Share News

రింగా.. టెండరా ?

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:18 AM

రాష్ట్రంలో ప్రభుత్వానికి రేవు పాటల ద్వారా అత్యధిక ఆదాయం వచ్చే వాటిలో మాధవా యిపాలెం రేవు ఒకటి. ఏటా పాట ద్వారా రూ.3.50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

రింగా.. టెండరా ?

మాధవాయిపాలెం రేవుకు రికార్డు స్థాయిలో షెడ్యూల్‌ విక్రయాలు

21న పాట, 20 వరకు షెడ్యూల్‌ స్వీకరణ

పోటీ ఉంటే రూ.4 కోట్ల వరకు ఆదాయం

తెర వెనుక ఆదాయం గండికొట్టేందుకు యత్నాలు

నరసాపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వానికి రేవు పాటల ద్వారా అత్యధిక ఆదాయం వచ్చే వాటిలో మాధవా యిపాలెం రేవు ఒకటి. ఏటా పాట ద్వారా రూ.3.50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేవు పాట నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న నరసాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో పాట జరగనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ విక్రయాల గడువు ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పాటలో పాల్గొనేందుకు 15 షెడ్యూళ్లు విక్రయించారు. దీంతో అధికారులు ఈసారి పాటదారుల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రారంభ ఽధర రూ.3.13 కోట్లుగా నిర్ణయించారు. ముందుగా బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఇందులో ఎక్కువ మొత్తంలో పాడిన పాటదారుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. ఇందులో బహిరంగ వేలంకంటే ఎక్కువ మొత్తంలో కోడ్‌ చేసి ఉంటే ఆ పాటదారుడికి రేవును ఖరారు చేస్తారు. లేని పక్షంలో బహిరంగ వేలంలో ఎవరూ ఎక్కువ మొత్తంలో పాడుకుంటే వారికే పాట దక్కుతుంది. ఈసారి ఈ రెండు పద్ధతు ల్లోనే పాటను నిర్వహిస్తుండటంతో గుత్తేదారుల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

గతంలో రికార్డు స్థాయిలో ఆదాయం

2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.3.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఆల్‌ టైం రికార్డు. గత ఏడాది ఏడు నెలలకే పాటను నిర్వహించారు. అందులో కూడా రూ.2.96 కోట్లకు పాడుకున్నారు. ఈసారి స్థానికులతోపాటు కాకినాడ, కోనసీమ జిల్లాల లోని టెక్కిశెట్టిపాలెం, పెదపట్నం, పొడూరు, ఆచంట, యలమంచిలి ప్రాంతాల నుంచి కొన్ని సొసైటీలు షెడ్యూల్‌లో కొనుగోలు చేశాయి. పాటలో పాల్గొవాలంటే డిపాజిట్‌ రూ.33 లక్షలు చెల్లించాలి. వారినే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ కొనుగోలు చేసిన పాటదారుల్లో ఎంత మంది డిపాజిట్‌ చెల్లించి పాటలో పాల్గొంటారన్నది చర్చనీయాంశమైంది. అయితే సొసైటీలకు డిపాజిట్‌ మినహాయింపు ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది. వీటితోపాటు చార్జీలు పెరిగాయి. గోదావరిలో దూరం కేవలం 200 మీటర్లు అయినప్పటికీ పంటు ఎక్కాలంటే రూ.20 జేబులో ఉండాలి. అదే బైక్‌ మీద అయితే రూ.35, కారుకు రూ.180, ఇలా ప్రతి వాహనానికి ఒక్కొక్క రేట్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ కారణంగా రేవుకు ఆదాయం భారీగా వస్తుండ టంతో పాటదారుల మధ్య పోటీ నెలకొంది.

సిండికేట్‌కు యత్నం

పాట జరగకుండా కొందరు రింగ్‌ మాస్టర్లు రాజీచేసే యత్నాలను తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మనం.. మనం పోటీపడి ఆదాయం పెంచేకంటే.. ఒక నిర్ణయంతో టెండర్లు వేసుకోవాలన్న ప్రతిపాదన తీసుకొచ్చి నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. అధికారులు మాత్రం బయట ఏమి జరిగినా తమకు అనవసరమని ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో పాడుకుంటునే పాటను ఓకే చేస్తామని చెబుతున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:18 AM