Share News

Mamata Banerjee SC Verdict: అందరూ దోషులేనా

ABN , Publish Date - Apr 05 , 2025 | 05:19 AM

పశ్చిమబెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణం గురించి సుప్రీంకోర్టు చేసిన తీర్పు పై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పులు తీసుకోవడంపై ప్రజలలో వివిధ అభిప్రాయాలు వెల్లువెత్తాయి

Mamata Banerjee SC Verdict: అందరూ దోషులేనా

ఒక సిట్టింగ్‌ జడ్జి ఇంట్లో నోట్లకట్టలు దొరికితే, మీరు ఆయనను బదిలీ మాత్రమే చేశారు, మరి వీళ్ళను ఎందుకు చేయలేదు? అంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఉద్దేశించి వేసిన ప్రశ్నలో అణచిపెట్టుకోలేనంత ఆగ్రహం, అక్కసూ కనిపిస్తున్నాయి. పదేళ్ళుగా పశ్చిమబెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తున్న ఉపాధ్యాయుల నియామకప్రక్రియ అంతా కలుషితం, గందరగోళం, అవినీతిమయం అంటూ సుప్రీంకోర్టు గురువారం చేసిన నిర్ధారణ తృణమూల్‌ అధినేత్రికి పెద్ద ఎదురుదెబ్బ. సర్వోన్నత న్యాయస్థానం మీద గౌరవం ఉన్నదని అంటూనే, తీర్పు అనంతరం ఆమె తాను చేయదల్చుకున్న రాజకీయ వ్యాఖ్యలన్నీ చేశారు. పాతికవేలమంది కుటుంబాలను రోడ్డునపడేసిన పాపాన్ని బీజేపీ, సీపీఎం మీదకు నెట్టేశారు. గత ఏడాది కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ఆమెకు మరింత బాధ కలిగించే అంశం. ఆ హైకోర్టు తీర్పు వెనుక ప్రస్తుతం బీజేపీ ఎంపీగా మారిన అప్పటి న్యాయమూర్తి ఉన్నారని కదా ఆమె వాదన. ఏడాదిలో ఎంత మార్పు! పాతికవేలమందిని ఒక్కవేటున తొలగించడం, వారు ఎనిమిదేళ్ళుగా ఆర్జించిందంతా నెలరోజుల్లోనే వసూలుచేయడం ఇత్యాది కఠినమైన నిబంధనలతో గత ఏడాది కలకత్తా హైకోర్టు వెలువరించిన తీర్పు అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలువరించడంలో మానవీయ అంశాలతో పాటు అనేకం పనిచేశాయి. 2016నాటి ఈ రాష్ట్రస్థాయి పరీక్షలో అక్రమార్కులు ఎందరు, నీతిమంతులు ఎవరన్నది పట్టించుకోకుండా, బియ్యాన్నీ రాళ్ళనీ వేరుచేయకుండా, మొత్తం నియామకప్రక్రియనే తప్పుబట్టి, అందరూ దొంగలేనని నిర్ధారించడం అమానుషం కాదా? అని ప్రశ్నిస్తూ మమత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సార్వత్రక ఎన్నికలముందు వెలువడిన ఆ తీర్పువెనుక రాజకీయ కుట్ర ఉన్నదన్న వాదనను కూడా ఆమె ప్రజల్లోకి తీసుకుపోయారు. అభిజిత్‌ గంగోపాధ్యాయ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఈ కుంభకోణం మీద ఎంత శ్రద్ధచూపారో తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు వరుస ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళమీద దాడులు జరుగుతూ తృణమూల్‌ బాగా అప్రదిష్ఠపాలైంది.


ఏకంగా పద్నాలుగు కేసులను ఆయన సీబీఐకి అప్పగించి, ఎప్పటికప్పుడు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మమతాబెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లక్ష్యాలుగా విమర్శలు గుప్పించేవారు. ఒక దశలో సుప్రీంకోర్టు రంగప్రవేశం చేసి ఆయనను నిలువరించాల్సి వచ్చింది కూడా. రెండేళ్ళపాటు ఇలా అవినీతి వ్యతిరేకపోరాటం చేసిన ఈ సిట్టింగ్‌ జడ్జి సార్వత్రక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి లోక్‌సభకు పోటీచేయడంతో తృణమూల్‌కు ఆయుధం అందివచ్చింది. బీజేపీ మనిషి అంటూ ఎంతోకాలంగా తాము చెబుతున్నది నిజమైందని, ఈ కుంభకోణంలో ఆయన ఇచ్చిన ఆదేశాలన్నీ రద్దుచేయాలని తృణమూల్‌ అప్పట్లో డిమాండ్‌ చేసింది. అంతిమంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ ఉన్నదని దాని వాదన. విద్యామంత్రి పార్థాచటర్జీ సహా పలువురు నాయకులను జైలుకు పంపిన ఈ కుంభకోణంలో బీజేపీ, తృణమూల్ నాయకుల పరస్పర ఆరోపణలను అటుంచితే, కోల్‌కత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఆ మరుసటి నెలలోనే నిలిపివేయడం వెనుక ఈ కేసుతో లక్షన్నరమంది జీవితాలు ముడిపడివున్నాయన్న విచక్షణ కూడా ఉంది. సీబీఐ నివేదిక, స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నిర్ధారణలు, వివిధ దర్యాప్తులు, విచారణలు తేల్చిన లెక్కలను బట్టి మొత్తం నియామకాల్లో ఓ నాలుగున్నరవేల పోస్టులు మాత్రమే అక్రమంగా భర్తీ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఇప్పుడు అక్రమం, సక్రమం నిష్పత్తిని నిగ్గుతేల్చకుండా హైకోర్టు మాదిరిగానే యావత్‌ ప్రక్రియను ఒకేగాటన కడుతూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుచెప్పడం ఈ ఉద్యోగులకు అశనిపాతం. ఈ తీర్పు ప్రభుత్వ నియామక వ్యవస్థల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చు. కానీ, భార్యాబిడ్డలు, అమ్మానాన్నలను చూసుకుంటూ, అప్పునీ, అనారోగ్యాన్నీ మోసుకుంటూ, పదేళ్ళుగా ఉద్యోగంలో ఉంటూ మూడుపదులు దాటి పోయినవారిని ఇలా రోడ్డునపడవేస్తే మిగతా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తారని న్యాయస్థానం ఆలోచించివుంటే బాగుండేది. కొందరు చేసిన పాపానికి అందరూ ఇంతటి శిక్ష అనుభవించాల్సిందేనా, వందమంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక్క అమాయకుడు కూడా బలికాకూడదన్న సహజ న్యాయసూత్రం ఇక్కడ అమలవుతున్నదా? అన్నవి ప్రశ్నలు.

Updated Date - Apr 05 , 2025 | 05:21 AM