Share News

రైతులకు తోడుంటాం

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:19 AM

‘రైతులకు సాంకేతికంగా కానీ, ఆర్థిక వనరుల రూపంలో కానీ అన్ని విధాలా తోడుంటాం’ అని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జడ్‌.వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.

 రైతులకు తోడుంటాం
వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు హామీ

వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు హామీ

‘రైతులకు సాంకేతికంగా కానీ, ఆర్థిక వనరుల రూపంలో కానీ అన్ని విధాలా తోడుంటాం’ అని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జడ్‌.వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ జేడీతో బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఆంధ్రజ్యోతి ఫోన్‌ఇన్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలోని రైతులు నేరుగా వారి సందేహాలు, సమస్యలను ఆంధ్రజ్యోతి ద్వారా ఫోన్‌లో జేడీఏ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తెలపడంతో పాటు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో పురుగుమందుల వాడకం తగ్గించేలా విప్లవాత్మకమైన వ్యవసాయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

భీమవరం టౌన్‌/భీమవరం అర్బన్‌/ తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి) :

ముందుగా ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలి

జిల్లాలో వరికోతలు చాలా చోట్ల ముందస్తుగా ప్రారంభి స్తున్నారు. అదేవిధంగా ఐకేపీ సెంటర్‌లు ప్రారంభిస్తే రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది.

– కేశిరెడ్డి దిలీప్‌, మాదివాడ, ఆకివీడు రైతు

జేడీఏ: తాడేపల్లిగూడెంలో ఈనెల మూడో తేదీన తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభిస్తున్నాం. అవసరమైతే అన్ని ప్రాంతాల్లో ప్రారంభిస్తాం.

నీరు బయటకు వెళ్లేలా చూడండి

ఆకివీడు రాజులపేటలో గోపరాజు కోడు నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేక కింద ఆయకట్టు ఎండిపోతుంది.

– ఎం.నాగేంద్ర, రైతు ఆకివీడు

జేడీఏ: అధికారులకు తెలిపి సమస్య పరిష్కరిస్తాం

వరి దుబ్బులు కాల్చొద్దు

దాళ్వాలో కోతలు కోసిన తరువాత వరిదుబ్బులు కాల్చకుండా నివారించేలా చర్యలు తీసుకోవాలి.

– టీవీ సుబ్బారావు, భీమవరం రైతు

జేడీఏ : వరి దుబ్బులు తగలబెట్టడం వల్ల కలిగే అనర్థాలను గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలిస్తాం.

రుస్తుంబాద ప్రాంతంలో మురుగు కాల్వ ఆక్రమణలకు గురికావడం వల్ల 400 ఎకరాలు పంటకు పనికిరాకుండా పోతోంది. ప్రతీ ఏటా ఇదే పరిస్థితి. చర్యలు తీసుకుంటే 500 మంది రైతులకు మంచి జరుగుతుంది.

– కూనపరెడ్డి వీరవెంకట రంగారావు, నరసాపురం

జేడీఏ: డ్రెయిన్స్‌ శాఖతో ఈ విషయం చర్చించి రైతులకు మేలు జరిగేలా చూస్తాం.

తక్కువ సమయంలో పంట రకాలు కావాలి

సార్వాలో దీర్ఘకాలిక (150 రోజులకు) పంట వచ్చే రకాలు వేయడం వల్ల పంట ప్రకృతి వైపరీత్యాల భారిన పడి రైతులు నష్టపోతున్నారు. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే రకాలు వేసేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలి.

సీహెచ్‌ రామ్మోహణరావు, మండపాక.

జేడీఏ: తక్కువ సయయంలో చేతికి వచ్చే రకాలను ఇప్పటికే రైతులకు పరిచయం చేశాం. ఎన్‌ఎల్‌ఆర్‌ 3238 రకం వల్ల మంచి ఆరోగ్య పోషకాలతో పాటు 120 రోజులకే పంట చేతికి వస్తుంది. ఈ రకాన్ని పరీక్షిస్తున్నాం, సక్సెస్‌ అయితే రైతులకు అవగాహన కల్పిస్తాం.

పంట నష్టపరిహారమివ్వాలి

ఎర్రకాలువ వరదల వల్ల జూలైలో పంట నష్టం వాటిల్లగా ఇప్పటివరకు పరిహారం అందలేదు. విజయవాడ బుడమనేరు రైతులకు ఇచ్చినట్టు రూ.10వేలు పరహారం అందించాలి.

– పరిమి వీరభద్రరావు

సొసైటీ మాజీ అధ్యక్షుడు నవాబుపాలెం.

– ముళ్లపూడి రామకృష్ణ, జగన్నాధపురం.

జేడీఏ: పరిహారం త్వరలోనే అందుతాయి. ప్రభుత్వ జీవోలను అనుసరించి రూ.6800 పరిహారం అందించనున్నాం.

మా ప్రాంతం రైతు సేవా కేంద్రంలో సహాయకులు లేక రైతులకు సరిగా సేవలు అందడంలేదు. ఆర్‌.కండ్రిక, కె. కుముదవల్లి ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల వరకూ సాగు భూమి ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నాం.

– పంపా నాగేశ్వరరావు, కె.కుముదవల్లి.

జేడీఏ : సిబ్బంది కొరత ఉంది, రేషనలైజేషన్‌ ద్వారా సిబ్బందిని నియమించే చర్యలు తీసుకుంటాం.

53 సెంట్ల భూమి చూపండి

గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో భాగంగా మాది 53 సెంట్లు లేనట్టు చూపించింది. అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఇప్పుడైనా సమస్య పరిష్కరించండి. మహిళా ఉద్యోగుల ఇబ్బంది దృష్ట్యా రైతు సేవా కేంద్రాల వద్ద టాయిలెట్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

– పీవీఎస్‌ గోపాలకృష్ణంరాజు, యండగండి, రైతు

జేడీఏ: రీ సర్వే ఇబ్బందులను రెవెన్యూ అధికారులు సభలు నిర్వహించి పరిష్కరించే చర్యలు చేపట్టారు. రైతు సేవా కేంద్రాల్లో టాయిలెట్స్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశాలతో ఉపాధి హామీ నిధులతో నిర్మించేందుకు చర్యలు చేపట్టాం.

సబ్సిడీపై సామగ్రి అందించండి

గతంలో రైతులకు సబ్సిడీపై టార్ఫాలిన్‌లు, పవర్‌ టిల్లర్‌లు, ఇతర సామగ్రి ఇచ్చేవారు. కానీ గత ఐదేళ్లలో వాటి ఊసేలేదు.

ఎన్‌.రవికుమార్‌, ఆచంట వేమవరం.

మా ప్రాంతంలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులే దమ్ముచేసుకునేందుకు ప్రభుత్వం నుంచి రోటోవేటర్‌లు కానీ చిన్న ట్రాక్టర్‌లు కానీ అందించాలి.

– కొవ్వూరి కళ్యాణ శ్రీనివాసరెడ్డి, పెంటపాడు.

జేడీఏ: సబ్సిడీపై గత ఏడాది చివర్లో 140 పవర్‌ టిల్లర్‌లు మాత్రమే వచ్చాయి. వాటిని కొంతమందికే ఇవ్వగలిగాం. ఈ ఏడాది అందరికీ సబ్సిడీపై పవర్‌ టిల్లర్‌లు, రోటోవేటర్లు అందిస్తాం. టార్ఫాలిన్‌ల కోసం 83 వేల యూనిట్‌లు కావాలని ప్రతిపాదనలు పంపించాం.

రసాయనాల వాడకంలో జిల్లాకు మూడో స్థానం

ఎరువుల వాడకం తగ్గించేందుకు నవధాన్యాల విత్తనాలు : జేడీఏ

రసాయన ఎరువులు వాడకంలో మన జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉంది. ఎరువుల వాడకం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దాళ్వా తరువాత రసాయన ఎరువుల వాడకం తగ్గించేందుకు, భూసారం పెరిగేందుకు కోతలు కోసిన భూముల్లో చల్లేలా నవధాన్యాల విత్తనాలు అందిస్తున్నాం. 12 కేజీల కిట్‌ ఇస్తారు. దీనిలో 15 నుంచి 25 రకాల విత్తనాలు ఉంటాయి. పప్పుధాన్యలు, తృణ ధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు, ఽనూనె గింజలు, ఆవాలు, నువ్వులు, అపరాల విత్తనాలు ఉంటాయి. ప్యాకెటు రూ.750–800 ఉంటుంది. ఇప్పటికే 25వేల ఎకరాలకు సం బంధించి కిట్‌లు అందజేశాం.. రైతులు వినియోగి స్తున్నారు. మరో 25 వేల ఎకరాలకు సిద్ధం చేస్తున్నాం.

రాబోయే రోజుల్లో భూసార పరీక్షలు నిర్వహించి జింక్‌ లోపాలు ఉన్న భూముల రైతులకు ఉచితంగా జింక్‌ అందిస్తాం. డ్రోన్ల ద్వారా పురుగు మందులను పిచికారీ చేస్తే ఖర్చు సగానికి సగం తగ్గుతుందన్నారు. పొలాల్లో వరి దుబ్బులకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. దుబ్బులను అంటించకుండా డీకంపోజ్‌ అనే మందును 200 లీటర్ల నీటిలో కేజీ బెల్లంతో మందును కలిపి 24 గంటలు ఉంచిన తరువాత దుబ్బులపై పిచికారీ కానీ, కల్లాపులా చల్లితే చాలు దుబ్బు కుళ్లిపోతుందని అవగాహన పెంచుకోవాలన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:19 AM