ఎర్డొగాన్ దుష్టచేష్టలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:59 AM
తుర్కియేలో నానాటికీ పెరుగుతున్న ఆందోళనలు, నిరసనలను గమనించినప్పుడు, అవి కేవలం ఒక రాజకీయపార్టీ ప్రోద్బలంతో జరుగుతున్నవి కావన్నది సుస్పష్టం. రెండుదశాబ్దాలకు పైగా ప్రధానిగానో, అధ్యక్షుడుగానో దేశాన్ని...

తుర్కియేలో నానాటికీ పెరుగుతున్న ఆందోళనలు, నిరసనలను గమనించినప్పుడు, అవి కేవలం ఒక రాజకీయపార్టీ ప్రోద్బలంతో జరుగుతున్నవి కావన్నది సుస్పష్టం. రెండుదశాబ్దాలకు పైగా ప్రధానిగానో, అధ్యక్షుడుగానో దేశాన్ని ఏలుతున్న ఎర్డొగాన్ పదవీవ్యామోహం తుర్కియేను రాజకీయంగా, ఆర్థికంగా కుదిపేస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పి)లో ప్రముఖ నాయకుడు, ఇస్తాంబుల్ నగర మేయర్ అయిన ఇక్రెమ్ ఇమమోలును ఈనెల19న అవినీతి, ఉగ్రవాదులకు సహాయం ఇత్యాది ఆరోపణలమీద అరెస్టుచేసి జైల్లోకి తోయడంపై దేశం భగ్గుమన్నది. ఎర్డొగాన్ పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిపడిన ప్రమాదమేమీలేదు. కానీ, మరో మూడేళ్ళలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ నిలిచి గెలిచేందుకు ఆయన ఇప్పటినుంచే పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నాడు. మంచి ఆదర్శాలు, చక్కని నడవడిక, ప్రజాస్వామిక విలువలు ఉన్న ఇమమోలును కేవలం ఒక రాజకీయ నాయకుడిగా చూడలేమని, మతాచార్యుడి కుమారుడు అని అర్థాన్నిచ్చే ఆ పేరులోనే తుర్కియే సాంస్కృతిక మూలాలున్నాయని మీడియా విశ్లేషిస్తున్నది.
ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ, బలమైన రాజకీయ శత్రువును పక్కకు తప్పించే క్రమంలోనే ఈ అరెస్టు జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. విపక్ష పార్టీ నుంచి అధ్యక్షపదవి అభ్యర్థిగా ఇమమోలు అధికారికంగా రేపోమాపో నామినేట్ కాబోతున్న తరుణంలో ఈ అరెస్టు జరిగింది. ఇమమోలు మీద కేసులు పెట్టడం, న్యాయస్థానం అరెస్టుకు ఆదేశాలు జారీచేయడం, పోలీసులు అరెస్టుచేసి జైల్లోకి నెట్టడం వేగంగా జరిగిపోయాయి. ఇస్తాంబుల్ మేయర్ పదవిని కూడా ప్రభుత్వం తొలగించింది. ఈ విధంగా విపక్షపార్టీకి చెందిన ఐదుగురు ఇటీవలికాలంలో మేయర్ పదవులు కోల్పోయారట. అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ నామినేషన్‌ను నిలువరించడమే లక్ష్యంగా ఈ అరెస్టు జరిగింది కనుక సీహెచ్‌పీ ఈ ప్రాథమికదశ ఎన్నికను పార్టీ సభ్యులకు పరిమితం చేయకుండా, ప్రజాభాగస్వామ్యాన్ని కూడా కోరింది. దీనితో ఏకంగా కోటిన్నరమంది ఈ ప్రక్రియలో పాల్గొని ఇమమోలును తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేశారని ఆ పార్టీ ఉత్సాహంగా చెబుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడం, నిరసనలు పలు రూపాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం చూసినప్పుడు ఇదంతా ఇమమోలు మీద ప్రేమకంటే, ఎర్డొగాన్‌మీద ద్వేషంగా కనిపిస్తున్నది. నిరసనల్లో ముందువరుసలో ఉన్నది యువకులు, విద్యార్థులు కావడం విశేషం. వారు పుట్టిబుద్ధెరిగినప్పటినుంచీ అధికారంలో ఎర్డొగాన్‌నే చూస్తున్నారు. 2003లో ప్రధాని అయినప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన తన పాలనలో ప్రజాస్వామిక విలువలకు కట్టుబడింది లేదు. అసమ్మతిని, ప్రశ్నను సహించకపోవడం, ప్రతిపక్షాన్ని బతకనివ్వకపోవడం ఒక విధానంగా అమలు చేశాడాయన. ఇమమోలు అరెస్టు ద్వారా ఇప్పుడు ఎర్డొగాన్ సంపూర్ణ నియంతగా ప్రజలకు అర్థమవుతున్నాడు. ఆయన తన ఏకేపీ పార్టీలో ఎవరూ పైకి ఎదగకుండా ముందే జాగ్రత్తపడ్డాడు. కానీ, తిరిగి అధ్యక్షుడుగా నిలబడేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు ఒప్పుకోవు కనుక, వాటిని మార్చేందుకు సిద్ధపడుతున్నాడు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు జరపకుండా, వాటిని ముందే నిర్వహించేందుకు ప్రాతిపదికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకొనే అవకాశం, అధికారం ఆయనకు ఉంటాయి. రాజ్యాంగసవరణ ద్వారా తిరిగి నిలబడేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు లేదా ముందస్తు ఎన్నికలకు పోవచ్చు. ఆయన ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ, అధికశాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పటికే రుజువైంది. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష సీహెచ్‌పి తన దేశవ్యాప్త బలాన్ని రుజువుచేసుకుంది. ఐదేళ్లక్రితం ఇస్తాంబుల్ మేయర్‌గా గెలిచిన ఇమమోలు కారణంగానే గత ఐదుదశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా సీహెచ్‌పీ బలపడింది. బలమైన రాజకీయ ప్రత్యర్థి ఇమమోలు మీద అక్రమ కేసులు బనాయించడం, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మార్చడం కోసం యూనివర్సిటీ పట్టాను రద్దుచేయించడం వంటి ఎర్డొగాన్ దుష్టచేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేయగల శక్తి ఆయనకు ఉండివుండవచ్చు. కానీ, ఇంతటి ప్రజావ్యతిరేకతను గమనించిన తరువాతైనా ఆయన కాలువెనక్కుతీసుకోవడం అవసరం. కశ్మీరీల హక్కుల గురించి అంతర్జాతీయ వేదికలమీద గుండెలుబాదుకొనే ఈ నాయకుడు ముందు తన ప్రజల మనోభిప్రాయాలకు గౌరవించడం నేర్చుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..
Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా