Share News

ఆస్తి తగ్గినా.. అంబానీదే అగ్రస్థానం

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:14 AM

ఈ ఏడాది (2025)కి గాను హురున్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌ నుంచి 284 మందికి చోటు లభించింది. గత ఏడాది లిస్ట్‌తో పోలిస్తే 13 మంది పెరిగారు...

ఆస్తి తగ్గినా.. అంబానీదే అగ్రస్థానం

హురున్‌ భారత కుబేరుల జాబితాలో

రిలయన్స్‌ అధిపతికే మళ్లీ అగ్రకిరీటం

అత్యధిక సంపద సృష్టించినా రెండో స్థానంలో గౌతమ్‌ అదానీ

  • సంపన్న మహిళగా రోష్నీ నాడార్‌

  • లిస్ట్‌లో మొత్తం 284 మందికి చోటు

    అందులో 21 మంది తెలుగువారు

  • మన బిలియనీర్ల మొత్తం సంపద విలువ రూ.98 లక్షల కోట్లు

  • భారత జీడీపీలో మూడో వంతు ఇది..

  • సౌదీ అరేబియా జీడీపీ కంటే అధికం..

అధిక బిలియనీర్లున్న దేశాల్లో భారత్‌ నం.3

ముంబై: ఈ ఏడాది (2025)కి గాను హురున్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌ నుంచి 284 మందికి చోటు లభించింది. గత ఏడాది లిస్ట్‌తో పోలిస్తే 13 మంది పెరిగారు. వీరి మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధితో రూ.98 లక్షల కోట్ల కు పెరిగింది. అంటే, మన దేశ జీడీపీలో మూడో వంతు కు సమానం. సౌదీ అరేబియా జీడీపీ కంటే అధికమిది. ఈ జనవరి 15 నాటికి ఆస్తుల విలువ ఆధారంగా బిలియనీర్లకు ర్యాంకింగ్‌లు కేటాయించినట్లు హురున్‌ తెలిపింది. మరిన్ని వివరాలు..


  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి భారత కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఆసియా ఖండంలోనూ ఆయనే నం.1. అంబానీ ఆస్తి 10,000 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.8.6 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి రూ.లక్ష కోట్ల (13 శాతం) మేర తగ్గినప్పటికీ తన అగ్రస్థానాన్ని మాత్రం కాపాడుకోగలిగారు. అయితే, ఈ ఏడాది ప్రపంచ టాప్‌-10లో మాత్రం అంబానీకి చోటు దక్కలేదు. ఈసారి 17వ స్థానానికి పరిమితమయ్యారు.

  • అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ రూ.8.4 లక్షల కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద దాదాపు రూ.లక్ష కోట్ల (13 శాతం) మేర పెరిగింది. భారత బిలియనీర్లలో విలువ పరంగా అత్యధిక సంపద వృద్ధి ఇదే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆయనకు 18వ స్థానం లభించింది.

  • హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్మన్‌ రోష్నీ నాడార్‌ రూ.3.5 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దేశంలోని అత్యంత సంపన్న మహిళ తనే. ప్రపంచంలోని టాప్‌-10 సంపన్న మహిళల్లోనూ రోష్నీ 5వ స్థానంలో నిలిచారు.

  • సన్‌ ఫార్మా చైర్మన్‌ దిలీప్‌ సంఘ్వీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా, బజాజ్‌ ఆటోకు చెందిన నీరజ్‌ బజాజ్‌, ఆర్‌జే కార్ప్‌ అధిపతి రవి జైపురియా, డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్‌ వ్యవస్థాపకులు రాధాకిషన్‌ దమానీ వరుసగా టాప్‌-10లోని తర్వాత స్థానాలను దక్కించుకున్నారు.


  • ఈసారి జాబితాలో 175 మంది భారత బిలియనీర్ల సంపద పెరగగా.. 109 మంది సంపద తగ్గింది లేదా గతేడాది స్థాయిలోనే నమోదైంది.

  • అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 870 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 823 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానం దక్కించుకుంది.

హురున్‌ కుబేరుల జాబితాలోని తెలుగువారు


ప్రపంచ పేరు సంపద కంపెనీ

ర్యాంక్‌ (బి. డాలర్లు)

260 మురళి దివి 10 దివీస్‌ లేబొరేటరీస్‌

600 పీ పిచ్చి రెడ్డి 5.8 మేఘా ఇంజనీరింగ్‌

625 పీవీ కృష్ణా రెడ్డి 5.6 మేఘా ఇంజనీరింగ్‌

1122 ప్రతాప్‌ సీ రెడ్డి 3.3 అపోలో హాస్పిటల్స్‌

1122 పీవీ రాంప్రసాద్‌ రెడ్డి 3.3 అరబిందో ఫార్మా

1198 బీ పార్థసారధి రెడ్డి 3.1 హెటిరో గ్రూప్‌

1624 కే సతీశ్‌ రెడ్డి 2.3 డాక్టర్‌ రెడ్డీస్‌

1796 ఎస్‌ సుబ్రమణ్యం రెడ్డి 2.1 అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌

1796 సీ వెంకటేశ్వర రెడ్డి 2.1 అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌

1796 ఎం సత్యనారాయణ రెడ్డి 2.1 ఎంఎ్‌సఎన్‌ ల్యాబొరేటరీస్‌

2188 జీఎం రావు 1.7 జీఎంఆర్‌ గ్రూప్‌

2188 జూపల్లి రామేశ్వర్‌ రావు 1.7 మై హోమ్‌ గ్రూప్‌

2295 జీవీ ప్రసాద్‌ 1.6 డాక్టర్‌ రెడ్డీస్‌

2448 మహిమ దాట్ల 1.5 బయోలాజికల్‌ ఈ

2575 కృష్ణ చివుకుల 1.4 ఇండో ఎంఐఎం

2878 ఆళ్ల అయోధ్యరామి రెడ్డి 1.2 రాంకీ గ్రూప్‌

3057 ఎన్‌ విశ్వేశ్వర్‌ రెడ్డి 1.1 షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌

3057 వీసీ నన్నపనేని 1.1 నాట్కో ఫార్మా

3057 జగదీశ్‌ ప్రసాద్‌ అల్లూరి 1.1 హెచ్‌బీఎల్‌ పవర్‌

3057 జీఎస్‌ రాజు 1.1 దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌

3206 వెంకటేశ్వర్లు జాస్తి 1 సువెన్‌ ఫార్మా

ఇవి కూడా చదవండి:

Stock Market Update: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

SEBI: ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్

454 చెట్లను నరికించిన వ్యక్తికి 4.54 కోట్ల ఫైన్‌

భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

Updated Date - Mar 28 , 2025 | 03:15 AM