Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:02 PM
మీరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున కుంభమేళాకు హాజరవుతున్నారు. ఇంత దూరం వెళ్తున్నాం కదా.. పనిలో పనిగా ప్రయాగ్‌రాజ్‌కు దగ్గర్లోనే ఉన్న వారణాసి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని కోరుకోని భక్తుడు ఉండడు. ఎందుకంటే వారణాసి మన దేశ ఆధ్యాత్మిక రాజధాని. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని ఆకాంక్షిస్తుంటారు చాలామంది. గంగానదిలో పుణ్యస్నానం చేస్తే మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అయితే, ప్రస్తుతం మహా కుంభమేళ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో విపరీతమైన రద్దీ నెలకొన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ పద్మవ్యూహం దాటుకుని వెళ్లినా త్వరగా దర్శనం పూర్తవుతుందనే గ్యారెంటీ లేదు. కానీ, దర్శనం త్వరగా, సజావుగా పూర్తయ్యేందుకు ఒక పరిష్కారముంది. ఇలా చేస్తే ఎంత రద్దీ ఉన్నా క్యూలో నిల్చోకుండా కాశీ విశ్వనాథుని నేరుగా దర్శించుకోవచ్చు.
వారణాసిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు..
వరుణ, అసి రెండు నదులు గంగానదిలో కలుస్తాయి కాబట్టే ఈ ప్రాంతానికి వారణాసి అనే పేరు వచ్చింది. బెనారస్ అని కూడా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం హిందూ మతం, బౌద్ధమతం, జైన మతాలకు పవిత్ర నగరం. వారణాసిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం, అన్నపూర్ణాదేవి ఆలయం, పవిత్ర బౌద్ధ స్థలాల్లో ఒకటైన సారనాథ్ స్థూపం, శ్రీ పార్శ్వనాథ్ జైన ఆలయం ఇలా దర్శించాల్సిన పవిత్ర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.
మహాకుంభమేళా యాత్ర ఇలా ప్లాన్ చేసుకోండి..
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల వారూ పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. అక్కడి నుంచి నేరుగా కాశీ, అయోధ్యకు వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రద్దీ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ దాటుకున్నా గంటల తరబడి దర్శనం కోసం క్యూలో వేచిచూడటం అంత ఈజీ కాదు. అందుకే అనుకున్న సమయానికి యాత్ర పూర్తవ్వాలన్నా, గంటల తరబడి క్యూలో వేచి చూడకుండా కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలన్నా యాత్రకు బయల్దేరకముందే కింద చెప్పిన విధంగా చేయండి.
ఆన్‌లైన్‌లో ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి..
సుగమ్ దర్శన్ : క్యూలో ఇబ్బంది లేకుండా త్వరగా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు సుగమ్ దర్శన్ టికెట్ బుక్ చేసుకుంటే నేరుగా పూజారి వచ్చి భక్తుడిని దర్శనానికి తీసుకెళతాడు. సుగమ్ దర్శన్ ఆన్‌లైన్ టికెట్ ధర రూ.250. ఒక రోజులో పరిమిత సంఖ్యలోనే భక్తులు ఈ విధానంలో దర్శనం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు త్వరగా దర్శనం చేసుకోవాలనుకుంటే.. ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలు :
పూజ సమయంలో టికెట్ హార్డ్ కాపీని తప్పక తీసుకెళ్లాలి.
పూజారి కేటాయింపు కోసం షాపురి మాల్ సమీపంలో ఉన్న ఆలయ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించండి.
12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ అవసరం లేదు.
బుకింగ్ తేదీని తిరిగి షెడ్యూల్ చేయడం సాధ్యం కాదు.
హారతి సమయంలో, ప్రత్యేక రోజులలో సుగమ్ దర్శనానికి అనుమతించరు.
భక్తులు ఆ రోజు అందుబాటులో ఉన్న దర్శన స్లాట్‌లో మాత్రమే సుగమ దర్శనం బుక్ చేసుకోవచ్చు.
హెల్ప్‌డెస్క్ కౌంటర్‌లో అదే రోజు బుకింగ్ చేసుకోవచ్చు.
ఆన్ కాల్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో లేదు.
ఆలయ ప్రవేశం, ఆలయ పరిపాలన అనుమతికి లోబడి ఉంటుంది.
ఈ టికెట్ స్పర్శ దర్శనానికి ఉద్దేశించినది కాదు.
మంగళ హారతి : మంగళ హారతికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఇది తొలి హారతి. సూర్యుడు ఉదయించడానికి గంటన్నర ముందే (3-4 గంటల మధ్య) బ్రహ్మముహూర్త సమయంలో ఈ పవిత్ర హారతి ఇస్తారు. భక్తులను 2-3.30గం.ల మధ్య ఆలయంలోకి అనుమతిస్తారు. ఆన్‌లైన్ టికెట్ ధర రూ.500.
అఖండ జ్యోతి దర్శనం..
వారణాసిలో అఖండ జ్యోతి దర్శనానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దర్శనానికి ఆన్‌లైన్ టికెట్ ధర రూ.700.
నేరుగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి :