Share News

Organ Donation: బ్రెయిన్‌డెడ్‌ అయిన కుమారుడి.. అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు

ABN , Publish Date - Mar 25 , 2025 | 05:27 AM

కుమారుడు బ్రెయిన్‌డెడ్‌ అయిన బాధలోనూ అతడి తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చారు.

Organ Donation: బ్రెయిన్‌డెడ్‌ అయిన కుమారుడి.. అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు

ఇబ్రహీంపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : కుమారుడు బ్రెయిన్‌డెడ్‌ అయిన బాధలోనూ అతడి తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన టి.ప్రమీలరాణి, శివశంకర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారికి ఒక కుమారుడు అసిలేష్‌(20), ఒక కుమార్తె కుదాల్‌ ఉన్నారు. అసిలేష్‌ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ క్యాంప్‌సలో కంప్యూటర్‌ సైన్స్‌ చివరి సంవత్సరం చదువుతూ ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. కాగా శనివారం అనారోగ్యంతో ఉన్న అతడిని తోటి హాస్టల్‌ విద్యార్థులు దగ్గరలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.


పరీక్షించిన అక్కడి వైద్యులు పెద్దాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో అసిలేష్‌ తల్లిదండ్రుల సూచన మేరకు అతడిని కిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ప్రారంభించారు. అయితే అదే రోజు రాత్రి బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం తల్లిదండ్రులు ప్రమీలారాణి, శివశంకర్‌ వైద్యుల సలహా మేరకు అవయవ దానానికి ముందుకు వచ్చారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు అవయవాలు ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రక్రియ పూర్తి చేసి అసిలేష్‌ మృతదేహాన్ని ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - Mar 25 , 2025 | 05:27 AM