Share News

విద్వేషాలు, అసహనాలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:49 AM

మైనారిటీలకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలమీద బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్న ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక తెలివైన సమాధానం చెప్పింది. పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు...

విద్వేషాలు, అసహనాలు

మైనారిటీలకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలమీద బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్న ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక తెలివైన సమాధానం చెప్పింది. పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాలు, వాటి ప్రభావంతో రేగిన కల్లోలాలు, ఘర్షణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటిని నిలువరించడానికి ఒక విధానాన్ని తెచ్చే ఆలోచన కేంద్రానికి ఏమైనా ఉన్నదా అని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్‌రిజిజు సమాధానం చెబుతూ, పోలీసులు, శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలో అంశాలు కనుక తమవద్ద సంబంధిత సమాచారం ఉండదన్నారు. సమాజ్‌వాదీపార్టీ ఎంపీ ప్రశ్న వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చును కానీ, సందర్భం లేకపోలేదు. నెలక్రితం ఇండియా హేట్‌ ల్యాబ్‌ ప్రచురించిన నివేదిక, గత ఏడాది దేశంలో వెయ్యికి పైగా విద్వేషప్రసంగాలు జరిగాయని, 2023తో పోల్చితే 74శాతం హెచ్చాయని ఒక విశ్లేషణ చేసింది. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో అత్యధికం బీజేపీవారివేనన్నది సారాంశం.

ఎన్నికల ప్రచారంలో, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి నాయకులు ఓట్లు రాబట్టుకున్న విషయాన్ని ఈ రిపోర్టు విశ్లేషించింది. రాజస్థాన్‌లోని బన్‌స్వరాలో ప్రధాని స్వయంగా ‘చొరబాటుదారులు’ అని చేసిన వ్యాఖ్యను కూడా ఇది ప్రస్తావించింది. ఈ తరహా ప్రసంగాలకు సంబంధించి మా దగ్గర ఏ లెక్కలూ లేవు, మార్చే విధానమూ లేదు అని కేంద్రం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించదు కానీ, విద్వేష వ్యాఖ్యలతో మత రాజకీయాలు చేస్తున్న ఈ నాయకులు, వేరొకరు తమ‍ మీద ఒక చిన్న జోక్‌ వేసినా సహించలేకపోతూండటం విచిత్రం.


రాజకీయ నాయకులు పరస్పరం ఎంత తీవ్రంగానైనా విమర్శించుకోవచ్చును, ఎక్కడలేని బురదా చెత్తా తెచ్చి పోసుకోవచ్చు, అందులో భాగంగా అసభ్యకరపదజాలమూ వాడవచ్చు. ఆ దుర్భాషలన్నీ సమాజం సహించాల్సిందే తప్ప, తమను మాత్రం ఎవరూ పల్లెత్తు విమర్శచేయకూడదు, అసమ్మతి ప్రదర్శించకూడదు, హాస్యానికి కూడా అనకూడదు. కునాల్‌ కమ్రా అనే ఒక స్టాండప్‌ కమేడియన్‌ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిందేను దృష్టిలో పెట్టుకొని ఒక పారడీపాటలో కుట్రదారుగా అభివర్ణించినందుకు శిందే అభిమానులకు ఆగ్రహం కలిగింది. వారు సృష్టించిన విధ్వంసం, చేసిన అవమానకర వ్యాఖ్యలు దేశం యావత్తూ చూసింది. ముంబైలో దశాబ్దాల క్రితం ఆవిర్భవించి, పేరుప్రఖ్యాతులున్న హాబిటేట్‌ స్టూడియో నాశనం అయింది. ఇదే సందర్భంలో ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఈ స్టూడియో పలు అతిక్రమణలు, ఉల్లంఘనలు పాల్పడినట్టు గుర్తొచ్చి కూల్చివేతలు జరిపింది. కమ్రాకు షూట్‌ చేసుకొనే అవకాశమిచ్చినందుకు ఆ స్టూడియో తీవ్రంగా నష్టపోయి మూతబడింది. కమేడియన్లతో పాటు, వారికి అండగా ఉన్న, ఆశ్రయం ఇస్తున్న వ్యక్తులూ సంస్థలూ కూడా తమ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఈ ఉదంతం అర్థం.


ఇదంతా శిందే అభిమానులకు అప్పటికప్పుడు పుట్టిన ఆగ్రహమని మొదట్లో అంతా భ్రమపడ్డారు. కానీ, ఇప్పుడు శిందే చేస్తున్న వ్యాఖ్యలను బట్టి, ఆయన ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కూడా అనుకోవచ్చు. కమ్రాని వెంటాడి వేటాడి దేశంనుంచి తరిమివేసే వరకూ నిద్రపోబోమని మహాయుతి నాయకులు అంటున్నారు. విమర్శనీ, అసమ్మతినీ సహించలేనితనం ప్రమాదకరం. పోలీసులు కేసులు పెట్టినా, సారీ చెప్పమని ముఖ్యమంత్రి నిలదీస్తున్నా, కమ్రా గట్టిగానే నిలబడ్డాడు. ఉద్ధవ్‌ సేన సహజంగానే ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటోంది, కమ్రా పక్షాన నిలబడింది. కమ్రా కామెడీ వెనుక ఏవో కుట్రలున్నాయని, కాసులు ఎక్కడనుంచి వస్తున్నాయో తేలుస్తానని అధికారపక్షం అంటోంది. ఇక, శిందే విషయంలో ద్రోహి, వెన్నుపోటుదారుడు, తిన్నింటివాసాలు లెక్కబెట్టడం ఇత్యాది మాటలు అనేకం దేశం నిన్నమొన్నటివరకూ శివసేన చీలికవర్గాలనుంచే విన్నది. విపక్షపాలిత రాష్ట్రాల్లో ఏక్‌నాథ్‌శిందేలను సృష్టిస్తామని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించిన సందర్భాలూ ఉన్నాయి. కమ్రా హద్దులు దాటాడా లేదా అన్నది అటుంచితే, ఈ దాడితో శిందేమీద ఆయన చేసిన వెటకారపు వ్యాఖ్యలకు మరింత ప్రచారం వచ్చింది. ససేమిరా సారీ చెప్పనంటూ ఆయన ఇంకొంతమంది నాయకులమీద వ్యంగ్యాస్త్రాలు సంధించే అవకాశమూ దక్కింది. ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందన్నది అటుంచితే, ప్రజాస్వామ్యం, భావవ్యక్తీకరణస్వేచ్ఛ, రాజ్యాంగం, హక్కులు ఇత్యాదివి కాస్తంత గుర్తెరిగి, నాయకులు కాస్తంత బాధ్యతగా వ్యవహరించడం అవసరం.

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:49 AM