పేరుకే సొంతం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:39 AM
నరసాపురం స్టీమర్ రోడ్, మెయిన్‌రోడ్ అంటే ఖరీదైన ప్రాంతాలు, ఇక్కడ గజం స్థలం కొనాలంటే రూ.లక్ష చేతిలో ఉండాల్సిందే. అదే మెయిన్‌రోడ్ అయితే మరో రూ.లక్ష కలపాలి. అయినా దొరకని పరిస్థితి. ఇలాంటి విలువైన ప్రాంతంలో ఎన్నో దుకాణాలు, నివాసాలు ఉన్నాయి.

రిజిస్ట్రేషన్లు జరగవు.. కాగితాలు ఉండవు
నిషేధిత జాబితాలో కోట్ల ఆస్తులు
53/1బీ సర్వే నంబరులో 400పైగా ఇళ్లు, దుకాణాలు.. 150 ఎకరాలు
నరసాపురం స్టీమర్ రోడ్ నుంచి శివాలయం వరకు..
రెండేళ్లుగా నిలిచిన లావాదేవీలు
బ్యాంకు రుణం దక్కని పరిస్థితి
స్థల యజమానులకు ఇబ్బందులు
నరసాపురం, మార్చి 17(ఆంధ్రజ్యోతి):
నరసాపురం స్టీమర్ రోడ్, మెయిన్‌రోడ్ అంటే ఖరీదైన ప్రాంతాలు, ఇక్కడ గజం స్థలం కొనాలంటే రూ.లక్ష చేతిలో ఉండాల్సిందే. అదే మెయిన్‌రోడ్ అయితే మరో రూ.లక్ష కలపాలి. అయినా దొరకని పరిస్థితి. ఇలాంటి విలువైన ప్రాంతంలో ఎన్నో దుకాణాలు, నివాసాలు ఉన్నాయి. రెండేళ్లుగా వాటిని అమ్ముకుందా మంటే కొనేవాళ్లు లేరు. కనీసం బ్యాంకు నుంచి రుణం తీసుకుందామంటే ఆన్‌లైన్‌లో చూపించని పరిస్థితి. రిజిస్ర్టేషన్ల జరగవు. ఒకవేళ చేయాలనుకుంటే దానికి మరో నంబరు జత కలిపి రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. ఇలా ఒకటి, రెండు కాదు 150 ఎకరాల్లో 400లకు పైగా ఇళ్లు, దుకాణాలకు క్రయ విక్రయాలు లేక స్థల యాజ మానులు రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల విద్య, పెళ్లిళ్లకు అవసరమైన బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకుందామన్న దొరకని పరిస్థితి. ఏం చేయాలో తెలియక కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు సర్వే చేసి సరిచేస్తామంటూ సర్దిచెబుతున్నారు. స్టీమర్ రోడ్‌లోని టేలర్ హైస్కూల్ నుంచి మెయిన్‌రోడ్, శివాలయం సెంటర్ వరకు వున్న మునిసిపల్ ప్రాంతంలోని సర్వే నంబరు 53/1బీలో ఈ పరిస్థితి నెలకొంది.
గత ప్రభుత్వ హయాంలో..
2023 వరకు ఈ సర్వే నంబరులో క్రయ విక్రయాలు యథావిధిగా జరిగేవి. సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో ఈసీ తీస్తే ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నది, తాకట్టులో ఉందా, లేక ఆస్తిదారుడి పేరునే ఉందన్న వివరాలు వచ్చేది. అయితే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సర్వేతో సీన్ మారింది. 53/1బీ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చారు. దీనికి అనేక కారణాలను చూపించారు. న్యాయస్థానం ఆదేశాలతో కొన్ని సబ్ డివిజన్‌లను నిలుపుదల చేస్తే మరికొన్నింటిని అప్పటి జిల్లా అధికారుల ఆదేశాలతో పూర్తిగా నిషేధిత ప్రాంతంలో చేర్చే శారు. ఈ సర్వే నంబరులో అత్యధికంగా ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. స్టీమర్‌రోడ్‌లోని రాజగోపాలస్వామి, దానికి ఎదురుగా వైద్య ఆరోగ్యశాఖ ఖాళీ స్థలం, కనకదుర్గా ఆర్చి వద్ద దేవస్థానం సత్రం, దుకాణాలు, ఖాళీ స్థలం, ఇటు శివాలయం వద్ద బాలిక స్కూల్, కోర్టు, పోస్టల్ కార్యాలయం, సమీపంలోని ఎండోమెంట్ దుకాణాలు, ఆదికేశవ ఎంబర్‌మన్నార్ ఆలయ స్థలాలు ఉన్నాయి. అత్యధిక ప్రభుత్వ స్థలాలు ఈ సర్వే నంబర్‌లో ఉండడంతో వాటిని విడగొట్టి సబ్ డివిజన్లు చేయలేదు. ఈ భూములన్నీ రిజిస్ర్టేషన్లు కాకుండా అప్పటి అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అమ్మకాలు సరే.. రుణాలు లేవు..
ఈ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. క్రయవిక్రయాలు జరగడం లేదు, అత్యవస రమై డబ్బు అవసరమైనవారు అమ్ముకుందా మంటే కొనేవాళ్లు అయినకాడికి అడుగుతు న్నారు. దాన్ని కూడా 53/2లేదా 3 అని వేస్తేనే రిజిస్ర్టేషన్ అవుతుంది. ఈ విధంగా కొంత మంది ఆస్తుల్ని అమ్ముకున్నారు. అయితే లింకు డాక్యుమెంట్‌కు ఈ సర్వే నంబరు సరి పోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఈ కారణంగా ఈ సర్వే నంబరులోని ఇళ్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలను కొనేందుకు ముందుకు రావడం లేదు. ఇక వ్యాపారులు రుణం తీసుకుందామంటే ఆన్‌లైన్‌లో ఈ సర్వే నంబరును నిషేధితంగా మార్క్ చేసి కనిపి స్తుంది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. ఉన్నతవిద్యలకు విదేశాలకు వెళ్లే పిల్లలకు ఈ ఆస్తిని ష్యూరిటీగా చూపిద్దామంటే ఉపయోగంలేని పరిస్థితి నెలకొంది.
త్వరలో సర్వే చేసి సరిచేస్తాం
ఈ సర్వే నంబరులో ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి, ఈ కారణంగా నిషేధిత జాబితాలో ఉంచి ఉండవచ్చు. కొన్ని ఆస్తులపై కోర్టు ఆదేశాలు ఉన్నాయి. 2023 నుంచి ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లా అధికారుల దృష్టికి ఈవిధమైన సర్వే నంబర్లను తీసుకెళ్లాం. త్వరలో సర్వే చేసి సరిచేస్తాం
– రాజరాజేశ్వరి, తహసీల్దార్, నరసాపురం
రిజిస్ట్రేషన్లు జరగడం లేదు
పట్టణంలోని స్టీమర్‌రోడ్ నుంచి శివాలయం సెంటర్ వరకు ఉన్న సర్వే నంబరు 53/1బిలో రెండేళ్ల నుంచి రిజిస్ర్టేషన్లు జరగడంలేదు. నిషేధిత ప్రాంతంగా గుర్తించడంతో ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలు కనిపించడం లేదు. ఈ కారణంగా క్రయ విక్రయాలు కూడా నిలిచిపోయాయి. ఆస్తికి సంబంధించిన ఈసీ వివరాలు రావడం లేదు.
– కోయా చింతారావు, లేఖరి