Share News

అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:11 AM

గతం గుర్తుకు రాని మనిషీ ఉండడు, సమాజమూ ఉండదు. వర్తమానంలోని బాధలను గతంలోని కష్టాలతో పోల్చి చూసుకోవటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం రెండో ప్రపంచ యుద్ధంనాటి...

అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?

గతం గుర్తుకు రాని మనిషీ ఉండడు, సమాజమూ ఉండదు. వర్తమానంలోని బాధలను గతంలోని కష్టాలతో పోల్చి చూసుకోవటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం రెండో ప్రపంచ యుద్ధంనాటి బీభత్సాన్నీ విధ్వంసాన్నీ ఎంతో కొంత తెలుసుకునేలా ప్రేరేపిస్తుంది. ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛనూ, అసమ్మతినీ అణచివేస్తున్న ప్రతి సందర్భంలోనూ బాధితులు గతంలో తమలాంటి వారినీ అప్పటి ప్రభుత్వాల దాష్టీకాలనూ గుర్తుకు తెచ్చుకోకమానరు. అందుకోసం చరిత్రను తవ్వకుండా ఉండనూ లేరు. అసమ్మతిని సహించలేని ధోరణి హద్దులు దాటినప్పుడు బాధితులతో పాటు ఆలోచనాపరులు కూడా గతంలోని దారుణాలపై దృష్టి సారించకుండా ఉండలేరు. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలాంటి అవసరాన్ని కలిగిస్తున్నాయనే చెప్పుకోవాలి. విద్యాసంస్థలను రాడికల్‌ వామపక్షవాదుల ప్రభావం నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా కటువుగా, మొరటుగా చెప్పారు. ‘మార్క్సిస్ట్స్‌, మేనియాక్స్‌, లూనటిక్స్‌’లు విద్యా సంస్థలను శాసిస్తున్నారనీ విమర్శించారు. దీన్ని చూస్తూ ఊరుకుంటున్న ఉన్నతాధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తాననీ ప్రకటించారు.


చెప్పినట్లుగానే ఫెడరల్‌ విద్యాశాఖను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులనూ జారీచేశారు. విద్యాసంస్థలకే పరిమితం కాకుండా ఇతర అంశాలపై తాను వరుసగా జారీచేస్తున్న ఉత్తర్వులను నిలిపివేస్తున్న న్యాయమూర్తులను కూడా ‘రాడికల్‌ లెఫ్ట్‌ లూనటిక్స్‌’గానే విమర్శిస్తున్నారు. తన ఉత్తర్వులను కోర్టుల్లో సవాల్‌ చేస్తున్న న్యాయవాదులనూ, న్యాయవాద సంస్థలనూ కట్టడిచేయటానికి చర్యలు తీసుకోవాలనీ అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలకు ఫెడరల్‌ నిధులు వెళ్లకుండా నొక్కిపట్టి వాటిని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 400 మిలియన్‌ డాలర్ల నిధులను ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి పొందటానికి ట్రంప్‌ ప్రభుత్వానికి నచ్చే విధంగా విధానాలను మార్చుకునేందుకు కొలంబియా విశ్వవిద్యాలయం అంగీకరించింది. ఎంతో చరిత్ర ఉండి, మహామహులను అందించిన విశ్వవిద్యాలయానికే ఈ పరిస్థితి వచ్చిందంటే మిగతా వాటి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలు చేయటం, ప్రదర్శనలు నిర్వహించటం గడిచిన రెండేళ్లుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో బాగా జరిగింది. దీన్ని హమాస్‌ సంస్థకు మద్దతు పలకటంగా భావించి ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల వీసాలను రద్దుచేసి స్వదేశాలకు పంపటమూ మొదలైంది. కొలంబియా యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రంజనీ శ్రీనివాసన్‌ అలాగే భారత్‌కు రావాల్సి వచ్చింది. జార్జిటౌన్‌ యూనివర్సిటీకి చెందిన పోస్ట్‌ డాక్టరల్‌ విద్యార్థి బాదర్‌ ఖాన్‌ సూరిని కూడా అలాంటి ఆరోపణలతోనే దేశం నుంచి పంపించి వేయటానికి రంగం సిద్ధమైంది. ఇక అనేక ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులపై నిఘాలు పెరుగుతున్నాయి.


విద్యార్థుల సామాజిక ఖాతాలను తనిఖీ చేయటమూ మొదలైంది. అలా తనిఖీ చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకురావటానికి ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలూ వస్తున్నాయి. సామాజిక సమస్యలపై స్పందించే వారందరూ ఏదో విధమైన సిద్ధాంతాలను విశ్వసించేవారే అయివుంటారు. వారందరినీ లెఫ్ట్‌ లూనటిక్స్‌గా భావిస్తే విశ్వవిద్యాలయాల్లో అల్లకల్లోలం తలెత్తుంది. భావ వైవిధ్యాన్ని ప్రదర్శించలేని స్థాయికి విశ్వవిద్యాలయాలు దిగజారిపోతే సామాజిక జ్ఞానమే స్తంభించిపోతుంది. అమెరికా విశ్వవిద్యాలయాలకు ఉన్న బలమే భావ వైవిధ్యత. అందుకే అక్కడ జరిగే పరిశోధనలకు అంత గుర్తింపు ఉంటుంది. భారతీయ భాషలు, కులాలు, మతాలు, నగరాలు, ప్రాంతీయ సంస్కృతులు, స్థానిక రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులపై అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఎన్నో లోతైన పరిశోధనలు జరిగాయి. వాటిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ వాటిని పక్కనపెడితే ఏర్పడే జ్ఞానశూన్యత చాలా అసాధారణంగా ఉంటుంది. అందుకే అక్కడ భావప్రకటనలపై కట్టడులు పెడితే జరిగే నష్టం భారత్‌తో పాటు చాలా దేశాలపై ఉంటుంది. రిపబ్లికన్‌ పార్టీకి ఆధునిక భావాలు అంతగా పట్టవు. మతభావాలపై మక్కువ ఎక్కువ. క్రైస్తవ వాదుల ప్రభావం అధికం. అబార్షన్లను వ్యతిరేకిస్తుంది. ట్రాన్స్‌జెండర్లకు సమానత్వాన్ని నిరాకరిస్తుంది. పర్యావరణ విధ్వంసం నిజం కాదంటుంది. సమానత్వ భావనను చులకన చేస్తుంది.


ఇంత చరిత్ర ఉండబట్టే వామపక్ష భావాల పొడ ఏ మాత్రం గిట్టదు. వాటి పట్ల శత్రుత్వధోరణితో వ్యవహరించటం కొత్తకాదు. ఆ ధోరణి అమెరికన్‌ చరిత్రలో భయానక పరిణామాలకు కారణమైంది. 1940, 50ల్లో ఆ పార్టీకి చెందిన సెనటర్‌ జోసెఫ్‌ రేమండ్‌ మకార్తీ.. వేలమంది ప్రజలను కమ్యూనిస్టులనే ముద్రవేసి వేధించారు. ప్రభుత్వ వ్యవహారాల సెనెట్‌ కమిటీకి, దర్యాప్తు ఉపసంఘానికీ అధ్యక్షత వహించి విచారణల పేరుతో భయాన్ని, బీభత్సాన్ని సృష్టించారు. హాలివుడ్‌ దర్శకులు, నటుల నుంచి మొదలుకుని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కార్మికులు, సైనిక అధికారులు, ఉన్నతోద్యోగులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహిత్యవేత్తలు మకార్తీ ఆరోపణలనూ, విచారణలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. మకార్తీ చర్యలను విశ్లేషిస్తూ ఎన్నో రచనలు వచ్చాయి. అమెరికా చరిత్రను వాస్తవిక దృక్పథంతో రాసే వారెవరూ మకార్తీయిజాన్ని విస్మరించలేకపోయారు. మకార్తీ రెండుసార్లే (1946, 1952) సెనట్‌కు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖలోకి 57 మంది కమ్యూనిస్టులు చొరబడ్డారని 1950లో ప్రకటించి సంచలనం సృష్టించారు. ‘మన ప్రభుత్వంలో కమ్యూనిస్టుల గురించి చర్చించుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనదగ్గరున్న కొత్త ఆయుధానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను దొంగిలించటానికి డబ్బుని తీసుకునే గూఢచారులతో మాత్రమే మనం వ్యవహరించటం లేదు. మన విధానాన్ని తీర్చిదిద్దటానికీ మార్గదర్శనం చేయటానికీ ఉద్దేశించిన దుర్మార్గపు కార్యకలాపాలతో మనం వ్యవహరిస్తున్నాం’ అని ప్రకటించారు. ప్రభుత్వంలో చొరబడిన కమ్యూనిస్టులు అమెరికా విధానాలను ప్రభావితం చేసే స్థాయికి చేరారన్నదే ఆ ప్రకటన అంతరార్థం. అంతటితో ఆగలేదు. అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారని ఆరోపించారు. ఇతర విభాగాల్లోనూ కమ్యూనిస్టులు తిష్టవేశారని విమర్శించారు. రెండోసారి సెనటర్‌గా ఎన్నికైన తర్వాత ఆరోపణలను మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల సెనట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికకావటంతో విపరీత అధికారాలు వచ్చిపడ్డాయి. దానికితోడు శాశ్వతంగా ఉండే సెనట్‌ దర్యాప్తు కమిటీ నేతృత్వమూ దక్కింది. ఏళ్లపాటు మకార్తీ మాటకీ చేతకీ అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వామపక్షవాదులుగా ముద్రలువేసిన వారిపై 36 రోజులపాటు జరిపిన విచారణ టెలివిజన్‌లో ప్రసారం చేయటం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. న్యూజెర్సీలోని ‘ఆర్మీ సిగ్నల్‌ కాప్స్‌ ఇంజనీరింగ్‌ లేబరటరీస్‌’ గూఢచర్యం ఆరోపణలపై జరిపిన విచారణ కూడా టెలివిజన్‌లో ప్రసారమైంది. ఉద్యోగుల విధేయతను పరిశీలించటానికి అప్పట్లో ‘లాయల్టీ సెక్యూరిటీ స్ర్కీనింగ్‌ బోర్డు’ అనేది ఒకటి ఉండేది. ఆ బోర్డు వేసిన ప్రశ్నలకు జవాబుచెప్పటానికి నిరాకరించిన ఒక డెంటిస్ట్‌ను సైనిక విభాగం నియమించిదంటూ మకార్తీ ఆరోపణ చేశారు. దీంతో ఆగకుండా ఆర్మీ న్యాయవాదిగా వ్యవహరించే జోసెఫ్‌ వెల్చ్‌ కమ్యూనిస్టు ప్రజాసంఘం సభ్యుడైన వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్నారని ఆరోపించారు.


అప్పటికే ఎన్నో ఆరోపణలను చేసి ఒకటిరెండు తప్ప వేటినీ నిరూపించలేని పరిస్థితి ఏర్పడింది. టెలివిజన్‌ ప్రసారాలతో క్రమేపీ ప్రచార ఆర్భాటమూ, ఆరోపణల డొల్లతనం కనపడడమూ మొదలైంది. ‘మీకు సభ్యత అంటూ లేదా సర్‌? దాన్ని పూర్తిగా వదిలేశారా?’ అంటూ వెల్చ్‌ ఎదురుదాడి చేయటంతో ప్రజలకు కూడా మకార్తీపై విముఖత మొదలైంది. జర్నలిస్టు ఎడ్వర్డ్‌ ఆర్‌.మరో తన ‘సీ ఇట్‌ నౌ’ కార్యక్రమంలో మకార్తీ వైపరీత్యాన్ని చీల్చిచెండాడారు. దారుణాలన్నీ జరిగిపోయిన తర్వాత, జీవితాలన్నీ నాశనమయ్యాక సెనట్‌ కూడా మకార్తీని తప్పుపట్టి అభిశంసించింది. ‘మెనీ ఆర్‌ ద క్రైమ్‌’ పేరుతో ఎలన్‌ ష్రెకర్‌ ప్రచురించిన పుస్తకంలో మకార్తీయిజం గురించి చాలా విషయాలను ప్రస్తావించారు. మకార్తీయిజం చెలరేగిన కాలంలో రాజకీయ అణచివేత అమెరికన్‌ చరిత్రలోనే అసాధారణమైందనీ అంతకాలంపాటు అలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదనీ పేర్కొన్నారు. మకార్తీయిజాన్ని ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా చర్యల ప్రాతిపదికగా చూస్తే 1940, 50ల కాలమంతా ఆ ఇజం రాజ్యమేలిందని చెప్పుకోవచ్చనీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను నడిపే పెద్దమనుషులు తెలివిడితోనే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనీ కమ్యూనిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడే పేరుతో దాన్నొక తప్పుగానూ భావించలేదనీ చెప్పారు. విచారణను ఎదుర్కొన్న వారందరూ రాజకీయ అభిప్రాయాలు లేనివారుగానో వామపక్షంతో పూర్తిగా సంబంధంలేనివారుగానో చెప్పలేమనీ ఎలన్‌ ష్రెకర్‌ అన్నారు. అయినా దారుణాలను తక్కువ చేయలేమనీ చెప్పారు. మకార్తీయిజం విజృంభణ కాలంలో జులియస్‌ రోజన్‌బర్గ్‌, ఎథల్‌ రోజన్‌బర్గ్‌ దంపతులకు మరణశిక్షను విధించారు. వందల మందిని జైల్లో పెట్టారు. దేశ బహిష్కారమూ చేశారు. 10 నుంచి 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. రష్యా, జర్మనీల్లో జరిగిన దారుణాలతో పోల్చితే ఈ దురాగతాలు తక్కువైనప్పటికీ అవి సృష్టించిన భయానక వాతావరణంతో అమెరికాలో పదేళ్లపాటు అసమ్మతి ఆవిరైపోయిందనీ ఎలన్‌ ష్రెకర్‌ వ్యాఖ్యానించారు. 1940, 50ల్లో లాగా కమ్యూనిజం ఇప్పుడు కదం తొక్కటంలేదు. ఆ సిద్ధాంతం ఆధారంగా నడిచే పార్టీల బలం అంతంత మాత్రంగానే ఉంది. అయినా అమెరికాలో ‘రాడికల్‌ లెఫ్ట్‌ లూనటిక్స్‌’ అంటూ ఆ సిద్ధాంత ఛాయలు స్పష్టంగా లేని వారిని సైతం లక్ష్యంగా చేసుకోవటం విచిత్రంగానే అనిపిస్తుంది. ట్రంప్‌కూ ఎలాన్‌ మస్క్‌కూ లెఫ్టిజంలో ప్రమాదం కనపడుతున్నదంటే రాజకీయ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌ ఫుకుయామా 1992లో ఘనంగా ప్రకటించినట్లుగా చరిత్ర అంతం కాలేదని భావించాలి! ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా సోషలిస్టు రాజ్యాలు కుప్పకూలిపోవటాన్నీ వామపక్ష భావాల ప్రభావం క్షీణించటాన్నీ చరిత్ర అంతంగా ఫుకుయామా వ్యాఖ్యానించారు. అమెరికా పరిణామాలను చూస్తుంటే ఇంకా అది చల్లారని చరిత్రలాగే ఉంది!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి:

తృటిలో తప్పిన ప్రమాదం

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Updated Date - Mar 28 , 2025 | 02:11 AM