజుల నుంచి జరుగుతున్న పరీక్షలు ముగియడంతో విద్యార్థులు హుషారుగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. ఈ సారి ప్రతీ పరీక్షకు మధ్య ఒకరోజు సెలవుతో విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలిగారు. తర్వాతి పరీక్షకు సన్నద్ధం కావడానికి వారికి వెసులుబాటు దొరికింది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచేందుకు అవకాశం లభించినట్టయింది.
రేపటి నుంచి మూల్యాంకనం
పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈనెల 3 నుంచి మూల్యాంకనం నిర్వహించనున్నారు. వీరవాసరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పది పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పాఠశాలలోని 25 గదులను ఈ మూల్యాంకనం కోసం కేటాయించారు. 850 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరు కానున్నారు. లక్షా 80వేల జవాడు పత్రాల మూల్యాంకనం ఈనెల 9 వరకూ జరగనుందని డీఈవో నారాయణ తెలిపారు.