Share News

భట్టివి తప్పుడు లెక్కలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:58 AM

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గాల వారీగా జరిగిన రుణమాఫీ ఇదంటూ అసెంబ్లీలో చెప్పిన వివరాలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

భట్టివి తప్పుడు లెక్కలు

  • రుణమాఫీ లెక్కలు నిజమని నిరూపిస్తే రాజీనామాలు చేస్తాం

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల, పల్లా సవాల్‌

  • కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యే మధ్య లోపాయికారి ఒప్పందం: వివేకానంద

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గాల వారీగా జరిగిన రుణమాఫీ ఇదంటూ అసెంబ్లీలో చెప్పిన వివరాలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టివి తప్పుడు లెక్కలని ఆక్షేపించారు. రుణమాఫీ లెక్కలు నిజమని నిరూపిస్తే తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామని సవాల్‌ చేశారు. శాసనసభ, అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు వేముల, పల్లా శనివారం మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండు విడతల్లో రూ.29 వేల కోట్లు రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్‌ నాలుగు విడతల్లో రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిందని ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన రుణమాఫీ కంటే ఇప్పుడు ఎక్కువ రుణమాఫీ చేశామని ప్రభుత్వం నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు. ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై ముఖ్యమంత్రి ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్నా. గత. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఇంకా ఎందుకు ఏడుస్తున్నారని నిలదీశారు. కేసీఆర్‌ చావును కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డి జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షనేతను సంప్రదించకుండా పీఏసీ ఛైర్మన్‌ పదవిని పార్టీ మారిన ఎమ్మెల్యేకి ఎలా ఇస్తారని ప్రశాంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


ఇక, జనగామ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనైనా సరే వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే అక్కడికక్కడే ముక్కునేలకు రాసి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం మార్చేసిందని.. ఇప్పుడు కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను రాజముద్ర నుంచి తీసెయ్యాలని చూస్తుందని.. అలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహాలను మారుస్తామని, రాజముద్రను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బాకీలు రూ.8వేల కోట్లు ఉండగా, 15 నెలల్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని వివరించారు. జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్‌పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కల్పించుకొని.. ఆ వీడియోలను శాసనసభలో ప్రదర్శిద్దామని, సభ్యులు ఆ వీడియోను సమర్ధిస్తే కేసులు తొలగిద్దామని బదులిచ్చారు. ఇక, బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య లోపకాయిరి ఒప్పందం ఉందని కుతు్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గౌడ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న రేవంత్‌ రెడ్డి సభలో సీఎంగా కాకుండా పీసీసీ నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా, గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రులు భట్టి, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి మాట్లాడాకా... తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్‌ రావు కోరగా స్పీకర్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - Mar 16 , 2025 | 04:58 AM