Share News

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సుప్రీంలో శ్రవణ్‌రావుకు ఊరట

ABN , Publish Date - Mar 25 , 2025 | 05:29 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ఎండీ శ్రవణ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సుప్రీంలో శ్రవణ్‌రావుకు ఊరట

  • మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ఎండీ శ్రవణ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ శ్రవణ్‌ హైకోర్టును ఆశ్రయించగా, ఈ నెల 2న ఆ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో శ్రవణ్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. శ్రవణ్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలను వినిపించారు. తన క్లైంట్‌ విచారణకు సహకరిస్తారని, అందుబాటులో ఉంటారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు తన క్లైంట్‌ను విచారించేందుకు ఎలాంటి నోటీసులివ్వలేదని గుర్తుచేశారు. ఈ కారణంగా.. మధ్యంతర రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది దీనికి అభ్యంతరం తెలిపారు.


శ్రవణ్‌రావు పరారీలో ఉన్నారని, ఆయనపై రెడ్‌ కార్నర్‌ నోటీసు సైతం జారీ అయ్యిందని వివరించారు. ఏడాది కాలంగా ఆయన అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఆయనను విచారిస్తే.. కీలక సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. మధ్యలో కల్పించుకున్న జస్టిస్‌ నాగరత్న.. ‘‘శ్రవణ్‌రావును ఈరోజు అరెస్టు చేస్తున్నారా?’’ అని శ్రవణ్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దానికి న్యాయవాది సమాధానమిస్తూ.. ప్రస్తుతం తన క్లయింట్‌ అమెరికాలో ఉన్నందున అరెస్టు చేయలేదని చెప్పారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే. 48 గంటల్లో భారత్‌కు వస్తారని వివరించారు. ధర్మాసనం కల్పించుకుంటూ.. మధ్యంతర రక్షణ కల్పించకపోతే శ్రవణ్‌ దేశానికి రారని, తొలుత ఆయనను రప్పించాలని అభిప్రాయపడింది. శ్రవణ్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోకూడదని పేర్కొంటూ.. మధ్యంతర రక్షణ కల్పించింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. వచ్చేనెల 28న ఈ కేసు మరోమారు విచారణకు వచ్చే అవకాశముంది.

Updated Date - Mar 25 , 2025 | 05:29 AM