Share News

అభివృద్ధి ప్రణాళికేది?

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:31 AM

తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చేందుకు, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రూపొందించాలని ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రతిపాదనలను ఇంత వరకు ఏ కారణంతో సిద్ధం చేయలేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను నిలదీశారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జడ్పీ కన్వెన్షన్‌ హాలులో శనివారం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాకు చెందిన శాసన సభ్యులతో కలిసి ఎంపీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఎంపీ అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో బాలశౌరి మాట్లాడుతూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

అభివృద్ధి ప్రణాళికేది?

- మత్స్యకారుల జీవన విధానం మార్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారు

- ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుంటే ఎలా?

- దిశ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎంపీ బాలశౌరి

- వివిధ శాఖలపై సమీక్షలో అధికారులపై అసహనం

- జాతీయ రహదారుల విస్తరణపై సర్వేలు సకాలంలో పూర్తి చేయాలి

- ఎదురుమొండి వంతెనకు నాబార్డు ద్వారా రూ.100 కోట్లు విడుదల చేయాలి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చేందుకు, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రూపొందించాలని ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రతిపాదనలను ఇంత వరకు ఏ కారణంతో సిద్ధం చేయలేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను నిలదీశారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జడ్పీ కన్వెన్షన్‌ హాలులో శనివారం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాకు చెందిన శాసన సభ్యులతో కలిసి ఎంపీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఎంపీ అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో బాలశౌరి మాట్లాడుతూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మత్స్యశాఖపై సమీక్షలో జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు వాహనాలు, వలలు, ఐస్‌బాక్సులు, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆ పథకాలను అమలు చేసేందుకు నిధులు తీసుకువస్తానని పదేపదే తాను చెప్పినా పట్టించుకోకపోతే ఎలా అని మత్స్యశాఖ అధికారులు, కలెక్టర్‌ను ఎంపీ నిలదీశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మీరు తయారు చేసిన ప్రతిపాదనలు ఎన్ని, వాటిలో ఎన్ని యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారో తెలియజేయాలన్నారు. 820 యూనిట్లను అందజేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 160 యూనిట్‌లను ఇచ్చామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని, రూ.2.60కోట్ల నిఽధులు కూడా అందుబాటులో ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు, నిధులు ఉన్నా ఏ కారణంతో మత్స్యకారులకు యూనిట్‌లను అందజేయలేకపోతున్నారని, ఎంత కాలాకి వీటిని లబ్ధిదారులకు అందజేస్తారని ఎంపీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకపోతే ఎలా?

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, జిల్లాలో ఎంతమంది కౌలురైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, గుర్తింపు కార్డులు ఇచ్చారని వ్యవసాయశాఖ అధికారులను బాలశౌరి ప్రశ్నించారు. కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదని, ఈ అంశంపై తనకు అనేకమంది ఫిర్యాదు చేశారని, ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కోరారు. కౌలు రైతులకు జిల్లాలో 65 వేల కార్డులు ఇచ్చామని, ఈ ఏడాది మరో 20 వేల మందికి ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని వ్యవసాయశాఖ అధికారులు సమాధానమిచ్చారు. భూమి యజమానులు ముందస్తుగానే పంట రుణాలు తీసుకోవడంతో కౌలురైతులకు రెండోసారి అదే భూమిపై పంట రుణం అందించేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించడం లేదని వ్యవసాయశాఖ జేడీ మనోహరరావు తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయం చేసుకుని కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి పంట రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కోరారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు రుణాలు ఇవ్వాలి

లాభాల్లో ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుద్యోగులు, రైతులకు రుణాలు మంజూరు చేయకుండా విస్మరిస్తున్నాయన్నారు. చిన్నపాటి పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునేందుకు వారికి రుణాలు ఇవ్వాలని కోరారు. పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు అవుతాయని, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన యువతకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. త్వరలో జిల్లాలో రుణమేళాను నిర్వహిస్తున్నామని ముద్ర, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా రూ.50 వేల నుంచి 100 కోట్ల వరకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎదురుమొండి వంతెన నిర్మాణానికి రూ.100 కోట్లను నాబార్డు నుంచి గతంలో మంజూరు చేయించినా, వివిధ కారణాలతో పనులు జరగలేదని, ఈ ప్రతిపాదలను మళ్లీ పునరుద్ధరించి నిధులు విడుదల చేయాలని నాబార్డు జీఎంను కోరారు. నాబార్డు వద్ద క్లైమేట్‌ చేంజ్‌ ఫండ్స్‌ ఉంటాయని, ఉదారంగా ఈ నిధులను జిల్లాలోని సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలని చెప్పారు. ఈ వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎంపీ నిధుల నుంచి రూ.2కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసేందుకు, నిర్మాణాలు నిలిచిపోయిన పీహెచ్‌సీలలో పనులు పూర్తి చేసేందుకు నివేదికలు తయారు చేసి తనకు ఇవ్వాలని డీఎంఅండ్‌హెచ్‌వో శర్మిష్టను ఎంపీ బాలశౌరి సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించండి: మంత్రి కొల్లు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను సక్రమంగా వినియోగించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఉపాధి హామీ పథకం, జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్ల్లాలో ఆరు వేల ఎకరాల్లో కలంకారీ, గోల్డ్‌ కవరింగ్‌, ఆటోనగర్‌, మత్స్యసంపద ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని, బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలని కోరారు. నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం మండలాల్లో అవుట్‌పాల్‌ స్లూయిస్‌లకు కనీస మరమ్మతులు చేయించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జడ్పీ సీఈవో దిశ కమిటీలో నామినేటెడ్‌ సభ్యులను ప్రకటించారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా, జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, ఇండియన్‌ బ్యాంక్‌ సీజీఎం సుజయ్‌మల్లిక్‌, ఎస్‌బీఐ జీఎం శైలేష్‌కుమార్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జీఎం దీపక్‌కుమార్‌ శ్రీవాత్సవ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం సీతారామారావు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ డీజీఎం అమితకుమార్‌శుక్లా, యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ డీజీఎం శ్రీకాంత, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏజీఎం పి.సతీష్‌, నాబార్డు జీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:31 AM