Gadar Impactful Songs: తూటాపై గెలిచిన పాట
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:37 AM
గద్దర్ ప్రస్థానం, పేదల హక్కుల కోసం పాటలు పాడిన ఒక విప్లవ singer గా తనను విశ్వసించిన జీవితం. 1997 ఏప్రిల్ 6న ఆయనపై జరిగిన కాల్పులు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటానికి ఒక ముఖ్యమైన సంఘటన

పాటను అంతం చేయాలని కుట్ర పన్నిన నియంతృత్వ పాలకులు గద్దర్‌పై 1997 ఏప్రిల్ 6న తూటా పేల్చారు. కోట్లాది ప్రజల జీవనాదమైన పాట మరింతగా దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది. తూటాను వెన్నులో దాచుకొని తెలుగు నేలలోనే కాదు, దేశమంతా తిరిగి జనం పాటై హోరెత్తింది. గద్దర్ ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమ సేనాని మాత్రమే కాదు. గొప్ప సామాజిక రాజకీయ కార్యకర్త. ప్రజలను సకల దోపిడీ పీడనల నుంచి విముక్తి దిశగా నడిపించిన యుద్ధనౌక! మనిషికి ఆలంబనమైన పాట మధ్యయుగాల్లో భూస్వామ్య ఫ్యూడల్ ప్రభువుల చేతుల్లో బందీయై ప్రజలకు దూరమైంది. కానీ ఆ తర్వాత కాలంలో పారిశ్రామిక విప్లవాల విజయంతో, ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల ఆవిర్భావంతో పాట కూడా ఫ్యూడల్ ప్రభువుల చెరవీడింది. జనం చెంతకు చేరింది. జన జీవితాలు ఇతివృత్తంగా పునరుజ్జీవం పొందింది. దేశ దేశాల్లో ఎంతోమంది కవి గాయకులు పుట్టుకొచ్చి ఆయా సమాజాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఈ కోవలో అగ్రగణ్యుడు విక్టర్ జారా. విక్టర్ లిడియో జారా మార్టినెజ్ చిలీ దేశంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చిలీ సమాజంలో ఎక్కడ చూసినా హింసా దౌర్జన్యాలు రాజ్యమేలుతున్న కాలంలో ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పాటగా గొంతెత్తాడు. ఉపాధ్యాయుడిగా, థియేటర్ దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా, ముఖ్యంగా సామాజిక ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టు విప్లవకారుడిగా చిలీ సమాజాన్ని పీడన నుంచి విముక్తి చేసే ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాడు.
తన కలంతో, గళంతో చిలీ సమాజాన్ని మేల్కొలిపాడు. సమసమాజం దిశగా సామాజిక విప్లవంలో కీలక భూమిక పోషించాడు. వామపక్షానికి చెందిన అలెండి ప్రభుత్వంలో సాంస్కృతిక సలహాదారుడిగా (1960–73) చిలీని ఉన్నతీకరించే బాధ్యత నిర్వర్తించాడు. ఆ పరిస్థితుల్లో కమ్యూనిజంపై కత్తిగట్టిన అమెరికా, మిలిటరీ అధికారి అగస్టో పినాచెట్‌తో చేయికలిపి కుట్ర పన్నింది. అలెండీ ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు చేయించింది. ఆ నేపథ్యంలోనే అలెండీని ఆ దేశ పార్లమెంటులోనే హత్య చేశారు. తర్వాత విక్టర్ జారాను 1973 సెప్టెంబర్ 16న శాంటియాగోలోని శాంటిటౌన్‌లో నడిరోడ్డుపై హత్య చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసిన పాటపై తూటా పేల్చి కసి తీర్చుకున్నాడు నియంత పినాచెట్. ఆ తర్వాతి కాలంలో ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా ప్రజా కళాకారులకు, ఆదర్శంగా నిలిచాడు విక్టర్ జారా. సరిగ్గా విక్టర్ జారా కన్నుమూసిన కాలంలోనే గద్దర్ రూపుదిద్దుకున్నాడు. 1949 జనవరి 31న మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో గుమ్మడి విఠల్ రావుగా జన్మించిన గద్దర్ 1973 నాటికి హైదరాబాద్‌లో ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో అడుగుపెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థి యువతను ఉర్రూతలూగించిన ఏంగ్రీ సిక్స్‌టీస్ కాలపు ప్రభావం, శ్రీకాకుళ నక్సల్బరీ వసంతకాల మేఘ ఘర్జనల మెరుపులు గద్దర్‌కు వెలుగుదారులు పరిచాయి.
నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటజ్వాలలు, సుబ్బారావు పాణిగ్రాహి జముకుల కథ సవ్వడులు, గుమ్మడి విఠల్‌రావును గద్దర్‌గా తీర్చిదిద్దాయి. ‘ఆపుర బండోడో బండెంటా నేనొస్తా’, ‘రక్తంతో నడుపుతాను రిక్షానూ, నా రక్తమె నా రిక్షకు పెట్రోలూ’ లాంటి పాటలతో మొదలైన గద్దర్ శకం, ‘ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందీ నేస్తమా రావా’ అంటూ దండకారణ్యం మీదుగా, ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, నా తెలంగాణమా’ దాకా తెలుగు సమాజాన్నే కాదు మొత్తం భారత సమాజాన్ని తన వెంట నడిపించాడు గద్దర్. సమకాలీన ఆధునిక ప్రపంచ చరిత్రలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలనూ చూరగొన్న ఏకైక ప్రజా గాయకుడు గద్దర్. నేటి సామాజిక పరిస్థితుల మధ్య గద్దర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రోజు రోజుకూ పెట్రేగుతున్న కులవివక్ష, కులహంకారదాడులు, ప్రజలపై ముఖ్యంగా ఆదివాసులపై జరుగుతున్న హింస సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. గద్దర్ ఉంటే ఈ పరిస్థితుల్లో ఎలా స్పందించేవాడు, ఏం చేసేవాడు అన్నవి అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ఆచరణకు పురికొల్పుతున్నాయి. నేటి సంక్షుభిత సమాజంలో గద్దర్ ప్రాసంగికత అడుగడుగునా తెలిసివస్తున్నది. l జి.వి. సూర్యకిరణ్ గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి (ఏప్రిల్ 6: గద్దర్‌పై తుపాకీ కాల్పులు జరిగిన రోజు. ‘పాటపై పాలకుల అణచివేత దినం’గా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సా. 6గంటలకు సభ)