కొల్లేరువాసుల్లో టెన్షన్.. టెన్షన్..
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:57 AM
దక్షిణాసియాలో మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు సరస్సు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆక్రమణలు, వన్యప్రాణి సంరక్షణ ఎలా..
కొల్లేరు హద్దులు గుర్తించండి
సరస్సులో మురగు, వ్యర్థాలు ఉండొద్దు
ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
నివేదిక సమర్పణకు నేటితో గడువు పూర్తి
క్షేత్రస్థాయిలో పూర్తికాని సర్వే
గడువు కోరడానికి ప్రభుత్వం సిద్ధం?
దక్షిణాసియాలో మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు సరస్సు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్రమణలు, వన్యప్రాణి సంరక్షణ, కొల్లేరు హద్దులపై మూడు నెలల క్రితమే సుప్రీంకోర్టు ఆదే శాలు ఇచ్చింది. అదే సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండబోవని అవగాహన కల్పించాలని సూచించింది. కొల్లేరు సరస్సులో నీటి ప్రవాహాన్ని అడ్డుకుని వన్యప్రాణి సంరక్షణకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలపై సరైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 19లోపు తమకు నివేదించాలని సూచించింది. క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరుతుందా? ఏ నివేదిక ఇస్తుందని కొల్లేరు వాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లేరువాసులంతా తమ కు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మె ల్యేలు, ఎంపీలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లేరు సరి హద్దులు గుర్తించాల్సి వస్తే తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలిన వారు కోరుతున్నారు. అటవీ ఉన్నతాధి కారుల ఏలూరు రూరల్ మండల పరిధిలోని కొల్లేరు ప్రాంతా న్ని పరిశీలించారు. కొల్లేరు హద్దులను నిర్దేశించేవిధంగా ఇంత కుముందే ఉన్న సర్వేలను ఆధారంగా సరిహద్దు రాళ్లను గుర్తించారు. వాస్తవానికి కొల్లేరులో చేపల చెరువుల పేరిట దాదాపు 15 వేలకుపైగా ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు ఇంత కుముందే ఉన్నత న్యాయస్థానం దృష్టికి కొందరు తీసుకు వెళ్లారు. అధికారుల పరిశీలనలో 18 వేల ఎకరాలకు పైబడి ఆక్రమణలు గుర్తించినట్లు సమాచారం. మరింత లోతుగా పరి శీలిస్తే ఆక్రమణల భాగోతం బయటపడే అవకాశాలు లేకపోలే దని కొందరు భావిస్తున్నారు.
సుప్రీం కోర్టుకు నివేదించడానికి సాధ్యమైనంత మేర కొల్లేరు పరీవాహక ప్రాంతాన్ని అటవీ అధికారులు జల్లెడ పట్టారు. సరస్సులో భూభాగమంతా ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు బాహ్య ప్రపంచానికి తెలుసు. అసలు కొల్లేరు పరీ వాహక ప్రాంతంలో దురాక్రమణపై దృష్టి సారించారు. వివిధ రాజకీయ పార్టీల అండదండలు ఉన్న ఆక్రమణలదారులపై ఫిర్యాదు చేయడానికి స్థానికులు జంకుతున్నారని కొందరు భావిస్తున్నారు.