Share News

Haritha Hotels: హరిత హోటళ్లు.. ఇక బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:24 AM

పర్యాటక ప్రాంతాల్లో విడిది, భోజన సదుపాయాల కోసం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ‘హరిత’ హోటళ్లు.. ఇకపై బార్‌ అండ్‌ రెస్టారెంట్లుగా మారిపోనున్నాయి.

Haritha Hotels: హరిత హోటళ్లు.. ఇక బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌

  • ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్న వాటికి మినహాయింపు

  • నష్టాల నుంచి బయటపడటం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం

  • కొత్త పర్యాటక పాలసీలో భాగంగా టూరిజం శాఖ ప్రతిపాదన

  • ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటళ్లలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సేవలు

  • ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ.. వాటిపై అధికార్ల అధ్యయనం

  • లాభదాయకంగా ఉండటంతో మిగతా వాటినీ మార్చాలని నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతాల్లో విడిది, భోజన సదుపాయాల కోసం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ‘హరిత’ హోటళ్లు.. ఇకపై బార్‌ అండ్‌ రెస్టారెంట్లుగా మారిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత నూతన టూరిజం పాలసీలో భాగంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచడం, నష్టాల్లో ఉన్న హోటళ్లను లాభదాయకంగా మార్చడం కోసం పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనితో ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నవి మినహా మిగతా ప్రాంతాల్లోని దాదాపు అన్ని హరిత హోటళ్లు త్వరలోనే మద్యం, మాంసాహార సరఫరాకు కేంద్రాలుగా మారిపోనున్నాయి.


నష్టం తప్పడమే కాదు.. అదనపు ఆదాయం!

కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన హరిత హోటళ్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ ఉండటం లేదు. వారాంతాలు, పండుగలు, ఇతర సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో మినహా సాధారణ రోజుల్లో హరితహోటళ్లు వెలవెలబోతున్నాయి. దీనితో వాటి నిర్వహణ పర్యాటకసంస్థకు భారంగా మారింది. ఈ క్రమంలోనే ప్రైవేటు సంస్థలకు లీజు రూపంలో, ఇతర మార్గాల ద్వారా అప్పగిస్తే... ఇటు నిర్వహణ నష్టాల నుంచి బయటపడటంతోపాటు అదనంగా ఆదాయం సమకూరుతుందని పర్యాటకశాఖ అధికారులు ఆలోచనకు వచ్చారు. అదే సమయంలో ఆబ్కారీ శాఖకు లైసెన్స్‌ ఫీజులతోపాటు మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూరుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం.


ఇప్పటికే ప్రైవేటు ఇచ్చినవాటిపై అధ్యయనం

పర్యాటక శాఖ ఇప్పటికే గోల్కొండ సమీపంలోని తారామతి బరాదరి, బేగంపేట టూరిజం ప్లాజాలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సేవలను ప్రారంభించింది. ఈగలపెంట, సోమశిల, మన్ననూరు, మేడారం, తాడ్వాయి, బొగత తదితర ప్రాంతాల్లోని హరిత హోటళ్లను బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సేవల కోసం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. అవి నష్టాల ఊబి నుంచి బయటపడటమే కాకుండా సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుతున్నాయి. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లోని హరిత హోటళ్లను బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌గా మార్చడంపై పర్యాటక సంస్థ అధికారులు అధ్యయనం చేశారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌లోని హరిత రెస్టారెంట్‌, నిజామాబాద్‌లోని హరిత ఇందూర్‌ ఇన్‌, లక్నవరం, రామప్ప, వికారాబాద్‌ అనంతగిరి, జగిత్యాల జిల్లా కొండగట్టు, మంచిర్యాల జిల్లా జన్నారం, నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీరంగపురం, మహబూబ్‌నగర్‌ కోయల్‌కొండ, అలంపూర్‌లలో ఉన్న హరిత రెస్టారెంట్లు; ప్రజ్ఞాపూర్‌లోని హరిత హోటల్‌; సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, ఖమ్మం జిల్లా వైరా, వనపర్తి జిల్లా బీచుపల్లిలలోని వేసైడ్‌ ఎమినిటీస్‌ తదితర చోట్ల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహణకు అనుమతించేందుకు పర్యాటక సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. వీటితోపాటు తక్కువ ఆదాయమున్న సంగారెడ్డి జిల్లా నందికంది, ఝరాసంగం కాలేజీ, ములుగు జిల్లా ఘనపూర్‌, జెటప్రోలులోని హరిత హోటళ్లను కూడా బార్లుగా అనుమతించే యోచనలో ఉన్నట్టఉ సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:24 AM