Share News

ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:27 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు పౌలీ్ట్ర ఫారాల్లో కోళ్లు బర్డ్‌ఫ్లూ వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది.

ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి
బర్డ్‌ ప్లూ కారణంగా ఫౌల్ర్టీ ఫారంలో చనిపోయిన కోళ్లు

భోపాల్‌ ల్యాబ్‌కు కానూరు, వేల్పూరు, బాదంపూడి పౌల్ర్టీల్లోని కోళ్ల నమూనాలు.. పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ చేసిన నిపుణులు

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధికారిక సమాచారం.. జీవో నెంబరు 122 జారీ

తణుకు రూరల్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి):ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు పౌలీ్ట్ర ఫారాల్లో కోళ్లు బర్డ్‌ఫ్లూ వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం వచ్చింది. ఇదే విషయాన్ని గెజిట్‌లో ప్రచురించి సదరు కోళ్లు చనిపోయిన ఫారాల నుంచి కిలోమీటరు వరకు ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, పది కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్‌ జోన్‌గా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులోని పౌల్ర్టీ ఫారంలోను, 11న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం ఫౌల్ర్టీ ఫారంలోను, 13న ఉంగుటూరు మండలం బాదంపూడి పౌల్ర్టీ ఫారంలోను వేలాది కోళ్లు చనిపోయాయి. ఇవన్నీ బర్డ్‌ప్లూతోనే చనిపోయాయని భావించినప్పటికీ అధికారికంగా నిర్ధారణ అయ్యే వరకు చెప్పలేమని అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే ముందుజాగ్రత్తచర్యగా కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు పరిసర ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా ప్రకటించి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజస్‌కు పంపగా ఈ కోళ్ల ఫారాల్లో చనిపోయిన కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షియస్‌ అండ్‌ కంటాజియస్‌ డిసీజీస్‌ ఇన్‌ యానిమల్స్‌ యాక్ట్‌ కింద కానూరు, వేల్పూరు, బాదంపూడిల్లోని బర్డ్‌ఫ్లూ ప్రభావిత కోళ్ల ఫారాల నుంచి కిలోమీటరు వరకు ఉన్న పరిధిని ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను సర్వై లెన్స్‌ జోన్‌లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల నుంచి కోళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంపై అంక్షలు అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ గురువారం జీవో నెం.122 జారీ చేశారు. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్నందున ఈ ఆదేశాలు అమలు చేస్తారా ? లేదా ? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

బర్డ్‌ ఫ్లూ ప్రభావంతో ఫిబ్రవరిలో 22 రోజులపాటు అలెర్ట్‌ జోన్‌ పరిధిలోని తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో చికెన్‌, కోడి గుడ్ల అమ్మకాలు, వినియోగం నిలిచిపోయింది. దీనితో చికెన్‌, గుడ్ల సంబంధిత రంగాలు మూసివేశారు. తిరిగి మార్చి ఒకటి నుంచి చికెన్‌, ఎగ్‌ మేళాలను నిర్వహించి చికెన్‌, కోడి గుడ్ల వినియోగంపై ప్రజలలో అవగాహన కల్పించారు. ఇప్పుడిప్పుడే చికెన్‌ అమ్మకాలు గాడిన పడి వ్యాపారాలు సాగుతున్నాయనే ధీమాలో చికెన్‌, కోడి గుడ్ల వ్యాపారులతోపాటు చికెన్‌ పలావ్‌, పకోడి వ్యాపారులు ఉన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:30 AM