పూర్వవైభవానికై అమెరికా ఆరాటం!
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:02 AM
ప్రపంచ చరిత్ర కనీసంగానైనా తెలియకపోతే ప్రపంచంలో వేగంగా మారుతున్న నేటి పరిస్థితులు గందరగోళంగానే దర్శనమిస్తాయి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో గెలిచినప్పటికీ బ్రిటన్ ఆర్థికంగా...

ప్రపంచ చరిత్ర కనీసంగానైనా తెలియకపోతే ప్రపంచంలో వేగంగా మారుతున్న నేటి పరిస్థితులు గందరగోళంగానే దర్శనమిస్తాయి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో గెలిచినప్పటికీ బ్రిటన్ ఆర్థికంగా చితికిపోయింది. రాజకీయంగా ఉన్న అగ్రరాజ్య ఆధిపత్య స్థానాన్ని కూడా కోల్పోయింది. అప్పటివరకు వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన అమెరికా, బ్రిటన్ స్థానాన్ని తీసుకున్నది. రెండు ప్రపంచ యుద్ధాలతో ప్రపంచాన్ని విధ్వంసం చేసిన దేశాలన్నీ అమెరికా నాయకత్వంలో ఒకే కూటమిగా ఏర్పడినాయి. సోషలిస్టు దేశాలకు నాయకత్వం వహిస్తున్న సోవియట్ యూనియన్‌ను బూచిగా చూపించి 1949లో అమెరికా తన కూటమిలోని దేశాలను నాటో సైనిక కూటమిగా నిర్మాణం చేసింది. మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఏర్పడిన ఒకే ఒక్క సోషలిస్టు దేశమైన సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మరో అగ్రరాజ్యంగా అవతరించింది. అమెరికాకు బలమైన ప్రత్యర్థిగా ఎదురు నిలిచింది. 1953లో స్టాలిన్ మరణం తరువాత, నాటోకు జవాబుగా 1955 మే నెల 14న వార్సా ఒప్పందం ద్వారా సైనిక కూటమిని సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసింది. 20వ శతాబ్దం మధ్య నుండి ప్రపంచంపై ఆధిపత్యం కొరకు ఈ రెండు కూటముల మధ్య కోల్డ్‌వార్ పేరు మీద ప్రాంతీయ యుద్ధాలు సాగినాయి.
సోషలిస్టు కూటమిని ఓడించడానికి, అణచి ఉంచడానికి అమెరికా ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలకు ఎన్నో రాయితీలు, కాంట్రాక్టులు ఇచ్చింది. ఎన్నో కార్యక్రమాలకు నిధులు సమకూర్చింది. సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇలా ఎంతో ఖర్చు చేసి, ప్రపంచ ఆధిపత్యం ద్వారా అంతకంటే ఎక్కువే లబ్ధి పొందింది. కోల్డ్‌వార్ పేరుతో జరిగిన ప్రాంతీయ యుద్ధాలు 1990 దశకం నాటికి ప్రపంచం పరిస్థితిని మార్చివేశాయి. వార్సా సైనిక కూటమికి నాయకత్వం వహిస్తున్న సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 దేశాలుగా విడిపోయింది. వార్సా కూటమికి చెందిన మిగతా దేశాలలోని సోకాల్డ్ సోషలిస్టు ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి. చివరికి 1991లో వార్సా సైనిక కూటమి కూడా రద్దు అయింది. ఈ కాలంలోనే నాటో రద్దు గురించి కూడా చర్చ వచ్చింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై, వార్సా కూటమి రద్దు అయిన తరువాత కూడా నాటో సైనిక కూటమి అవసరం ఏమిటి అనే వాదనలు ముందుకు వచ్చాయి. కానీ అమెరికా, దాని నాటో మిత్రదేశాలు పిట్టకథలు చెబుతూ నాటోను రద్దు చేయకుండా కొనసాగించాయి. అంతే కాదు నాటోను రష్యా సరిహద్దుల వరకు విస్తరించాయి. ఇది నాటో, రష్యన్ ఫెడరేషన్‌లు కలిసి ఏర్పాటు చేసుకున్న, నాటో–రష్యన్ కౌన్సిల్ అవగాహనకు విరుద్ధం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన 30 సంవత్సరాల తరువాత నేడు ప్రపంచం చాలా మారింది. గ్లోబలైజేషన్ పేరుతో సాగిన వ్యాపార యుద్ధాల వలన ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయి. 1990లో సోవియట్ యూనియన్ సూపర్ పవర్ స్థానాన్ని కోల్పోతే అమెరికా 2025 నాటికి సూపర్ పవర్ స్థానాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. అందుకే ట్రంప్ పదేపదే తిరిగి అమెరికాను గొప్ప దేశంగా చేయాలని అంటున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా వెన్నుదన్నుతో కోలుకున్న పశ్చిమ యూరప్, జపాన్ లాంటి దేశాలు అమెరికా నీడలో ఉంటూనే అమెరికా లాభాలు ఆదాయాలకు గండి కొట్టడం మొదలుపెట్టాయి. 1990లలో దెబ్బతిన్న రష్యా కూడా 2000 నుండి క్రమంగా కోలుకొని అమెరికాకు పోటీ ఇవ్వడం మొదలు పెట్టింది. చైనా 1980 తరువాత అమెరికాతో మైత్రిని నెరపుతూనే చాపకింద నీరులా ప్రపంచ మార్కెట్‌ను కబ్జా చేసింది. అమెరికాకు పోటీగా దాని మార్కెట్లను, ప్రాబల్య ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నది. చైనా బ్రిక్స్‌ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్‌కే ఎసరు పెట్టింది. మూడు సంవత్సరాల నుండి సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో నాటో విజయం అసంభవంగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికాను ఆర్థికంగానూ రాజకీయంగానూ దెబ్బతీశాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా చేసిన యుద్ధాల వలన కూడా అమెరికా ఆర్థిక, రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నది. అధిపత్యం కోసం అమెరికా చేస్తున్న ఖర్చులకు తగినంత ఆదాయం వెనక్కు రాకపోవడమే కాదు, ఆ ఖర్చులే భారంగా పరిణమించాయి.
ఈ నేపథ్యంలోనే అమెరికా కొత్త ఎత్తుగడలు పాత ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలలో తన ఖర్చులను తగ్గించుకుంటున్నది. దేశంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నది. వలసదారులను రానివ్వడంలేదు. విదేశీ దిగుమతులపైన పన్నులు పెంచుతోంది. స్వేచ్ఛా మార్కెట్ ఛాంపియన్ అయిన అమెరికా రక్షణ సుంకాల వకాల్తాదారు అయ్యింది. చివరికి నాటో నుంచి కూడా బయటకు వెళ్తానని చెపుతున్నది. ప్రపంచంపైన చైనా ఆధిపత్యం పెరుగుతుండడం ఇప్పుడు అన్నింటికంటే అమెరికాకు ప్రధాన సమస్య. ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, ఇరాన్‌లు అమెరికాకు ప్రాధాన్యం లేని సమస్యలుగా మారిపోయాయి. పశ్చిమ యూరప్ దేశాలో ఇంకా వేరే దేశాలో అమెరికాకు మిత్రదేశాలు కాదు. చైనాతో పోరాడగలిగే, దానిని బలహీనపరచడానికి ఉపయోగపడే దేశాలే అమెరికాకు మిత్రదేశాలు. అందుకే అమెరికా రష్యాకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా కోరుకున్నట్లుగా రష్యా నడుస్తుందా, కష్టకాలంలో తనకు మద్దతుగా నిలబడిన చైనాను రష్యా మరిచిపోగలదా? అసలు సంక్షోభంలో ఉన్న అమెరికాపైన ఆధారపడాలని రష్యా అనుకుంటుందా? కొత్త మిత్రులు ఏమోగానీ ఉన్న మిత్రులను కూడా అమెరికా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఏమైతేనేమి రాబోయే కొద్దికాలంలోనే ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా దర్శనమివ్వవచ్చు.
లంకా పాపిరెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి
AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..
Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...
For More AP News and Telugu News