Share News

ఎన్‌జేఏసీ పునరుద్ధరణ డిమాండ్ సరైనదేనా?

ABN , Publish Date - Apr 03 , 2025 | 05:07 AM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల సంచులు బయటపడడంతో న్యాయవ్యవస్థ భ్రష్టుపట్టిపోతున్నదనే ఆందోళన అంతటా వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన...

ఎన్‌జేఏసీ పునరుద్ధరణ డిమాండ్ సరైనదేనా?

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల సంచులు బయటపడడంతో న్యాయవ్యవస్థ భ్రష్టుపట్టిపోతున్నదనే ఆందోళన అంతటా వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ పరిణామాన్ని ఆసరా చేసుకుని ఉన్నత న్యాయమూర్తుల నియామకాలపై పార్లమెంటు నెలకొల్పిన ఎన్‌జేఏసీ జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను 2015లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయకుండా ఉంటే బాగుండేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు. ఈయన, అప్పటి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కలిసి కొలీజియం పైన, న్యాయమూర్తుల నియామకాల్లో సుప్రీంకోర్టు పెత్తనం మీద తరచూ విరుచుకుపడుతూ ఉండేవారు. అందులో గౌరవహీన పదజాలాన్ని కూడా ఉపయోగించేవారు. కొందరు రిటైర్డ్ జడ్జీలు ఇండియా వ్యతిరేక గ్యాంగ్‌గా కూడి భారత న్యాయవ్యవస్థ ప్రతిపక్షంగా వ్యవహరించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా రిజిజు అన్నారు. కేంద్రన్యాయ శాఖ మంత్రి ఒకరు న్యాయవ్యవస్థ మీదకు ఇంతటి సూది మొన రాయిని విసరడం ఎప్పుడూ చూడలేదు. న్యాయవ్యవస్థపై రిజిజు ప్రేలాపనలు జుగుప్సాకరంగా ఉండడంతో ఆయనను ఆ శాఖ నుంచి తప్పించారు. జగదీప్ ధన్‌ఖడ్ అయితే వీలైనప్పుడల్లా న్యాయవ్యవస్థ కంటే పార్లమెంటు ఉన్నతమైనదని అంటూ, పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఎన్‌జేఏసీని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడాన్ని ఇప్పటికీ తప్పుపడుతున్నారు.


ఎన్‌జేఏసీ బిల్లుకు 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందింది. రాజ్యాంగంలో 124ఎ(3) అనే కొత్త సెక్షన్ చేర్చడం ద్వారా ఈ బిల్లును పార్లమెంటు చట్టంగా చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా ఉండే ఆరుగురు సభ్యుల కమిటీని ఉన్నత న్యాయమూర్తుల నియామకం కోసం ఈ చట్టం అవతరించింది. అయితే ఇద్దరు బయటి ప్రముఖులను కూడా ఈ కమిటీలో చేర్చడం వివాదాస్పదమయింది. న్యాయమూర్తుల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్రను నామమాత్రం చేస్తున్నదనే కారణంపై ఎన్‌జేఏసీ చట్టాన్ని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు ధర్మాసనం 4:1 మెజారిటీ తీర్పుతో 2015 అక్టోబర్ 6న రద్దు చేసింది.

రాష్ట్రపతి సీజేఐని సంప్రదించి ఉన్నత న్యాయమూర్తులను నియమించాలని రాజ్యాంగ అధికరణ 124(2) స్పష్టం చేస్తున్నది. ఎన్‌జేఏసీలో ఇందుకు బొత్తిగా సందు లేకుండా చేశారు. సీజేఐని సంప్రదించడమంటే కేవలం వారికి తెలియజేయడం కాదని, వారి సమ్మతిని తీసుకోవడం కిందికి వస్తుందనే నిర్వచనం వెల్లడయింది. జస్టిస్ వర్మ ఇంటిలో నోట్ల కట్టల ఉదంతాన్ని సాకుగా చేసుకొని వెనువెంటనే ఉపరాష్ట్రపతి ఎన్‌జేఏసీ ప్రస్తావన తేవడం సమంజసంగా లేదు. నోట్ల కట్టల ఘటనపై రాజ్యసభలోని వివిధ పార్టీల సభా నేతలతో సమావేశానికి ముందే ధన్‌ఖడ్ ఎన్‌జేఏసీ ప్రస్తావన చేయడం ఆయన బీజేపీ పక్షపాతాన్నే చాటింది. అరుదుగా ఏ స్థాయిలోని వ్యక్తి అయినా అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడే అవకాశం లేకపోలేదు. దేశంలో ఇటువంటివి మామూలు అయిపోలేదు గాని ప్రముఖులను అప్రతిష్ఠపాలు చేసిన ఘటనలు జరగకపోలేదు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1971 మే లో ఆమె, ఆమె సెక్రటరీ పి.ఎన్. హక్సర్ స్వయంగా ఫోన్లో ఆదేశించారనుకుని ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ స్టేట్ బ్యాంకు చీఫ్ క్యాషియర్ వి.పి. మల్హోత్రా బ్యాంకు నగదు నుంచి 60 లక్షల రూపాయల కట్టలు తీసి రుస్తుం సోహ్రబ్ నగర్వాలా అనే ఆయనకు ఇచ్చాడు. ఆ మొత్తానికి చెక్కు కోసం ప్రధాని ఇంటికి వెళ్లి ఆయన భంగపడడం, పోలీసులు దర్యాప్తు చేసి నగర్వాలా నుంచి 6 వేల రూపాయలు మినహా మిగతా బ్యాంకు సొమ్మును వసూలు చేయడం సంచలనం సృష్టించింది,


ప్రధాని మోదీ స్వయంగా ఆదానీ వాణిజ్య ప్రయోజనాలకు తోడ్పడుతూ ఆయనకు ఉక్కు కవచంలా ఉపయోగపడుతున్నారనే విమర్శ తెలిసిందే. దీనిలోని నిజానిజాలను ఆయన పార్లమెంటుకు తెలియజేయాలన్న డిమాండు నిష్ఫలం అయిపోయిన సంగతీ ఎరుకే. కింది స్థాయి న్యాయ వ్యవస్థలో ఒకటీ అరా అప్రతిష్ఠాకర ఘటనలు చోటుచేసున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బెయిల్ మంజూరుకు లంచం తీసుకుని నగుబాటై ఆత్మహత్యకు పాల్పడిన మేజిస్ట్రేట్ ఉదంతం జ్ఞాపకాల తెర మీదినుంచి ఇంకా తొలగిపోలేదు. అతిజుగుప్సాకరమైన గుజరాత్ మారణహోమ దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వమే ముందస్తుగా విడుదల చేయడం, వారికి బయట బ్రహ్మాండమైన స్వాగతం లభించడం తెలిసిందే.

వ్యక్తులు సమష్టి మేలు కోసం ఏర్పరచుకున్నవే వ్యవస్థలు. అందులోని మెజారిటీ సభ్యులు గాని, వాటి నిష్పాక్షికతను కాపాడవలసిన వాటి పాలకులు గాని స్వార్థం కోసం వాటిని బలి తీసుకోనంతకాలం అవి వాటి విధిని సవ్యంగా నిర్వర్తిస్తూనే ఉంటాయి. ఆందోళన చెందవలసిన పని లేదు. దేశ రాజ్యాంగం పైన బొత్తిగా గౌరవం లేని కాషాయ పాలకుల హయాంలో ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన స్వతంత్ర సంస్థల వెన్నెముకలు విరిగిపోయాయన్న అభిప్రాయం గట్టిపడింది. ముఖ్య నిర్ణయాలు తీసుకునే పదవుల్లోనివారు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నజరానాలకు ఆశపడకుండా ఉండడం ఒకప్పటి నీతిగా ఉండేది. ఇప్పుడా నీతి ఊరూ పేరూ లేకుండా కొట్టుకుపోయింది.

ఇక్కడ ఒక తాజా వార్తను ప్రస్తావించుకోవాలి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సహా ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేకమంది మీద మనీ లాండరింగ్ వ్యతిరేక కేసులు బిగించి వేధించిన చరిత్ర కలిగి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన సంజయ్ కుమార్ మిశ్రా (65)ను ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ప్రధాని ఆర్థిక సలహా మండలి పూర్తికాల సభ్యునిగా ఇటీవలే నియమించారు. ఈడీగా ఈయన పదవీ కాలాన్ని అనేకసార్లు పొడిగించారు. 2018లో పదవీస్వీకారం చేసిన మిశ్రా పదవీ కాలాన్ని అదే పనిగా పొడిగిస్తూ పోవడాన్ని ప్రతిపక్షాలు సవాలు చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పదవీ కాలాన్ని ఇంకా పొడిగించడానికి సుప్రీంకోర్టు అనుమతించకపోవడంతో 2023 సెప్టెంబర్‌లో మిశ్రా ఆ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో సీజేఐని లేకుండా చేసి కేంద్ర ఎన్నికల సంఘం చేత మోదీ ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటున్నదనే విమర్శ తెలిసిందే. అత్యంత ముఖ్యమైన అయోధ్య వివాదం విచారణకు, రాఫెల్ యుద్ధ విమానాల కేసుకు సారథ్యం వహించి తీర్పులు ప్రకటించిన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసిన వెంటనే రాజ్యసభ సభ్యులయ్యారు. రంజన్ లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో పని చేసిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణను తిన్నగా నడవనీయకుండా చేసి గొగోయి అందులో నుంచి బయటపడ్డారని అనుకున్నారు.


ఇటువంటి ఉదంతాలను ప్రస్తావించి జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతాన్ని చిన్నదిగా చేసి చూపడం, అటువంటివి మామూలే అనిపించేలా చేయడం ఈ వ్యాసకర్త ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కొలీజియంలో లోపాలు ఉన్నమాట వాస్తవం. అందుచేత పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన ఎన్‌జేఏసీ గొప్పదనడం విజ్ఞతాయుతం కానే కాదు. ఎన్‌జేఏసీ ద్వారా కేంద్రంలోని బీజేపీ పాలకులు తమకు విధేయులైన, హిందుత్వ, ఆరెస్సెస్‌ అనుకూలురైన వారిని న్యాయమూర్తులుగా నియమింప జేసుకోవాలని సంకల్పించారు. న్యాయవ్యవస్థ విషయంలో రాజ్యాంగం, దాని మౌలిక స్వరూపం మీద తమకు గల సమగ్ర అవహగాహన వల్ల కొలీజియం విధానమే ఉత్తమమైందని సుప్రీంకోర్టు భావిస్తున్నది. ఎన్‌జేఏసీ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని కాలరాస్తుందని భావించింది. ఇండియాలో పౌర సమాజం పరిణత స్థాయికి చేరుకోనందున న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ఇతర ప్రభుత్వ అంగాల జోక్యానికి అతీతంగా ఉంచడం ద్వారా మాత్రమే దేశ పౌరుల హక్కులను కాపాడగలమని ఎన్‌జేఏసీపై విచారణ జరిపి రాజ్యాంగం 99వ సవరణను కొట్టివేసిన అయిదుగురు జడ్జీల ధర్మాసనానికి అధ్యక్షత వహించిన జస్టిస్ కేహార్ అభిప్రాయపడ్డారు.


జడ్జీలే జడ్జీలను నియమించే కొలీజియం విధానం కూడా లోపరహితమైనది కాదని ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనించాలి. అందుచేత న్యాయ నియామకాల విధానాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉందని కూడా ఈ ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం కలిసి కూర్చుని రాజ్యాంగ మౌలికతకు, దాని పరిపూర్ణ స్ఫూర్తికి అనుగుణమైన కొత్త వ్యవస్థను నెలకొల్పుకోవాల్సిన గట్టి అవసరం ఉంది. సంకుచితమైన స్వార్థ దృష్టికి అతీతంగా ఈ పని జరగాలి.

గార శ్రీరామమూర్తి

సీనియర్‌ పాత్రికేయులు

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 05:07 AM