RBI: ఆర్బీఐ నుంచి బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్.!
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:46 PM
ఏప్రిల్ 7-9 తేదీల మధ్య ఆర్‌బీఐ ద్వైపాక్షిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏప్రిల్ 9న ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటిస్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు రెపో రేట్ ప్రకారం డబ్బు అప్పుగా ఇస్తుంది. అంటే, కొన్ని చట్టబద్ధమైన చర్యల కారణంగా దేశంలో ద్రవ్యతను నిర్వహించడానికి ఆర్బీఐకి ఈ రేట్ ఉపయోగపడుతుంది. దీనికి తోడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి ఆర్బీఐ ఉపయోగించే ప్రధాన సాధనాల్లో రెపో రేట్ ఒకటి. సాధారణంగా మనం బ్యాంక్ నుండి డబ్బు అప్పు తీసుకున్నప్పుడు, ఆ లావాదేవీకి సంబంధించి అసలు మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారు కదా.. అదేవిధంగా, బ్యాంకులు కూడా నగదు కొరత సమయంలో ఆర్బీఐ నుండి డబ్బు అప్పు తీసుకుంటాయి. దీనిపై అవి కేంద్ర బ్యాంకుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేట్‌ను రెపో రేట్ అని పిలుస్తారు. రెపో రేట్, రివర్స్ రెపో రేట్లు బ్యాంకుల్లో నగదు నిల్వలపై ప్రభావం చూపుతాయి. తద్వారా బ్యాంకులు రుణాలిచ్చే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. ఇది భారత స్టాక్ మార్కెట్ పైనా ప్రభావం చూపుతుంది.
ఇక, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, అయిదేళ్లలోనే ఎప్పుడూలేని విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ తాజాగా కేంద్ర బ్యాంకు మరోసారి పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్వహించనుంది. ఈసారి కూడా రేట్ల కోత ఉండొచ్చనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రెపో రేటు (Repo Rate)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే మంచిదన్న విశ్లేషణలూ వస్తున్నాయి. అయితే, ఏప్రిల్ 7-9 తేదీల మధ్య ఆర్‌బీఐ ద్వైపాక్షిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏప్రిల్ 9న ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించనున్నారు.
మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ గతేడాది సెప్టెంబరు నుంచి వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అదే సమయంలో భారత రెపో రేటు మాత్రం 25 బేసిస్ పాయింట్లు మాత్రమే దిగొచ్చింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే మంచిదని ఆర్థిక నిఫుణులు అంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 6.25శాతంగా ఉంది. ఈ ఏడాది చివరికి దీన్ని 5.5 శాతానికి తీసుకొచ్చే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ అధ్యయనం చెబుతోంది. ఏప్రిల్‌తో పాటు జూన్, అక్టోబరు నెలల్లో నిర్వహించే సమీక్షల్లోనూ 0.25% చొప్పున ఆర్‌బీఐ రేట్ల కోత విధిస్తుందని అంచనా ఉంది. రానున్న కొన్ని నెలల పాటు రిటైల్ ద్రవ్యోల్బణం 4శాతం దిగువనే ఉండొచ్చని సదరు అధ్యయనం అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా